గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Mar 10, 2020 , 01:18:45

సంబురంగా రంగుల పండుగ

సంబురంగా రంగుల పండుగ

బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ:  బెల్లంపల్లి నియోజకవర్గం లో రంగుల పండుగను సంబురంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాడలన్నీ రంగుల మయమయ్యాయి. పట్టణంలో బాజార్‌ఏరియా, కాల్‌టెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఏరియా కార్మికవాడలతో పాటు పట్టణంలోని మార్వాడీ మహిళలు సంబురాల్లో మునిగిపోయారు. 

బెల్లంపల్లి టౌన్‌ :  పట్టణంలో 7 గంటల నుంచే బస్తీల్లో యువకులు, మహిళలు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. టేకుల బస్తీ, హన్మాన్‌బస్తీ, రాంనగర్‌, అశోక్‌నగర్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీ, రైల్వేస్టేషన్‌ ఏరియా, శాంతిఖని, సుభాష్‌ నగర్‌, ఇైంక్లెన్‌ బస్తీ, బూడిదగడ్డ బస్తీ, స్టేషన్‌రోడ్‌ కాలనీ, రడగంబాల బస్తీ, రైల్వే రడగంబాల బస్తీ, కన్నాల బస్తీ, మధునన్ననగర్‌, కొత్తబస్టాండ్‌ ఏరియా, ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌, కాంట్రాక్టర్‌ బస్తీ, షంషీర్‌ నగర్‌, అంబేద్కర్‌నగర్‌, బెల్లంపల్లి బస్తీ, కాంటా చౌరస్తా, బజార్‌ ఏరియా, 24 డిప్‌ ఏరియా, గొల్లగూడెంలో మహిళలు, చిన్నారులు రంగులు చల్లుకున్నారు. పాత బస్టాండ్‌ నుంచి కాంటా చౌరస్తా వరకు యువకులు బైకులపై వెళ్తూ కేరింతలు కొట్టారు. నాలుగో వార్డులో కౌన్సిలర్‌ ఆస్మా బేగం ఆధ్వర్యంలో వేడుకలను అత్యంతం ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. బెల్లంపల్లి బస్తీ ప్రాథమిక పాఠశాలలో యువకులు, మహిళలు, చిన్నారులు ఒక్క చోట చేరి సంబురాలు చేసుకున్నారు. ఉట్టి కొడుతూ ఆనందోత్సావాలతో జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆనందంగా గడిపారు.

బెల్లంపల్లి రూరల్‌: మండలంలో హోలీ సంబరాలను యువకులు ఘనంగా జరుపుకున్నారు. తమ స్నేహితుల ఇళ్లకు వెళ్లి హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగులు చల్లుకుని సంతోషాలను పంచుకున్నారు. పలుచోట్ల వనభోజనాలకు తరలివెళ్లి ఉత్సాహంగా గడిపారు.  

కాసిపేట : మండల కేంద్రంతో పాటు సోమగూడెం, దుబ్బగూడెం, ముత్యంపల్లి, కొమటిచేను,దేవాపూర్‌, కొండా పూర్‌ యాప తదితర గ్రామాల్లో హోలీ వేడుకలు జరుపుకున్నారు.పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబు రాలు చేసుకున్నారు.

వేమనపల్లి : మండలంలో హోలీ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.  గ్రామాలన్నీ రంగుల మయంగా కనిపించాయి. మధ్యాహ్నం స్థానిక చెరువులు, కుంటల్లోకి వెళ్లి యువకులు స్నానాలు చేశారు. 

నెన్నెల:  కరోనా భయంతో హోలీ వేడుకల్లో సంప్రదాయ రంగులు చల్లుకున్నారు. వీధుల్లో ఎక్కడ చూసినా యువకుల కేరింతలతో సందడిగా కనిపించాయి. వారం రోజుల పాటు పిల్లలు ,మహిళలు జాజిరి,కోలాటాలు ఆడారు. ఆదివారం రాత్రి కామున్ని ఇంటింటా తిప్పి అనంతరం దహనం చేశారు. 

తాండూర్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో హోలీ వేడుకలను సోమవారం ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు. రంగులు చల్లుకోవడంతో ఊరూవాడా వర్ణశోభితమైంది. ఐబీలో రాష్ట్రీయ రహదారిపై యువకులు గుంపులుగా తిరుగుతూ, కేరింతలు కొడుతూ సందడి చేశారు. మాదారం కార్మిక క్షేత్రంలో యువకులు, కార్మికులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు జాజిరి పాటలు పడుతూ, చిన్నారులు రంగుల డబ్బాలు చేతబూని కేరింతలు చేస్తూ, నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ హోరెత్తించారు. కొన్ని చోట్ల యువత రసాయనాల రంగులను బహిష్కరించి సహజ రంగులు, బుక్కాగులాలనే వినియోగించారు. హోలీ సందర్బంగా మాంసం విక్రయాలు జోరుగా సాగాయి.

భీమిని(కన్నెపల్లి) : భీమిని,  కన్నెపల్లి మండలాల్లో వేడుకలను ఘనంగా జరిగాయి. జన్కాపూర్‌లో యువకులు రహదారిపై జాజిరి పాటలు పాడారు.  


logo