ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Mar 10, 2020 , 01:16:11

పుష్కలంగా నీరు.. పచ్చని పంటలు..

 పుష్కలంగా నీరు.. పచ్చని పంటలు..

దండేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంతో దండేపల్లి మండలం పెద్దపేట ఊరి చెరువు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఖరీఫ్‌తో పాటు యాసంగిలో మంచి పంటలు పండిస్తున్నారు. వరి, మక్కజొన్నతోపాటు ఇతర ఆరుతడి పంటలు పండిస్తూ ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. మండు వేసవిలో సైతం చెరువు కింద వ్యవసాయ బావుల్లో నిండా నీరు ఉంటోంది. ఎక్కడా చూసినా పచ్చని పంటలతో ఈ ప్రాంతం విరాజిల్లుతోంది. ఎండాకాలంలో బావులు అడుగంటిపోగా ఇక్కడా మాత్రం నీటితో కళకళలాడుతున్నాయి.

మిషన్‌ కాకతీయతో మహర్దశ..

గతంలో ఉన్న పాలకులు చెరువులను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో పెద్దపేట చెరువు కింద ఆయకట్టు సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వచ్చింది. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయతో చెరువు రూపురేఖలు మారిపోయాయి. మొదటి విడతలో(2015) భాగంగా రూ.34 లక్షలతో చెరువు పూడిక తీశారు. కట్ట బలోపేతం చేసి పొలాలకు వెళ్లే కాలువలకు మరమ్మతులు చేశారు. నిజాం కాలంలో నిర్మించిన తూములు శిథిలావస్థకు చేరుకోగా వాటి స్థానంలో కొత్తవి నిర్మించారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. తద్వారా ఆయకట్టు సాగు విస్తీర్ణం పెరిగింది. మిషన్‌కాకతీయ మూడో విడతలో భాగంగా మరోసారి రూ.8 లక్షలతో కట్ట బలోపేతం చేశారు. దీంతో చెరువు దశ తిరిగింది. చెరువులో జలకళ ఉట్టిపడుతుండడంతో బావుల్లో ఎప్పుడు నిండా నీరు ఉంటోంది. బావులకు మోటార్లు అమర్చుకొని యాసంగిలోనూ రైతులు వరి, మక్కజొన్న పంటలు పండిస్తున్నారు. ఖరీఫ్‌లో ఏమాత్రం తీసిపోకుండా పంటలు సాగు చేస్తున్నారు.

300 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి.. 

పెద్దపేట చెరువు వ్యవసాయ అవసరాలకే కాక అనుబంధ రంగాలైన మత్స్య పరిశ్రమకు ప్రధాన ఆదరువుగా నిలుస్తున్నది. చెరువుల్లో జలసిరి ఉంటేనే చేపల పెంపకానికి అనువుగాఉంటుంది. చెరువుల్లో నీరు లేక అటు వ్యవసాయంతో పాటు ఇటు మత్స్య పరిశ్రమ దెబ్బతిని ఎందరో రైతులు, మత్స్యకారులు రోడ్డున పడ్డ సందర్భాలు గతంలో ఉండేవి. జిల్లాలోనే పెద్ద చెరువుల్లో ఒకటైన పెద్దపేట చెరువుపై ఆధారపడి 250 నుండి 300 మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ చెరువులో ప్రతి యేటా రూ.10 లక్షల విలువైన చేపలు పడుతున్నారు. జూన్‌లో మత్య్య సహకార సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లలను వేసి వాటిని జాగ్రత్తగా కాపాడి పెద్దవి కాగానే మంచిర్యాల లాంటి పెద్ద మార్కెట్‌కు తరలించి జీవనం సాగిస్తున్నారు. తెలంగాణ సర్కారు వచ్చినంక చెరువులో పూడికతీసి, కట్ట బలోపేతం చేయడం వల్ల నీరు ఎప్పటికీ నిలిచి ఉండడంతో మళ్లీ సాంప్రదాయ రకాలు కొర్రమీన, మట్ట, జెల్ల, చందమామ, పరక, పచ్చిరొయ్య ఉత్పత్తి అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. మిషన్‌ కాకతీయతో అనుకున్న స్థాయిలో చేపలు ఎదగడంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


logo