గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jun 05, 2020 , 00:43:56

ఇన్నోవేటర్‌ విజయ్‌

ఇన్నోవేటర్‌ విజయ్‌

ప్రత్యేక యంత్రాన్ని రూపొందించిన రైతు

ఏకకాలంలో మూడు రకాల పనులు చేసే పరికరం  

కూలీల ఖర్చులు మిగులు.. ఎకరానికి కేవలం రూ.500

తిర్యాణి మండలం నాయకపుగూడ పంచాయతీ పరిధి పెర్కపల్లి గ్రామానికి చెందిన బుద్దే విజయ్‌కుమార్‌ తన పదిహేనో యేటే తండ్రి నందయ్యను కోల్పోయాడు. అప్పటి నుంచి తమకున్న ఐదెకరాల్లో పత్తి సాగు చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. యేటా కూలీల కొరతకు తోడు పెట్టుబడి ఖర్చులు కూడా పెరిగిపోతుండడంతో ఏదైనా ప్రయోగం చేయాలన్న ఆలోచనలో పడ్డాడు. డిగ్రీ వరకు చదువుకున్న విజయ్‌ రెండేళ్లు కష్టపడి ఓ యంత్రాన్ని తయారు చేశాడు. ఇది తయారు చేయడానికి రూ. 30 వేల వరకు ఖర్చు చేశాడు(కొత్తదానికి మార్కెట్‌లో రూ. 45 వేలు). 

ఇన్నోవేటర్‌ తయారీ.. ప్రయోజనాలు..

పాత కల్టీవేటర్‌కు కింది భాగంలో పలుగును అమర్చి పాత రొటోవేటర్‌కు సృజనాత్మకతను జోడించాడు. స్థానికంగా దొరికే మరికొన్ని పరికరాలు జతచేసి అతి తక్కువ ఖర్చుతో ఏకకాలంలో కలుపు తీయడం, కాండం పూత నివారించడం, ఎరువులు వేయడం, మొక్కకు బొట్టుపెట్టే యంత్రాన్ని రూపొందించాడు. కల్టీవేటర్‌కు కింది భాగంలో అమర్చిన పలుగు కలుపు తీస్తుంది. ట్రాక్టర్‌ పై భాగంలో రేకు డబ్బా అమర్చి.. దానికి అనుసంధానంగా కిందికి పైపులను ఏర్పాటు చేశాడు. ట్రాక్టర్‌ వేగానికి అనుగుణంగా తగిన మోతాదులో ఎరువులు పడేవిధంగా సైకిల్‌ చక్రాలు, చైన్‌ను ఏర్పాటు చేశాడు. అవి తిరిగిన కొద్దీ భూమిలోపలికి ఎరువులు వెళ్లే విధంగా సెట్టింగ్‌ చేశాడు. పైపుల ద్వారా ఎరువులు భూమిలో పడగానే.. వెనుక అమర్చిన పలుగు ఎరువులపై మట్టి కూడా కొప్పుతుంది. ఇక పత్తి పంటను ఆశించే ఆకుముడుత, పేనుబంకను నివారించడానికి.. కాండానికి బొట్టుపెట్టే పద్ధతిలో భాగంగా ఒక్కో మొక్కకు పూతలాంటిది వేసేవారు. ఇందుకు భిన్నంగా ఈ యంత్రంతో ఏకకాలంలో మూడు వరుసల్లోని మొక్కలకు మందు పూస్తుంది. ఇందుకోసం గోడలకు రంగులు వేసే పెయింటింగ్‌ బ్రష్‌లను వినియోగించాడు. 

కేవలం రూ.500 ఖర్చుతో..

విజయ్‌ రూపొందించిన బహుళార్ధక యంత్రంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఏకకాలంలో మూడు పనులు జరుగుతుండగంతో ఖర్చులు మిగులుతున్నాయి. మామూలుగానైతే పత్తిపంటకు సకాలంలో మూడుసార్లు కలుపు తీయడం, కాండానికి బొట్టు పెట్టడం, ఎరువులు వేయడం చేస్తుంటారు. ఒక ఎకరంలో ఈ మూడు పనులు చేయడానికి ఒక్క రోజే కూలీలకు రూ. 2,600 ఖర్చు అవుతుంది. మూడుసార్లు చేయడం వల్ల రూ.7800 దాకా ఖర్చు అవుతుంది. అదే ఇన్నోవేటర్‌తో అయితే ఎకరానికి రెండున్నర లీటర్ల డీజిల్‌, డ్రైవర్‌ ఖర్చుతో కలిసి కేవలం రూ.500తో అరగంటలో పై మూడు పనులు పూర్తి చేసుకోవచ్చు. ఈ ఇన్నోవేటర్‌తో ఎరువులు వృథాకాకుండా మొక్కకు అవసరమైన పోషకాలు అందుతాయి.

కేటీఆర్‌ చేతుల మీదుగా అవార్డు..

విజయ్‌ కనిపెట్టిన ఈ వినూత్న యంత్రానికి మండల, జిల్లా స్థాయిలోనేగాకుండా రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చింది. 2019, అక్టోబర్‌ 18న మంత్రి కేటీఆర్‌ ఉత్తమ ఇన్నోవేటర్‌గా విజయ్‌కి పురస్కారాన్ని అందజేసి అభినందించారు. ముంబాయిలో జాగృతియాత్ర, కోకోకోలా కంపెనీ ప్రతినిధులతో సస్టనేబుల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ అవార్డు కూడా అందుకున్నాడు.

మరిన్ని ప్రయోగాలు చేస్తా..

2006లో నాన్న చనిపోయాడు. అప్పటి నుంచి మాకున్న ఐదెకరాల్లో పత్తి పంట వేస్తున్న. కూలీలు దొరుకక మస్తు ఇబ్బందులు పడాల్సి వచ్చిం ది. పంట చేతికి వచ్చిన తర్వాత ఖర్చులన్నీ తీస్తే.. ఏం లాభం లేకుం ట అవుతుంది. అందుకే ఏదైన యంత్రం తయారు చేయాలనుకున్న. రెండేళ్ల నుంచి (2017-18) కష్టపడి ఇన్నోవేటర్‌ను తయారు చేసిన. ఇది ఒకేసారి మూడు పనులు చేస్తుంది. ఖర్చులు మిగులుతున్నయి. నా యంత్రాన్ని చూసి చాలా మంది కూడా తయారు చేసుకున్నరు. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని ప్రయోగాలు చేస్తా.     - విజయ్‌, యువరైతు 

గొప్ప విషయం

విజయ్‌ ఈ పరికరాన్ని తయారు చేయడానికి నిరంతరంగా శ్రమించాడు. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కూలీల ఖర్చులు మిగులు తాయి. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఉత్తమ ఇన్నోవేటర్‌గా పురస్కారం అందుకున్నాడు. మారుమూల గ్రామానికి చెందిన విజయ్‌ ఈ యంత్రాన్ని తయారు చేయడం గొప్ప విషయం.  - తిరుమలేశ్వర్‌, వ్యవసాయ అధికారిlogo