శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - May 24, 2020 , 23:48:55

ఆపద్బాంధవులు

ఆపద్బాంధవులు

విపత్కర పరిస్థితుల్లో అండగా.. 

 ప్రమాదమని తెలిసినా ధైర్యంగా సేవలు

ఉమ్మడి జిల్లాలో 8 అంబులెన్స్‌లు కరోనాకు కేటాయింపు

గాంధీకి 91 మంది, క్వారంటైన్‌కు 1708 మంది తరలింపు

కోటపల్లి : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33 వాహనాలు ఉండగా, ఆదిలాబాద్‌ జిల్లాలో 9, నిర్మల్‌లో 6, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 9, మంచిర్యాల జిల్లాలో 9 అంబు లెన్స్‌లు ఉన్నాయి. వీటిలో జిల్లాకు రెండు చొప్పున కొవిడ్‌-19 సేవలకు కేటాయించారు. నాలుగు జిల్లాలకు కలిపి 72 మంది ఈఎంటీలు, 73 మంది ఫైలెట్‌లు విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కరోనా లక్షణాలు కనిపించినప్పటి నుంచి 108 సిబ్బంది నిరంతరం సేవలను అందిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కలిగిన 1708 మందిని ఆయా జిల్లాలోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. పాజిటివ్‌ వచ్చిన 91 మందిని హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. ఇందులో క్వారంటైన్‌కు తరలించిన వారిలో ఆదిలాబాద్‌ నుంచి 879, నిర్మల్‌ నుంచి 166, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి 213, మంచిర్యాల జిల్లా నుంచి 450 మంది ఉన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో ఆదిలాబాద్‌ జిల్లా నుంచి 27 మందిని, నిర్మల్‌ నుంచి 27, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి 10, మంచిర్యాల జిల్లా నుంచి 26 మందిని గాంధీ ఆసుపత్రికి, ఒకరిని కింగ్‌ కోటి దవాఖానకు 108 అంబులెన్స్‌లో తరలించారు. 

సమర్థవంతంగా విధులు

ప్రమాదమని తెలిసినా కరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించేందుకు 108 సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ కరోనా లక్షణాలు కలిగిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. కరోనా లక్షణాలున్న వారిని హైదరాబద్‌లోని గాంధీ దవాఖానకు తరలించడం మొదలు.. అంబులెన్స్‌ను శుభ్రం చేసే వరకు నిత్యం మృత్యువుతో చెలగాటం ఆడడంలాంటిదే. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ 108 సిబ్బంది రోగులకు సేవలను అందిస్తున్నారు. కరోనా పేషెంట్‌ను తరలించే సమయంలో 108 సిబ్బంది తప్పనిసరిగా పీపీఈ కిట్స్‌, మాస్కులు ధరించడంతోపాటు శానిటైజర్లు వాడుతున్నారు. రోగులను దవాఖానలో చేర్పించిన తర్వాత అంబులెన్స్‌ను సోడియం హైపో క్లోరైట్‌తో శుభ్రం చేస్తున్నారు.

కష్టమే అయినా..

కరోనా రోగులను పక్కన పెట్టుకొని పనిచేయడం ప్రమాదమే. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరవుతున్నాం. బెల్లంపల్లి ఐసొలేషన్‌ నుంచి పాజిటివ్‌ వచ్చిన వారిని హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలిస్తున్నాం. కుటుంబానికి దూరంగా ఉండడం కొంత బాధే. ఆపత్కాలంలో సేవలందిస్తున్నామన్న సంతృప్తి ఉంది.

- కిష్టయ్య, ఈఎంటీ, బెల్లంపల్లి

జాగ్రత్తలు తీసుకుంటున్నం

కరోనా నిర్ధారణ అయిన పేషెంట్లకు సేవలు అందించడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు వాడుతున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించడం గర్వంగా ఉంది. ఉన్నతాధికారుల సూచనల మేరకు విధులు నిర్వహిస్తూ కరోనా నియంత్రణలో భాగస్వామ్యులవుతున్నాం.  

- సీహెచ్‌ సతీశ్‌, ఫైలెట్‌, బెల్లంపల్లి

సిబ్బంది సేవలు గొప్పవి

కరోనా అనుమానితులు, వ్యాధి బారిన పడ్డ వారికి ఈఎంటీ, ఫైలెట్ల అందిస్తున్న సేవలు గొప్పవి. మృత్యువుతో చెలగాటమైనప్పటికీ సిబ్బంది ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు సాగుతున్న సిబ్బందిని చూసి గర్వపడుతున్నాం. పీపీఈ కిట్లను ఇచ్చి వారిని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. 

- విజయ్‌కుమార్‌, 108 ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రోగాం మేనేజర్‌


logo