గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Mar 04, 2020 , 04:09:08

కొవిడ్‌-19 జర భద్రం

కొవిడ్‌-19 జర భద్రం
  • కరచాలనం చేయకపోవడమే ఉత్తమం
  • వ్యక్తిగత పరిశుభ్రతే కీలకం
  • అప్రమత్తతే మేలంటున్న వైద్యులు
  • లక్షణాలుంటే వెంటనే దవాఖానకు..

శ్వాస, స్పర్శ, మాట్లాడడం, దగ్గడం, తుమ్మడం ద్వారా వైరస్‌ కారక క్రిములు వ్యాప్తి చెందే అవకాశాలెక్కువ.గుండె దడ ఉండడం, ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరేచనాలు, గొంతు నొప్పి, ఛాతి నొప్పి,చలి ఉంటే లక్షణాలుగా అనుమానించవచ్చుఅత్యంత రద్దీ కలిగిన ప్రాంతాల్లో తిరగకపోవడమే మంచిది. దూర ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, చేతులతో కరచాలనం చేయడం, వ్యాధి ప్రభావిత వ్యక్తి తాకిన వస్తువుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశముంది.


కొవిడ్‌-19 (కరోనా).. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఆర్థిక వ్యవస్థనే కాదు.. ప్రజా జీవనాన్ని భయాందోళనకు గురి చేస్తున్న వైరస్‌. ఎంతగా అంటే ఇది ‘ప్రపంచ అంటువ్యాధి’గా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే హెచ్చరించింది. కానీ ఈ వైరస్‌ అత్యంత ప్రమాదకారి మాత్రం కాదని పేర్కొంది. గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలున్న వారికి, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ వైరస్‌ సోకితే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొంత అప్రమత్తంగా ఉంటే త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. చలి ప్రాంతాల్లోనే ఈ వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తుందనీ, ఎండ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కష్టమేనని ఇప్పటి వరకు భావించారు. కానీ ఇప్పుడు ఎండలు ఉన్న ప్రాంతాలకు కూడా ముంచుకొచ్చింది. ఎండలు ఎక్కువగా ఉండే సౌదీ అరేబియాను కూడా తాకి, అందరినీ అప్రమత్తం అయ్యేలా చేసింది. 


మన దేశంలో కూడా దీన్ని ప్రభావం పడే అవకాశం లేకపోలేదని ఇప్పటికే వైద్యనిపుణులు ప్రకటించారు. కానీ అప్రమత్తంగా ఉంటేనే ఈ వ్యాధిని అడ్డుకోగలమని చెబుతున్నారు. ఇప్పటికే నష్ట నివారణకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చిన మన రాష్ట్రవాసికి కూడా ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో అధికార, వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి, లక్షణాలు, నివారణపై ప్రజలకు చేరేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. అందుకే మనం కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. కీలకమైన ఈ ఐదు విషయాలు గుర్తుంచుకుంటే కొవిడ్‌-19ను మన గడప తాకకుండానే తరిమేయవచ్చు. 

- మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ


పరిశుభ్రత

కొవిడ్‌-19 వైరస్‌ ఉన్న వ్యక్తులు ప్రయాణాల్లో బస్సులు, రైళ్లు, విమానాలు, ఆటోలు, ఎక్కడైనా సరే, ఏదైన వస్తువును (రాడ్లు, సీట్లు, డోర్లు) ముట్టుకుంటే వాటిపై వైరస్‌ ఉండే అవకాశం ఉంటుంది. అదే వస్తువును మనం కూడా తాకితే ఆ వైరస్‌ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటివేమీ ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. చేతులకు గ్లౌవ్స్‌ వాడాలి. లేదంటే ప్రయాణం తర్వాత చేతుల్ని సబ్బుతో బాగా కడుక్కోవాలి. అలాగే ప్రయాణ సమయాల్లో హ్యాండ్‌ శానిటైజర్‌ వాడాలి. ఒక చిన్న 50 గ్రాముల బాటిల్‌ రూ. 70 నుంచి రూ. 100 వరకు ఉంటుంది. అలాగే జంతువులకు దూరంగా ఉండడం కూడా మంచిది.   


జనసందోహం

అసలు ఈ వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలిస్తే, అది మనకు చేరకుండా జాగ్రత్త పడతాం. ఇది గాలి ద్వారా వచ్చే వైరస్‌ కాదు. అంటే.. గుంపుగా జనం ఉన్నా... అక్కడి గాలిలో కొవిడ్‌ వైరస్‌ ఉండదు. కానీ.. ఆ జనంలో ఎవరికైనా కొవిడ్‌ వైరస్‌ ఉంటే,. వారు దగ్గినా, తుమ్మినా.. అప్పుడు వచ్చే నీటి బిందువుల్లో (తుంపర్లలో) కొవిడ్‌ వైరస్‌ ఉంటుంది. అది మనపై పడితేనే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వైరస్‌ ఉన్నవారికి కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి. కానీ ఎవరికి వైరస్‌ సోకిందో మనకు తెలియదు. అందుకే జనసందోహానికి దూరం ఉండాలి.


మాస్క్‌ ధరించడం

ముఖానికి మాస్క్‌ పెట్టుకోవాలి. చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని అనుమానిస్తారనే భయం ఉండడం సాధారణం. అయినా మాస్క్‌ వాడడం మేలు. లేదంటే కనీసం కర్చీఫ్‌ అయినా ముఖానికి కట్టుకుంటే మంచిది. శుభ్రమైన న్యాప్కిన్లు వినియోగించి, ముఖాన్ని తుడుముకోవాలి. చేతులతో తాకకపోవడమే మంచిది. ఇతరులకు కరచాలనం, ఆలింగనం ఇవ్వకపోవడం ఉత్తమం. తుమ్ములు, దగ్గులు వస్తే చేయి కాకుండా, న్యాప్కిన్లు, టిష్యూలు వాడండి. ముక్కు, కండ్ల ద్వారానే ఇది వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉన్నందున, వాటిని చేతుల ద్వారా నలపకపోవడమే మంచిది.


ఆహారం

మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గింజల వంటివి ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పుల్లటి పండ్లను బాగా తినాలి. వాటిలో సీ విటమిన్‌.. ఇలాంటి వైరస్‌లను శరీరంలోకి రాకుండా చేస్తుంది. మనం తినే ఆహారం అత్యంత ఉష్ణోగ్రతలో ఉడుకుతున్నందున, దీంతో సోకే అవకాశం లేదు. మాంసహారం తింటే వస్తుందనేది అపోహే. కేవలం కొవిడ్‌ సోకిన పదార్థాలను ముట్టుకుంటే మాత్రమే ఇది వ్యాపిస్తుంది. ఈగలు, దోమలు వాలిన ఆహారం తీసుకోకపోవడమే మంచిది. 


మనోధైర్యం

ఆరోగ్యవంతుల కంటే.. జలుబు, దగ్గు, నీరసం, ఆయాసం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్‌ వెంటనే సోకుతుంది. కాబట్టి.. ఇలాంటి అనారోగ్యాలు ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్త పడాలి. బయటి ప్రయణాలు మానుకుంటే మంచిందని చెబుతున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్‌ సోకితే... భయపడాల్సిన పని లేదు. మనోధైర్యంతో ఉంటేనే మన శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. అది వైరస్‌తో పోరాడుతుంది. 


logo