మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Mar 02, 2020 , 23:06:27

మళ్లీ ‘100 % పీఎల్‌ఎఫ్‌'

 మళ్లీ ‘100 % పీఎల్‌ఎఫ్‌'

 మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  మంచిర్యాల జిల్లాలోని జైపూర్‌లోని  సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం మరోసారి సత్తా చాటింది. 2020  ఫిబ్రవరిలో థర్మల్‌ విద్యుత్‌ స్టేషన్‌లోని రెండు యూ నిట్లు 100 శాతం పైబడి పీఎల్‌ఎఫ్‌(ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) సాధించాయి. దీంతో స్టేషన్‌ పీఎల్‌ఎఫ్‌ 100.18 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో ఈ ప్లాంటు 836.70 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా, దీనిలో ప్లాంటుకు అవసరమైన విద్యుత్‌ పోనూ మిగిలిన 791.79 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 8,398 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా, 7,895 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అందించారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని రెండు యూనిట్లు నూరుశాతం పీఎల్‌ఎఫ్‌ సాధించడంపై సంస్థ సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ తన హర్షం ప్రకటిస్తూ ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే ఒరవడి కొనసాగించాలన్నారు. 

 రెండేళ్లలో నూరు శాతం పీఎల్‌ఎఫ్‌...

 సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం రెండేళ్లలో మూడు సార్లు నూరుశాతం పీఎల్‌ఎఫ్‌ సాధించిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంగా మంచిపేరు తెచ్చుకున్నది. 2018 సెప్టెంబర్‌లో 100.04 శాతం, 2019 ఫిబ్రవరిలో 100.05 శాతం స్టేషన్‌ పీఎల్‌ఎఫ్‌ సాధించగా ఈ ఫిబ్రవరిలో గరిష్టంగా 100.18 శాతం స్టేషన్‌ పీఎల్‌ఎఫ్‌ సాధించి ప్రతిభ చాటుకుంది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం జాతీయ స్థాయి లో అత్యుత్తమ 25 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల జాబితాలో 2017-18 సంవత్సరంలో 5వ ర్యాంకును సాధించడం గమనార్హం. 

 రెండో యూనిట్‌ 9 సార్లు..

 ఒకటో యూనిట్‌ 6సార్లు..

 ఎస్టీపీపీలో ఉన్న రెండు విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లు విడిగా మొత్తం మీద 15సార్లు నూరు శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించాయి. 2వ యూనిట్‌  మొత్తం మీద 9 సార్లు నూరు శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించి అగ్రస్థానంలో ఉంది. 2017లో ఫిబ్రవరి, మే, నవంబర్‌ నెలల్లోనూ 2018లో జూలై, సెప్టెంబర్‌, అక్టోబర్‌లోనూ, 2019లో జనవరి, ఫిబ్రవరిలో, 2020 ఫిబ్రవరిలో నూరు శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించింది. ఒకటో యూనిట్‌ కూడా ఆరుసార్లు నూరు శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించింది. 2017లో ఏప్రిల్‌, డిసెంబర్‌లో, 2018లో సెప్టెంబర్‌, నవంబర్‌లోనూ, 2019లో ఫిబ్రవరి, 2020 ఫిబ్రవరి నెలలోనూ 100 శాతం పైబడి పీఎల్‌ఎఫ్‌ సాధించింది. 

  30,921 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి 

 సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 2016 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30,921 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. దీనిలో 29,056 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు సరఫరా చేశారు. ఎస్టీపీపీ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయించిన సంస్థ సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ స్టేషన్‌ ప్రారంభం తర్వాత కూడా నెలవారీ సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో ఎస్టీపీపీ నూరుశాతం పీఎల్‌ఎఫ్‌ పలుమార్లు సాధించింది. ఇదే ప్రాంగణంలో 10 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఏర్పాటును వేగవంతం చేయడమే కాకుండా, గత నెలలోనూ సింక్రనైజ్‌ చేయడానికి ఆయన ప్రత్యేక కృషి చేశారని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అధికారులు తెలిపారు. 


logo