గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Mar 27, 2020 , 02:37:20

కాలినడకే శరణ్యం

కాలినడకే శరణ్యం

  • వాహనాలు లేక వందలాది మంది మహారాష్ట్ర బాట
  • కుటుంబ సమేతంగా స్వస్థలాలకు..

బోథ్‌, నమస్తే తెలంగాణ / తాంసి : వారంతా రెక్కాడితేకానీ డొక్కాడని కూలీలు... పొట్ట కూటికోసం పనులు వెతుక్కుంటూ పక్కనున్న మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చారు. ఇన్నాళ్లూ  దొరికిన పని చేస్తూ పొట్టపోసుకున్నారు. ప్రస్తుతం కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  ఇప్పటి వరకు పని కల్పించిన యజమానులు ఈ ప్రాంతంలో ఉండడానికి వీలు లేదని చెప్పడంతో వారి స్వస్థలాలకు కాలినడకన బయలుదేరారు. చేతిలో ముల్లె..నెత్తిన మూట వేసుకొని పిల్లాపాపలతో దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు.  ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని మాహోర్‌ పరిధిలోని చిక్కలవర్ధకు కాలినడకన బయలుదేరారు. మహారాష్ట్ర  వెళ్తున్న కూలీలు తాంసి మండలం పొన్నారి వద్ద తారసపడగా వారిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. ఇన్నాళ్లూ ఆదిలాబాద్‌లోని జిన్నింగ్‌ మిల్లులు, ఫ్యాక్టరీల్లో పనిచేశామని, ఇప్పుడు ఫ్యాక్టరీలు బంద్‌ అవడంతో తమకు ఉపాధి కరువైందన్నారు.  యజమానులు తమను గ్రామాలకు వెళ్లిపోవాలని చెప్పడంతో విధిలేని పరిస్థితిలో వెళ్లిపోతున్నామన్నారు. 

బోథ్‌లో..

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన కిన్వట్‌ యువకులు బోథ్‌ మండలంలోని ఘన్‌పూర్‌ సరిహద్దు మీదుగా గురువారం మహారాష్ట్రలోకి ప్రవేశించారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పనులు లేక ఇండ్లకు తిరుగు ప్రయాణమయ్యారు.


logo