శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Mar 09, 2020 , 00:29:42

అప్రమత్తతే శ్రేయస్కరం

అప్రమత్తతే శ్రేయస్కరం

బెల్లంపల్లిరూరల్‌: రోజు రోజుకీ హడలెత్తిస్తున్న కొవిడ్‌ -19 (కరోనా వైరస్‌)  వ్యాప్తిపై సంక్షేమ గురుకులాల్లో శాస్త్రీయ అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను ఉత్తర్వుల రూపంలో ప్రిన్సిపాళ్లకు జారీ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతపై హౌస్‌ మాస్టర్లు ,హెల్త్‌సూపర్‌వైజర్లు, కేర్‌టేకర్‌, అసిస్టెంట్‌ కేర్‌ టేకర్లకు ప్రత్యేక సూచనలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. బెల్లంపల్లి సంక్షేమ బాలుర గురుకులంలో ప్రతీ రెండో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు టీజీపీఏ (తెలంగాణ పేరెంట్స్‌ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో మనబడి-మనగుడి పేరుతో పరిశుభ్రత కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. సంక్షేమ గురులాల ప్రాంతీయ సమన్వయ అధికారి జూపూడి ఏంజెల్‌ సూచనల మేరకు విద్యార్థులు ప్రతీ శనివారం స్వచ్ఛ గురుకులం పేరిట వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గురుకులాల్లో పనేషియా హెల్త్‌ కమాండ్‌ సెంటర్‌ వైద్యనిపుణుల సలహాలతో హెల్తీ ట్యూస్‌డే పేరుతో హెల్త్‌ సూపర్‌వైజర్‌ విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై హెల్త్‌ స్క్రీనింగ్‌ చేపడుతున్నారు. నెలలో రెండుసార్లు ప్రత్యేక వైద్యాధికారుతో గురుకులంలోని విద్యార్ధులందరికీ సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు.


logo