సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - May 26, 2020 , 23:57:39

మూడోసారి..

మూడోసారి..

  జూన్‌ ఒకటి నుంచి రేషన్‌ అందించనున్న సర్కారు

 ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కార్డుపై కేజీ కంది పప్పు

సర్కారు నిర్ణయంతో  లబ్ధిదారుల్లో ఆనందం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలెవ్వరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో సర్కారు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కార్డుపై కిలో కందిపప్పు, రూ.1500 ఇవ్వాలని నిర్ణయించి పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే ఏప్రిల్‌, మే నెలల్లో అందించగా, మూడో విడుతకూ సన్నద్ధమవుతున్నది. జూన్‌ కోటాకు సంబంధించి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి డీలర్లకు చేరుకుంటుండగా, ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు సంబం ధిత శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇక ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 కుమ్రం భీం ఆసిఫాబాద్‌/మంచిర్యాల, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల (కిలోకు రూపాయి) చొప్పున బియ్యం పంపిణీ చేస్తుండగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కోటాను రెట్టింపు చేసింది. నిరుపేదలు పస్తులుండకుండా ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యం, ఒక్కో కార్డుపై కిలో కందిపప్పు, రూ.1500 అందించాలని  నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏప్రిల్‌, మే నెలల్లో ఉచితంగా బియ్యం, కంది పప్పు ఇవ్వగా.. ఒక్కో కార్డుపై రూ.1,500 చొప్పున అందించారు. తాజాగా జూన్‌ నెలకు సంబంధించి ఒక్కో లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం, కిలో కంది పప్పు ఉచితంగా ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి బియ్యాన్ని రేషన్‌ దుకాణాలకు పంపిస్తున్నారు. జూన్‌ 1 నుంచి పంపిణీ చేయనున్నారు. కంది పప్పు గోదాములకు చేరుకోగానే.. దుకాణాలకు పంపించనున్నారు. కాగా, ఆర్థిక సాయానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.

మంచిర్యాల జిల్లాలో..

జిల్లాలో 423 రేషన్‌ దుకాణాలుండగా, 2,14, 759 కార్డులు ఉన్నాయి. ఇందులో 1,99,165 ఆహార భద్రత కార్డులు, 15,423 అంత్యోదయ కార్డులు, 171 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. 6,42,453  మంది లబ్ధిదారులు ఉన్నారు. ఏప్రిల్‌లో 7384.601 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయించగా, 6659.179 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేశారు. మే నెలలో 7454.092 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయించగా, 7338. 670 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేశారు. 

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో..

జిల్లాలోని 15 మండలాల్లో 278 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,37,487 మంది  లబ్ధిదారులు ఉన్నారు. ఏప్రిల్‌లో 4800 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేయగా, మే నెలల కూడా 4800 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేశారు. 


logo