గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Apr 07, 2020 , 03:08:35

ప్రతి గింజా కొంటాం..

ప్రతి గింజా కొంటాం..

  • నిర్దేశించిన తేదీల్లో ధాన్యం తీసుకురావాలి
  • కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లూ చేశాం
  • ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి
  • మంత్రి గంగుల కమలాకర్‌
  • జిల్లాలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/గంగాధర/ కరీంనగర్‌ రూరల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రతి ధాన్యం గింజనూ కొంటామని, రైతులు నిర్దేశించిన తేదీల్లోనే ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. గంగాధరతోపాటు కొండాయపల్లి, కురిక్యాల గ్రామాల్లో ధాన్యం, కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. జిల్లాలో 2.19 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ఊరికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్రాల వద్దకు ధాన్యం, మక్కలు తెచ్చే రైతులు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కేంద్రం వద్ద శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. వాటితో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, కొనుగోళ్ల విషయంలో ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత, మార్క్‌ఫైడ్‌ చైర్మన్‌ మారం గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

కొనుగోళ్లు మొదలాయె.. 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ధాన్యం, మక్కల కొనుగోళ్లు మొదలయ్యాయి. మొదటి రోజు ఉత్సాహంగా సాగాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల మండలాల్లో, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ రాయికల్‌లో మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సైదాపూర్‌ మండలం గుజ్జులపల్లి, బొమ్మకల్‌, దుద్దెనపల్లి గ్రామాల్లో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి మక్కల కేంద్రాన్ని, హుజూరాబాద్‌ మండలం పోతురెడ్డిపేటలో జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్లు కొండాల్‌ రెడ్డి, చిగురుమామిడితోపాటు ఇందుర్తి, బొమ్మనపల్లి గ్రామాల్లో స్థానిక జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్‌, ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్‌, సింగిల్‌విండో చైర్మన్‌ జంగ వెంకటరమణారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.


logo