శనివారం 06 జూన్ 2020
Mancherial - May 24, 2020 , 00:10:18

అరచేతిల్లోనే అరలక్ష క్రిములు

అరచేతిల్లోనే అరలక్ష క్రిములు

మనం నిత్యం వాడే వస్తువులపై హానికారకాలు

 సెల్‌ఫోన్‌పైనే 25 వేల రకాలు?

 టాయిలెట్‌కు మించి పదిరెట్లు అధిక బ్యాక్టీరియా 

 కీ బోర్డులు, రిమోట్లు, లిఫ్ట్‌లపై అదే ప్రభావం 

 అప్రమత్తతే రక్ష అంటున్న పరిశోధనలు 

కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు అనేక రక్షణ చర్యలు పాటిస్తున్నాం. బయట పడేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాం. అయినా.. ఏ రూపంలో దాడి చేస్తుందోనన్న ఆందోళన ఉన్నది. కానీ, ఈ వైరస్సే కాదు, నిర్లక్ష్యం చేస్తే మనం నిత్యం వినియోగించే వస్తువుల ద్వారా కూడా అనేక జబ్బులు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి వివిధ అధ్యయనాలు. సెల్‌ఫోన్‌, లిఫ్ట్‌, రిమోట్‌ వంటి తదితర వస్తువులపై యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజోనా (అమెరికా), కొలంబియా యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ క్లినికల్‌ మైక్రో బయాలజీ వంటి పలు సంస్థలు పరీక్షలు నిర్వహించాయి. వాటి ప్రకారం చూస్తే.. మనం వినియోగిస్తున్న వస్తువుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది.             

 - కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

 సెల్‌ఫోన్‌

మనం నిత్యం వివిధ రకాల వస్తువులను తాకుతూ సెల్‌ఫోన్‌ను పట్టుకుంటాం. దగ్గుతూనే మాట్లాడుతుంటాం. పనిచేసేటప్పుడు.. టేబుల్‌పై దుమ్ములోనే పడేస్తాం. ఒక్కోసారి సెల్‌ఫోన్‌ పెట్టేటప్పుడు.. ఆ స్థలంలో ఏముందో పెద్దగా గమనించం. దీని వల్ల వివిధ రకాల బ్యాక్టీరియా ఫోన్‌పైకి చేరుతుంది. ఇవేవీ గమనించకుండానే ఫోన్‌ను వినియోగిస్తాం. అదే చేతులతో ఆహార పదార్థాలను తింటాం. దీని వల్ల అనారోగ్యం బారిన పడక తప్పదంటున్నాయి వివిధ రకాల ఆధ్యయనాలు. ఆయా సంస్థలు నిర్వహించిన సర్వే ప్రకారం చూస్తే.. సెల్‌ఫోన్‌పై సుమారు 25 వేల రకాల క్రిములుంటాయని గుర్తించారు. వీరు చేసిన పరిశోధనల్లో 90 శాతానికి పైగా ఫోన్లపై బ్యాక్టీరియా ఉంటుందని గుర్తించారు. టాయిలెట్‌లో ఉండే క్రిములకన్నా.. పది రెట్లు అధికంగా సెల్‌ఫోన్‌పై ఉంటున్నాయని వెల్లడించారు. స్టాప్‌లా, కొయాడ్యులేజ్‌, ఇకోలి, స్ట్రెప్టో కోకస్‌ వంటి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అయితే, అన్ని క్రిములు హానికరం కాదన్న పరిశోధనలు.. మెజార్టీ బ్యాక్టీరియా ద్వారా మాత్రం ఇబ్బందులు తప్పవని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా వల్ల చర్మ, ఎముక సంబంధిత వ్యాధులు అలాగే బ్లడ్‌లో ఇన్‌ఫెక్షన్‌ వంటివి వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నాయి. ఇవేకాదు, ఎవరైనా అనారోగ్యంగా లేదా దగ్గు, దమ్ము ఉండి మాట్లాడితే.. సదరు వ్యక్తి నుంచి బ్యాక్టీరియా ఫోన్‌పైకి వ్యాప్తి చెందుతుని కొలంబియా యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ క్లినికల్‌ మైక్రో బయాలజీ పరిశోధన స్పష్టం చేస్తున్నది.

కరెన్సీ.. 

కరెన్సీ కొన్ని వేల చేతులు మారుతుంటుంది. వీటిపై ఎక్కువ శాతం క్రిములుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాల శాస్త్రవేత్తలు కరెన్సీపై అనేక పరిశోధనలు చేశారు. వీటిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఉండే పాలిమర్‌ నోట్లపై తక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా ఉందని గుర్తించారు. చైనా, భారత్‌, పాకిస్థాన్‌, తదితర దేశాల్లోనే పేపర్‌ ఆధారిత నోట్లపై క్రిములు ఎక్కువగా ఉంటాయని కనుగొన్నారు. ఒక అంగుళం వెడల్పు ఉండే నోట్లపై దాదాపు 100 క్రిములుండే ముప్పు ఉన్నది. ఇవి చాలా వేగంగా మానవ శరీరంపై దాడిచేస్తాయి. 

లిఫ్ట్‌..

ప్రస్తుతం నగరాల్లో లిఫ్టుల సంఖ్య పెరుగుతున్నది. అపార్ట్‌మెంట్లలో ఎక్కువగా వాడకం ఉంటున్నది. చిన్న చిన్న పనులకు సైతం లిఫ్టులను వాడడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఒక్కో గేటెడ్‌ కమ్యూనిటీ అపార్టుమెంట్లో రోజుకు ఒక్కో లిఫ్టును కొన్నివేల మంది వినియోగిస్తున్నారు. అలాగే దవాఖానలు, షాపింగ్‌మాల్స్‌లో కూడా నిత్యం వేలాది మంది వీటిని వాడుతున్నారు. ఆయా సంస్థలు జరిపిన పరిశోధనలను బట్టి చూస్తే.. నివాస ప్రాంతాల్లోని లిఫ్టులకన్నా.. రద్దీ ప్రాంతాల్లో వినియోగించే లిఫ్టుల్లో వందశాతం క్రిములు ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. 

రిమోట్‌.. 

ప్రస్తుతం ప్రతి ఇంట్లో టీవీ సర్వసాధారణమైంది. ఒకప్పుడు లేచి టీవీ దగ్గరకు వెళ్లి ఆన్‌ఆఫ్‌ చేసే వారు. చానల్‌ మార్చే వారు. కానీ, ప్రస్తుతం రిమోట్‌ ఉంటే సరిపోతున్నది. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న సమయంలో, అలాగే దగ్గినా, తుమ్మిన సమయంలో నోటి నుంచి వెలువడే బ్యాక్టీరియా రిమోట్‌పైకి చేరుకుంటుంది. అంతేకాదు, హోటళ్లు, దవాఖానల్లోని రిమోట్లలో సూక్ష్మక్రిములు అత్యధికం. ఒక రిమోట్‌పై సుమారు 300 రకాలకుపైగా క్రిములుంటాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. 

కీ బోర్డులు.. 

కంప్యూటర్‌తో మనిషి జీవితం అనుసంధానమైంది. ఇంటి నుంచి ఆఫీస్‌ వరకు దానిపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఇటీవలి కాలంలో వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం కంప్యూటర్‌ కోర్సులు వస్తే తప్ప ఉద్యోగాలు దొరకని పరిస్థితి. కంప్యూటర్లు.. కీ బోర్డులు, మౌస్‌లు. వీటిపై అనేక సర్వేలు జరిగాయి. ఇంటర్నెట్‌ సెంటర్లు, సైబర్‌ కేఫ్‌లలో వాడే కీబోర్డులు మరింత ప్రమాదకరమంటున్నాయి పరిశోధనలు. సాధారణంగా వినియోగించే కీ బోర్డులకన్నా.. ఇంటర్నెట్‌, సైబర్‌ కేఫ్‌లలో వినియోగించే కీ బోర్డులపై వంద రెట్లు ఎక్కువగా క్రిములుంటాయని గుర్తించారు. వీటి ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులతోపాటు రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. 

అప్రమత్తతే రక్ష 

ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా బారిన పడకుండా ఉండాలంటే.. ఆహారం తీసుకునే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. అపరిశుభ్రంగా ఉన్న చోట సెల్‌ఫోన్‌ ఉంచకుండా చూసుకోవడం, ఫోన్‌ను మృదువైన మైక్రో ఫైబర్‌ వస్త్రంతో తుడవాలి. ఇలా చేయడం వల్ల అనేక స్మూక్ష్మక్రిములు తొలిగిపోతాయి. అలాగే 60 శాతం నీరు, 40 శాతం ఆల్క్‌హాల్‌ కలిపిన ద్రావణంలో వస్ర్తాన్ని ముంచి ఫోన్‌ను తుడవడం వల్ల బ్యాక్టీరియా ముప్పునుంచి బయట పడవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, అప్రమత్తతే మనకు రక్ష అని సూచిస్తున్నాయి. logo