మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - May 29, 2020 , 02:28:59

కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ.. పదోతరగతి పరీక్షలు నిర్వహించాలి

కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ.. పదోతరగతి పరీక్షలు నిర్వహించాలి

 కుమ్రంభీం ఆసిఫాబాద్‌ డీఈవో పాణిని 

 హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో సమావేశం

కాగజ్‌నగర్‌ రూరల్‌ : కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ పదోతరగతి పరీక్షలను నిర్వహించాలని కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా విద్యాధికారి పాణిని సూచించారు. గురువారం పట్టణంలోని డీఆర్సీ భవనంలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో ఒక బెంచీని ఒక్కరికి మాత్రమే కేటాయించాలన్నారు. విద్యార్థులకు గ్లౌస్‌లు, మాస్క్‌లను పంపిణీ చేస్తామని తెలిపారు. కంటైన్‌మెంట్‌ నుంచి వచ్చే విద్యార్థులను గుర్తించి ప్రత్యేక గదిని కేటాయించాలని సూచించారు. ప్రతీ రోజు పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేయాలన్నారు. కాగజ్‌నగర్‌లో 11 కొత్త సెంటర్లు, 35 పాత సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నా రు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏసీ ఉదయ్‌బాబు, డీసీఈబీ కార్యదర్శి శంకరయ్య, ఎంఈవో భిక్షపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థికి మాస్కు పంపిణీ

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌) : పదో తరగతి పరీక్షలు రాసే ప్రతి విద్యార్థికి మాస్కు అందించాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై గురువారం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారులు సీఎస్‌, డీవోలతో నిర్వహించిన సమావేశంలో డీఈవో మాట్లాడారు. పరీక్షలు నిర్వహించే సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థి తాగేందుకు మంచినీరు ఇంటి నుంచి తెచ్చుకోవాలన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్‌, శానిటైజర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రతీ కేంద్రాన్ని పరీక్షకు ముందు, తర్వాత హైపోక్లోరైట్‌ ద్రావణంతో మొత్తం శుభ్రం చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో మొత్తం 113 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీజీఈ దామోదర్‌రావు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.logo