మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Mar 02, 2020 , 23:11:05

పట్టణ ప్రగతిలో గుర్తించిన వెంచర్లపై చర్యలు

పట్టణ ప్రగతిలో గుర్తించిన వెంచర్లపై చర్యలు

 మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ :మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే అవుట్లు ఏర్పాటు చేసిన రియల్టర్లలో గుబులు మొదలైంది. అనుమతులు తీసుకోకుండాభవన నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై కూడా ఉక్కుపాదం మోపాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. పది రోజుల పట్టణ ప్రగతిలో వీటిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగానే వార్డులవారీగా ప్రత్యేకాధికారులను నియమించింది. వీరు ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటారు. అక్రమంగా వెంచర్లు వెలిస్తే విక్రయాలకు, భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు.  భవనాలు నిర్మిస్తే కూల్చడానికి కూడా వెనుకాడరు. ఈ ప్రక్రియ పట్టణ ప్రగతి అయ్యేలోపు చర్యలు తీసుకోవాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.


కొత్త జిల్లా ఏర్పాటు కావడంతో.. 

ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా మంచిర్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అప్పటికే అనధికార జిల్లాగా కొనసాగతున్న జిల్లాలో ఒక్కసారిగా రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంది. మంచిర్యాలతోపాటు చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో స్థిరాస్తి వ్యాపారులు వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చారు. మరోవైపు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కావడంతో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. ప్రభుత్వ అనుమతి పొందకుండానే కేవలం పంచాయతీ పాలకవర్గాల తీర్మానాలతో పట్టణ ప్రణాళిక విభాగానికి దరఖాస్తులు సమర్పించారు. లే అవుట్‌కు అన్నీ అనుమతులు వచ్చినట్లు ప్రచారం చేసుకుంటూ ప్లాట్లను అమ్ముకున్నారు. జిల్లా కేంద్రానికి చుట్టు పక్కల ఉన్న గ్రామాలతోపాటు చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. నీరు గారుతున్న గిరిజన చట్టం

మందమర్రి : మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ భూముల్లో అక్రమంగా వెంచర్లు వెలిశాయి. గిరిజన చట్టం అమలులో ఉన్నప్పటికీ రియల్‌ వ్యాపారులు పట్టించుకోవడం లేదు. అమాయక గిరిజనుల నుంచి వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తూ వెంచర్లు ఏర్పాటు చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. మహారాష్ట-హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్క భూములకు డిమాండ్‌ ఉండటంతో రియల్‌ వ్యాపారులు ఆ భూములపై కన్నేశారు. కొందరు గిరిజనులను బినామీలుగా పెట్టుకుని దందా కొనసాగిస్తున్నారు. మందమర్రి మున్సిపాలిటీలోని వివిధ సర్వే నంబర్‌లలో 48.28 ఎకరాల విస్తీర్ణంలో 10 వెంచర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని వెంచర్లలో ప్లాట్ల క్రయవిక్రయాలు కూడా జరిగాయి. మున్సిపాలిటీ పరిధిలో అక్రమ రియల్‌ వ్యాపారులు విక్రయించే భూములకు గిరిజన చట్టం మూలంగా రిజిస్ట్రేషన్‌లు, పట్టాలు కాకపోయిన అమాయక ప్రజలను మోసం చేస్తూ యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను తొలగిస్తామని అధికారులు వెల్లడించారు. 


అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట  

సీసీసీ నస్పూర్‌ : మంచిర్యాల పట్టణాన్ని ఆనుకుని నాలుగు గ్రామ పంచాయతీల్లో జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. నస్పూర్‌ మున్సిపాలిటీగా అవతరించడంతో వ్యాపారులు యథేచ్ఛగా రియల్‌ దందా చేస్తున్నారు. చాలా చోట్ల అక్రమంగా, అనుమతులు లేకుండా ప్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. ఇక్కడ జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు వస్తుండడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఓ వైపు వెంచర్లు ఏర్పాటు చేస్తూ, మరోవైపు అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్‌ ఇళ్లు కట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. వీటన్నింటికి ఎలాంటి అనుమతులు ఉండడం లేదు. ప్రస్తుతం ఇక్కడ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం నిర్మాణం అవుతుంది. దీని చుట్టు పక్కల, సమీపంలో కూడా వెంచర్లు వెలిశాయి. నస్పూర్‌లో 24 ఎకరాల్లో ఏడు అక్రమ వెంచర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నస్పూర్‌ సర్వే నంబర్‌ 24, 25లో ఐదెకరాలు, సర్వే నంబర్‌ 123, 124లో మూడెకరాలు, సీతారాంపల్లి సర్వే నంబర్‌ 14లో రెండెకరాలు, సీతారాంపల్లి సర్వే నంబర్‌ 12లో రెండెకరాలు, సీతారాంపల్లి సర్వే నంబర్‌15లో రెండెకరాలు, సీతారాంపల్లి సర్వే నంబర్‌ 23, 19/2లో ఆరెకరాలు, తీగల్‌పహాడ్‌ సర్వే నంబర్‌ 31, 41లో నాలుగెకరాలు భూమిలో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసినట్లు టౌన్‌ ప్లానింగ్‌ అధికారి యశ్వంత్‌ తెలిపారు.


ఇష్టారాజ్యంగా ఉన్న వాటి గుర్తింపు

చాలా చోట్ల టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. దీంతో అడ్డగోలుగా వెంచర్లు వెలిశాయి. కేవలం పాత మున్సిపాలిటీల్లోనే కాకుండా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో అదే బాగోతం. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వెంచర్లు ఏర్పాటు చేయడం, అధికారులు పట్టించుకోనట్లు వ్యవహరిస్తుండంతో పెద్ద సంఖ్యలో వెంచర్లు వెలిశాయి. మున్సిపాలిటీలతోపాటు శివారు ప్రాంతాల్లో కూడా పదుల సంఖ్యలో అనధికార లే అవుట్లు ఉన్నాయి. భూ కబ్జాదారులు చెరువులు, కుంటలను ఆక్రమించి లే అవుట్లు చేశారు. పట్టణ ప్రగతి కింద ఈ నెల 4లోపు పూర్తి కానుంది. ఈ లోగా వెబ్‌సైట్‌లో గుర్తించి, వెంటనే తొలగించేందుకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే కూల్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.


రియల్‌ ఆటకట్టు  

మంచిర్యాల టౌన్‌, నమస్తే తెలంగాణ : మంచిర్యాల పట్టణంలో అనుమతులు లేకుండా ఎకరాల కొద్దీ లే అవుట్లు వెలిశాయి. పట్టణ ప్రగతిలో భాగంగా అక్రమ లే అవుట్లను గుర్తించాలని ఆదేశాల నేపథ్యంలో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు గుర్తించారు. పట్టణ ప్రగతిలో 16 అక్రమ లే అవుట్లలో 63 ఎకరాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. గర్మిళ్ల ప్రాంతంలోని సర్వే నంబర్‌ 248లో నాలుగు ఎకరాల స్థలంలో 42 ప్లాట్లు, 192 సర్వే నంబర్‌లోని ఐదెకరాల్లో 50 ప్లాట్లు, 193 సర్వే నంబర్‌లోని మూడెకరాల్లో 30 ప్లాట్లు, 183 సర్వే నంబర్‌లోని మూడెకరాల్లో 32 ప్లాట్లు, 698 సర్వే నంబర్‌లోని మూడెకరాల్లో 32 ప్లాట్లు, 702 సర్వే నంబర్‌లోని రెండెకరాల్లో 32 ప్లాట్లు, 353, 354 సర్వే నంబర్‌లోని ఏడెకరాల్లో 50 ప్లాట్లు, 40సర్వే నంబర్‌లోని రెండెకరాల్లో 24 ప్లాట్లు, 368 సర్వే నంబర్‌లోని మూడెకరాల్లో 35 ప్లాట్లు, 363 సర్వే నంబర్‌లోని 16 ఎకరాల్లో 105  ప్లాట్లు, మంచిర్యాల శివారులోని 105 సర్వే నంబర్‌లోని రెండెకరాల్లో 34 ప్లాట్లు, 113 సర్వే నంబర్‌లోని ఎకరంలో 7 ప్లాట్లు, 574 సర్వే నంబర్‌లోని ఎకరంలో 18 ప్లాట్లు, 310, 311 సర్వే నంబర్‌లోని రెండు ఎకరాల్లో 28 ప్లాట్లు, 447, 448 సర్వే నంబర్లలోని ఏడెకరాల్లో 54 ప్లాట్లు, గర్మిళ్ల శివారులోని 138, 139 సర్వే నంబర్లలోని రెండెకరాల్లో 24 ప్లాట్లు అక్రమంగా వెలిసినట్లు అధికారులు గుర్తించారు. ఈ స్థలాల్లోని హద్దురాళ్లను తొలగించారు. కాగా.. అక్రమ లే అవుట్లు ఏర్పాటు చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను గుర్తించి వారికి నోటీసులు అందిస్తామని, భూ వ్యాపారుల మాయమాటలు నమ్మి కొనద్దని, ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు రావని మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి తెలిపారు.logo