శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Mar 09, 2020 , 00:27:42

నేడు హోలీ

నేడు హోలీ

మంచిర్యాల అగ్రికల్చర్‌ : పాల్గుణ పౌర్ణమిని హోలీ పూర్ణిమగా జరుపుకోవడం హిందువులకు అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సంవత్సరం ఆంగ్ల క్యాలండర్‌ ప్రకారం ఈ నెల 9న హోలీ పూర్ణిమగా దేశమంతటా పండుగ జరుపుకుంటున్నారు. హోలీ అంటే అగ్ని. అగ్నితో పునీతమైనది అనే అర్థాలు ఉన్నాయి. హోలీని మదన పూర్ణిమ, హోళికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తుంటారు. 

 కొనుగోళ్లతో బిజీబిజీ

హోలీ పండుగ సందర్భంగా మంచిర్యాల మార్కెట్‌లో అంతా సందడి వాతావరణం నెలకొంది. రంగులు, చిన్న పిల్లలకు గన్‌లు, ఇతర సామగ్రి కొనుగోలు చేసే వారితో బిజీ బిజీగా మారింది. సోమవారం ప్రజలు హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇది చిన్నా, పెద్ద, ఆడ, మగ అనే తేడాలేకుండా అందరు జరుపుకునే రంగు పండుగ. ఉత్సాహంగా పాల్గొనేందుకు అందరు సిద్దమవుతున్నారు.

ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలి

జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని రామగుండం సీపీ సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకల్లో యువకులు, ఇతరులు హద్దులు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దన్నారు. వీధుల్లో డీజేలు, ఇతరత్ర ప్రదర్శనలకు అనుమతిలేదని, సంప్రదాయ రంగులు జల్లుకోవాలని సూచించారు. గోదావరి తీరంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున అక్కడ స్నానాలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు.