బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - May 04, 2020 , 02:24:05

కరోనా కట్టడికి మల్టీ స్ప్రేయర్‌

కరోనా కట్టడికి మల్టీ స్ప్రేయర్‌

  • కరీంనగర్‌ వాసి షేక్‌ మస్తాన్‌వలీ మరో ఆవిష్కరణ
  • తక్కువ ఖర్చుతో కొత్త పరికరం తయారీ
  • సోలార్‌, ఏసీ, డీసీ కనెక్షన్‌తో నడుస్తున్న యంత్రం 
  • గతంలో ఆముదంతో నడిచే ఇంజిన్‌కు రూపకల్పన

షేక్‌మస్తాన్‌ వలీ.. ఆయనో మామూలు బైక్‌ మెకానిక్‌. ఏసీ, రిఫ్రిజిరేటర్‌, కూలర్‌ రిపేరర్‌. చదివింది తక్కువే. కానీ, ఏదో ఒక కొత్త ఆవిష్కరణ చేయాలనే తపన. అందులో భాగంగానే గతంలో ఆముదంతో నడిచే క్రయోజనిక్‌ ఇంజిన్‌కు రూపకల్పన. తాజాగా కరోనా కట్టడికి రసాయనాలు పిచికారీ చేసేందుకు ఓ మల్టీ స్ప్రేయర్‌ తయారీ. తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ పరికరం, కేవలం 7 కిలోల బరువు ఉంటుంది. చిన్న ఇల్లు మొదలుకుని పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, వీధులు, మురుగు కాలువలు, చివరికి రైతుల చేలలో వాలిన క్రిమి కీటకాలను నాశనం చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

- కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

పరికరం ప్రత్యేకత.. 

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పవర్‌ స్ప్రేయర్ల కనిష్ఠ ధర 40 వేల నుంచి మొదలవుతుంది. అవి పెట్రోల్‌ పోస్తే గానీ నడువవు. భూం స్ప్రేయర్లను వినియోగించు కోవాలంటే ట్రాక్టర్‌ వంటి వాహనాలు తప్పనిసరి. వీటి బరువు ఎక్కువ అయినందున మోసుకెళ్లడం కష్టంగా ఉంటుంది. కొన్ని స్ప్రేయర్లు కరెంట్‌తోనూ నడుస్తాయి. ఈ సదుపాయం అంతటా ఉండదు. హ్యాండ్‌ పవర్‌ స్ప్రేయర్లతో శ్రమ ఎక్కువ. షేక్‌ మస్తాన్‌వలీ రూపొందించిన మల్టీ స్ప్రేయర్‌ వీటన్నింటికీ భిన్నం. సోలార్‌, ఆల్టర్‌నెట్‌ కరెంట్‌, డైరెక్ట్‌ కరెంట్‌ ఇలా ఏది అందుబాటులో ఉంటే దానిని వినియోగించుకోవచ్చు. ఇల్లు, అపార్ట్‌మెంట్లు, వీధులు, రైతు క్షేత్రాల్లో ఎక్కడైనా క్రిములను నాశనం చేసేందుకు దీనిని ఉపయోగిం చవచ్చు. ప్రస్తుతం 5 వాట్స్‌తో రూపొందించిన స్ప్రేయర్‌తో 200 అడుగుల వరకు స్ప్రే చేయవచ్చు. ఈ పరికరం తయారీకి 15 వేల వరకు ఖర్చయినట్లు మస్తాన్‌వలీ తెలిపారు. ఇంకా 12 వాట్స్‌ నుంచి 24 వాట్స్‌ వరకు ఉపయోగించి ఈ పరికరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, 12 వాట్స్‌తో స్ప్రేయర్‌ తయారు చేస్తే 20 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లోనూ ఒకేసారి శానిటేషన్‌ చేసుకోవచ్చని చెబుతున్నారు. 

నిరంతర ప్రయోగశీలి..  

కర్నూలు జిల్లాకు చెందిన షేక్‌మస్తాన్‌ వలీ బతుకుదెరువు కోసం పాతికేళ్ల క్రితం కరీంనగర్‌కు వచ్చి బైక్‌మెకానిక్‌గా స్థిరపడ్డారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు బాగు చేస్తుండేవారు. ఏదో ఒకటి కనుగొనాలనే తపనతో వచ్చే సంపాదనలో సింహభాగం ప్రయోగాలకే కేటాయించేవారు. ఆయన చేసిన ప్రయోగాల్లో చెప్పుకోదగినది ఆముదంతో నడిచే కాలుష్య రహిత  ఇంజిన్‌. దీనిపై లక్షలు ఖర్చు పెట్టిన ఆయన, అప్పుల పాలై మెకానిక్‌ పని మానేశారు. తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం ల్యాబ్‌ ఇన్‌చార్జిగా అవకాశమివ్వగా, తన అనుభవాన్ని రంగరించి ఇంజినీరింగ్‌ పుస్తకాల ఆధారంగా పలు ప్రయోగాలు చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో సెల్‌ఫోన్‌ సైజ్‌లో ఉండే వెంటిలేటర్‌ను కూడా ప్రదర్శిస్తానని స్పష్టం చేస్తున్నారు.


logo