శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - May 01, 2020 , 01:48:08

రైతులను రెచ్చగొడితే సహించం

రైతులను రెచ్చగొడితే సహించం

  • ధాన్యం కొనుగోళ్లపై అనవసర రాద్దాంతం
  • రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి రూరల్‌: ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే సహించేది లేదని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హెచ్చరించారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సమీక్షించి, అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతిగా పనిచేస్తూ, రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిపారని చెప్పారు. ఇంతటి ఘన కీర్తిని ఓర్వలేని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, తదితరులు ఒక్కోచోట ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని, తాలు, తరుగు పేరిట రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 2014కు ముందు 2020 తర్వాత వ్యవసాయం ఎలా ఉన్నదో గమనించాలని, ఇవ్వాళ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా పచ్చని పంట పొలాలే దర్శనమిస్తున్నాయని, అందుకు రాష్ట్ర సర్కారు ముందు చూపు నిర్ణయాలే కారణమన్నారు. అసలు కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎంత ధాన్యం కొంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక్కో రైతు నుంచి కేవలం 12 క్వింటాళ్ల్లే కొంటామని చెప్పి చేతులెత్తేసిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌ రెడ్డి, కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు స్వీకరించాకే రైతులకు మంచిరోజులు వచ్చాయని చెప్పారు. గత పాలకులు వ్యవసాయం దండగ అన్నారనీ, కానీ ఇవ్వాళ పండుగలా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. అంతకుముందు కొవిడ్‌-19, ఉపాధి పనుల నిర్వహణపై మంత్రి కొప్పుల సమీక్షించారు. జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలతోనే కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగామని చెప్పిన ఆయన, అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించారు. ఇక్కడ మేయర్‌ అనిల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వినోద్‌, డీఏవో తిరుమల్‌ ప్రసాద్‌, మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌ రెడ్డి, డీఎంహెచ్‌వో సుధాకర్‌, జిల్లా ప్రధాన దవాఖానల సూపరింటెండెంట్‌ మందల వాసుదేవ రెడ్డి ఉన్నారు.