గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Mar 04, 2020 , 04:07:22

విజయీభవ !

విజయీభవ !
  • నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
  • కేంద్రాలను పరిశీలించిన డీఐఈఓ
  • వసతుల కల్పనపై పర్యవేక్షణ
  • ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలతో సమావేశం

మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. జిల్లాలో మొత్తం 15,666 మంది విద్యార్థులుండగా ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 7984 మంది(జనరల్‌ 6402, వొకేషనల్‌ 1582), రెండో సంవత్సరంలో 7682 (జనరల్‌ 6380, వొకేషనల్‌ 1302) మంది ఉన్నారు. ఈ నెల 4న ఇంటర్‌ మొదటి సంవత్సరం, 5న సెకండియర్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.  చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌, కస్టోడియన్స్‌ను, ఇన్విజిలేటర్లను సంబంధిత అధికారులు నియమించారు. 


పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈఓ ఇంద్రాణి అన్నారు. డీఐఈఓ కార్యాలయంలో  ఫ్లయింగ్‌ స్కాడ్‌, సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలతో మంగళవారం సమావేశమై మాట్లాడారు. ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా చూడాలన్నారు. ఏ విషయమైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రతి పరీక్షా కేంద్రానికో చీఫ్‌ సూపరింటెండెంట్‌ చొప్పున 26 మందిని, 26 మంది డిపార్టుమెంటల్‌ అధికారులను నియమించారు. 18 మంది కస్టోడియన్స్‌, 20 మంది విద్యార్థులకో ఇన్విజిలేటర్‌ చొప్పున 560 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నట్లు చెప్పారు.  అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంందని వెల్లడించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 7984 మంది ఉండగా ఇందులో రెగ్యులర్‌(జనరల్‌) విద్యార్థులు 6402, వొకేషనల్‌ విద్యార్థులు 1582 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. సమావేశంలో ఫ్లైయింగ్‌, సిట్టింగ్‌ స్వాడ్‌ సభ్యులు సీనియర్‌ ప్రిన్సిపల్‌ ఏలీషాదేవి, సీనియర్‌ జూనియర్‌ లెక్చర్‌ అంజయ్య పాల్గొన్నారు.


పరీక్ష కేంద్రాల సందర్శన

ఇంటర్‌ పరీక్ష కేంద్రాలను డీఐఈఓ ఇంద్రాణి మంగళవారం సందర్శించారు. బెంచీలపై వేసిన హాల్‌ టికెట్‌ నంబర్లను, కళాశాల ఆవరణ, హాల్‌ టికెట్‌ నెంబర్‌ల సూచిక బోర్డు, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. మంచిర్యాల మండలంలో తొమ్మిది కేంద్రాలు, మందమర్రిలో రెండు, చెన్నూర్‌లో రెండు, బెల్లంపల్లిలో మూడు, కాసిపేటలో ఒకటి, జైపూర్‌లో ఒకటి, జన్నారంలో రెండు, దండేపల్లిలో ఒకటి, లక్షెట్టిపేట మండలంలో ఐదు పరీక్ష కేంద్రాలను తిరిగి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరాదని, ఎలక్ట్రానిక్‌ వస్తువులు లోనికి అనుమతించవద్దని సూచించారు. ఇంటర్మీడియట్‌ బోర్డు నియమనిబంధనలు పాటించాలన్నారు.


ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

ఆర్టీసీ రాయితీ బస్‌పాస్‌ ఉన్న ఇంటర్మీడి యట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వారి నివాస ప్రదేశం నుంచి పరీక్ష కేంద్రం వరకు, తిరిగి పరీక్ష కేంద్రం నుంచి నివాస ప్రదేశానికి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని మంచి ర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ మేకల మల్లేశయ్య మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌ టికెట్‌, ఆర్టీసీ నుంచి రాయితీ బస్సుపాస్‌ ఆధారంతో బస్సు పాసుపై ఉన్న ప్రారంభ, గమ్య స్థానాలతో నిమిత్తం లేకుండా  ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి వద్ద ఎలాంటి బస్సు పాసులేకుంటే కండక్టర్‌ వారి వద్ద తగిన బస్సు చార్జీలు వసూలు చేస్తారనిఇ          పేర్కొన్నారు. ఈ సౌకర్యం కేవలం ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న రోజుల్లోనే ఉంటుంద ని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


logo