మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - May 01, 2020 , 01:45:17

ఒక్క కేసు నెగెటివ్‌ వస్తే గ్రీన్‌జోన్‌గా కరీంనగర్‌

ఒక్క కేసు నెగెటివ్‌ వస్తే గ్రీన్‌జోన్‌గా కరీంనగర్‌

  • వైరస్‌ నియంత్రణలోపాలకవర్గ పనితీరు అభినందనీయం
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ 
  • కార్పొరేషన్‌లో ‘ఈ ఆఫీస్‌' ధానం ప్రారంభం 
  • నగరంలో నిత్యావసరాలు పంపిణీ
  • పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలని పిలుపు

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: ఉద్యమాలకు పెట్టింది పేరైన కన్నారం.. ఇప్పుడు కరోనా కట్టడికి అదే స్ఫూర్తితో సంఘటిత పోరాటం చేసిందని, ప్రజలందరి సహకారంతో వైరస్‌ను నియంత్రించగలిగామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. మహమ్మారిని అడ్డుకోవడంలో కరీంనగర్‌ బల్దియా పాలకవర్గ కృషి అభినందనీయమని ప్రశంసించారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గురువారం ఆయన నగరంలో విస్తృతంగా పర్యటించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ‘ఈ ఆఫీస్‌' విధానాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రకాశంగంజ్‌ వద్ద మేరు కులస్థులకు నిత్యావసరాలు అందజేశారు. కొత్తపల్లి కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లను పరిశీలించి, హమాలీలకు మాస్కులు అందించారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు సహకారంతో స్థానిక శివనగర్‌లో కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌ నియోజకవర్గాలకు చెందిన పేద క్రైస్తవులకు పంపిణీ చేశారు. నగర బస్టాండ్‌ సమీపంలో దాతల సహకారంతో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామని, నగరపాలక సంస్థ నుంచి సేవలు సులువుగా పొందేందుకే ఈ ఆఫీస్‌ విధానాన్ని తీసుకవచ్చామని చెప్పారు. మొదటి ఫైల్‌గా నగరంలో రోజు నీటి సరఫరాకు సంబంధించిన ఫైల్‌ను మంజూరు చేశామని, ఈ విధానంలో ఫైల్‌ ట్రాకింగ్‌ను కూడా తీసుకురావాలన్నారు. దీంతో ప్రజలు తమ పనుల కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోతుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేస్తున్నారని, కరోనా కట్టడిలో ప్రజలతో మమేకమై దే శం మొత్తం హర్షించే విధంగా పని చేశారని కితాబిచ్చారు. పాలకవర్గ కృషిని సీఎం కేసీఆర్‌ కూడా అభినందించారని చెప్పారు. దేశమే ఉలిక్కిపడేలా నగరంలో మార్చి 17న  ఎనిమిది పాజిటివ్‌ కేసులు వచ్చాయని, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. ప్రజల సహకారం మరువలేనిదన్నారు. ప్రస్తుతం ఒకే ఒక్క పాజిటివ్‌ కేసు ఉందని, రెండురోజుల్లో అది కూడా నెగెటివ్‌గా వస్తే కరీంనగర్‌ గ్రీన్‌జోన్‌గా మారుతుందన్నారు. అయినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ రేషన్‌కార్డుదారులకు ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, ఇంటికి 1500 ఇచ్చారన్నారు. వివిధ కుల వృత్తులు చేసుకొని జీవించే పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి కోరారు. నియోజకవర్గంలోని 25 వేల కుటుంబాలకు సరుకులు అందిస్తున్నామని తెలిపారు. ఆయనవెంట ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ స్వరూపారాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లున్నారు. 


logo