మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Apr 13, 2020 , 02:49:26

పాడి రైతుల ఔదార్యం

పాడి రైతుల ఔదార్యం

  • కరీంనగర్‌ డెయిరీ 15 లక్షల వితరణ
  • 3 వేల మందికి తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు  
  • అందజేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌ 
  • స్ఫూర్తిగా నిలిచిన చైర్మన్‌ సీహెచ్‌ రాజేశ్వర్‌రావు
  • ఇదివరకే సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 10 లక్షల విరాళం 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన అసహాయులపై కరీంనగర్‌ జిల్లా పాడి రైతులు ఔదార్యం చూపారు. ఇప్పటికే డెయిరీ ఉద్యోగులు ఒక రోజు వేతనం 10లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చైర్మన్‌ రాజేశ్వర్‌రావు అందించారు. తాజాగా ఆయన పిలుపు మేరకు డెయిరీ పరిధిలోని పాల సేకరణ కేంద్రాల్లోని 70 వేల మంది సభ్యులు 15 లక్షలు విరాళంగా అందించారు. ఈ మొత్తంతో నగరంలోని 3 వేల మంది ఆటో డ్రైవర్లు, నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి మంచి నూనె, పప్పులు, చింత పండు, ఉప్మా రవ్వ, కారంపొడి ఇలా తొమ్మిది రకాల నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఆదివారం డెయిరీ ఆధ్వర్యంలో నిత్యావసరాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ, కరోనా నివారణకు కరీంనగర్‌ డెయిరీ తన వంతు కృషిగా పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరిన్ని సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుతో రాష్ట్రంలోని అనేక సంస్థలు ముందుకు వచ్చి పేదలను ఆదుకుంటున్నాయని తెలిపారు. కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావును ప్రత్యేకంగా అభినందించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, నగర మేయర్‌ సునీల్‌రావు, తదితరులు పాల్గొన్నారు.  

ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి..

కరీంనగర్‌రూరల్‌: భవిష్యత్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగులు దవాఖానకు వస్తే ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, ముందస్తుగా సిద్ధంగా ఉండాలని ప్రతిమ దవాఖాన నిర్వాహకులకు వినోద్‌కుమార్‌ సూచించారు. ఆయన మంత్రి గంగులతో కలిసి ప్రతిమ దవాఖానను సందర్శించారు. ఐసొలేషన్‌ వార్డులో ఏర్పాటు చేసిన 30 బెడ్స్‌ను పరిశీలించారు. కలెక్టర్‌ శశాంక, వైద్యశాల సీఏవో రామచంద్రరావు, వైద్యశాల డీన్‌ వివేకానంద్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ అమిత్‌కుమార్‌తో ఏర్పాట్లపై చర్చించారు. 


logo