ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Mar 30, 2020 , 01:05:11

మహమ్మారిపై సమష్టి యుద్ధం

మహమ్మారిపై సమష్టి యుద్ధం

  • కరోనా కట్టడికి సమన్వయంతో పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలు
  • పకడ్బందీగా నివారణ చర్యలు.. అలుపెరగకుండా సేవలు 
  • ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న అధికారులు 
  • ఇళ్ల నుంచి బయటకు రాకుండా అవగాహన కార్యక్రమాలు 
  • విజయవంతంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం సమష్టిగా యుద్ధం చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపుతో జిల్లాల వారీగా రంగంలోకి దిగి, నివారణ చర్యలు చేపడుతున్నది. వైద్య, ఆరోగ్య, పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ శాఖలతోపాటు మరి కొన్ని శాఖలు ఈ విపత్కర సమయంలో తమవంతు బాధ్యతను పక్కాగా నిర్వర్తిస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించి, ఇండ్లకే పరిమితం చేస్తూ లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న కరీంనగరంలో పకడ్బందీగా వ్యవహరిస్తూ, స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.           

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: విశ్వమారి కరోనా కట్టడికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 22న ప్రజలు జనతా కర్ఫ్యూ పాటించారు. వైరస్‌ తీవ్రతను గమనించిన సీఎం రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని వచ్చే నెల 14 వరకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులు సమష్టిగా శ్రమిస్తున్నారు. మహమ్మారిని నియంత్రించేందుకు వైద్య, ఆరోగ్య, పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ, అగ్నిమాపక, విద్యుత్‌ శాఖల ఆధ్వర్యంలో అలుపెరగని యుద్ధం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే, పకడ్బందీగా నివారణ చర్యలు చేపడుతున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే జిల్లా అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ఒక్కో మండలానికి ఒక్కో ఇన్‌చార్జిని నియమించి, హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా ఐసోలేషన్‌ వార్డులకు నోడల్‌ అధికారులుగా పనిచేస్తున్నారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సుమారు నాలుగు వేల మంది మూడు షిఫ్టులుగా రేయింబవళ్లూ పహారా కాస్తున్నారు. జిల్లా సరిహద్దులతోపాటు ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చెక్‌పోస్టులు, అవుట్‌ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రాకుండా, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రోడ్డెక్కకుండా చూస్తున్నారు. ఇటు ప్రభుత్వ వైద్యులు, వైద్య సహాయ సిబ్బంది రిస్క్‌ ఉన్నా భయపడకుండా షిఫ్టుల వారీగా 24గంటల పాటు సేవలందిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు బృందాలుగా ఏర్పడి, అనుమానితులను గుర్తిస్తున్నారు. ఇలాంటి వారు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా చూస్తున్నారు. విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌ ఉన్న వారిని రోజుకు రెండు మూడుసార్లు కలిసి వస్తున్నారు. ఐసోలేషన్‌ వార్డులను వైద్యాధికారులు, సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్‌, పంచాయతీ శాఖల సిబ్బంది కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో శుభ్రత కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. వీధుల్లో రసాయనాలు చల్లుతున్నారు. ఇందుకు ఆధునిక యంత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న కరీంనగరంలో నగర పాలక సంస్థ సిబ్బంది విస్తృత చర్యలు చేపడుతున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు తమ వంత పాత్ర పోషిస్తున్నారు. పూర్తిగా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించడం, వారిని హోం క్వారంటైన్‌లో ఉంచడం, వారి ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హోం క్వారంటైన్‌ నుంచి తప్పించుకుని తిరిగే వారిపై కేసులు పెడుతున్నారు. ప్రజలకు నిత్యావసర సరకులు పంపిణీ చేయిస్తున్నారు. మార్కెటింగ్‌, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో నిత్యావసరాల ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వలస కూలీలను గుర్తించి వారికి వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇలా ఆయా శాఖల ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపడుతూ, కరోనా కట్టడికి శ్రమిస్తున్నారు. 

కరీంనగర్‌ జిల్లాలో పకడ్బందీ నిఘా..

కరీంనగరానికి వచ్చిన 10 మంది ఇండోనేషియావాసులతోపాటు కశ్మీర్‌గడ్డకు చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో జిల్లా అధికారులు అలర్ట్‌ అయ్యారు. అప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి అందిన ఆదేశాలతో రంగంలోకి దిగి, కలెక్టర్‌ శశాంక నేతృత్వంలో శరవేగంగా నివారణ చర్యలు చేపట్టారు. జిల్లా అధికారులకు కలెక్టర్‌ శశాంక కీలక బాధ్యతలు అప్పగించారు. ఐసోలేషన్‌ వార్డులకు నోడల్‌ అధికారులను నియమించారు. ఇండోనేషియా వాసులు తిరిగిన ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించగా, సీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో పహారా కాస్తున్నారు. ఐదు చోట్ల ఔట్‌ పోస్టింగ్‌లు ఏర్పాటు చేశారు. డ్రోన్‌ కెమెరాలతో పరిశీలిస్తున్నారు. నగరంతోపాటు కమిషనరేట్‌ పరిధిలో వెయ్యి మంది పోలీసులు నిత్యం మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ నేతృత్వంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది సేవలందిస్తున్నారు. రెడ్‌ జోన్‌ ఏరియాల్లో నాలుగు రేషన్‌ దుకాణాల పరిధిలోని నాలుగు వేల కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. అంతే కాకుండా ఐసోలేషన్‌ వార్డులను పర్యవేక్షిస్తున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో నిత్యం 900 మంది కార్మికులు శానిటేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు డ్రోన్లు, ప్రొటెక్టర్‌ 600 యం త్రాలు, పవర్‌ స్ప్రేలతో రసాయనాలు చల్లుతున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా పెద్దఎత్తున స్ప్రే చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి పర్యవేక్షిస్తున్నారు. ఇటు 313 గ్రామాల్లో 1,600 కార్మికులు పారిశుధ్య సేవలో నిమగ్నమవుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సుమారు 500 మంది నిరంతరం సేవలందిస్తున్నారు.

జగిత్యాల జిల్లాలో 5,100 మంది..

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో 5100 మంది అధికారులు, సిబ్బంది అత్యవసర సేవల్లో పాల్గొంటున్నారు. కలెక్టర్‌ గుగులోతు రవి నేతృత్వంలో వీరంతా నిరంతర సేవలందిస్తున్నారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 480 మంది, రెవెన్యూ నుంచి 300మంది, పంచాయతీరాజ్‌ నుంచి 1500, మున్సిపాలిటీ 750, విద్యుత్‌ శాఖ నుంచి 977 మంది, వైద్య ఆరోగ్య శాఖలో 1100 మంది సిబ్బంది సేవల్లో నిమగ్నమయ్యారు. 

పెద్దపల్లి జిల్లాలో 5,346 మంది..

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ:కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ నేతృత్వంలో జిల్లా అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. మొత్తం 5,346మంది నిరంతరం సేవలందిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో 1,388 మంది, రెవెన్యూ శాఖ పరిధిలో 880 మంది, పోలీస్‌శాఖ పరిధిలో 650 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు. పల్లెల్లో 1,234 పారిశుధ్య సిబ్బంది శానిటేషన్‌ కార్యక్రమాలు చేపడుతున్నారు. 225 మంది పంచాయతీ కార్యదర్శులు, 14మంది ఈవోపీఆర్డీలతోపాటు ఇతర సిబ్బంది కలిసి మొత్తంగా 1473 మంది కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో 413 మంది పారిశుధ్య సిబ్బందితోపాటు మరో 172 మంది ఇతరులు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాల్టీల పరిధిలో 187 మంది పారిశుధ్య సిబ్బంది, 153 మంది ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు ఫైర్‌ ఇంజిన్లతో వైరస్‌ నివారణ కోసం రసాయనాలను స్ప్రే చేస్తుండగా, ఇందులో 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గర్భిణులు, బాలింతలతోపాటు ప్రీ స్కూల్‌ విద్యార్థులకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి పోషకాహారం అందిస్తున్నారు. కలెక్టర్‌ సూచనల మేరకు జిల్లా సర్వేలెన్స్‌ అధికారి శ్రీరాం ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నది. పక్క రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి స్టాంపులు వేసి, హోం క్వారంటైన్‌ చేయడంతోపాటు నిత్యం రెండుసార్లు పరిశీలిస్తున్నది. 

రాజన్న సిరిసిల్లలో 3,718 మంది.. 

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ నిత్యం క్షేత్రస్థాయిలో తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ రాహుల్‌ హెగ్డే కూడా పరిశీలిస్తున్నారు. కలెక్టర్‌ నేతృత్వంలో వివిధ శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,718 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఇందులో 600మంది పోలీసులు, 186 మంది రెవెన్యూ, 1,465 మంది పంచాయతీరాజ్‌, 415మంది మున్సిపల్‌, 367 మంది సెస్‌ (విద్యుత్‌), 685 మంది వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో 2,242 మంది..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:జిల్లాలో 2,242 మంది అధికారులు, సిబ్బంది భాగస్వాములయ్యారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా నేతృత్వంలో నిరంతరం శ్రమిస్తూ సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇందులో పోలీసు శాఖ నుంచి 600మంది, రెవెన్యూ 365మంది, వైద్య 101మంది, అటవీ సిబ్బంది 220, పంచాయతీ కార్మికులు 650, మున్సిపల్‌ సిబ్బంది 152, మున్సిపల్‌ 132 అగ్నిమాపక సిబ్బంది 22 నిరంతరం అందుబాటులో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.

మంచిర్యాల జిల్లాలో 4,729 మంది..

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:కరోనా వైరస్‌ నియంత్రించడంలో జిల్లా పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌, సెస్‌(విద్యుత్‌ సంస్థ), వైద్య ఆరోగ్య శాఖలు నిరంతరంగా పనిచేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల సిబ్బంది 4,729 మంది పని చేస్తున్నారు. ఇందులో పోలీసులు 1,049, రెవెన్యూ 782, పంచాయతీరాజ్‌ సిబ్బంది 1,331, మున్సిపల్‌ 577, వైద్య ఆరోగ్యశాఖ 990 మంది ఉన్నారు.


logo