బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Feb 27, 2020 , T01:05

‘సౌర’కాంతులు

‘సౌర’కాంతులు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సింగరేణి యాజమాన్యం ప్రకృతిలో లభించిన బొగ్గు ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీనికితోడు సంప్రదాయ వనరుల ద్వారా విద్యుత్‌ అందించేలా ప్రణాళికలు రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నది. తక్కువ ఖర్చుతో పర్యావరణం దెబ్బతినకుండా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం చాలా ప్రయోజనకరం. ఇప్పటికే థర్మల్‌ విద్యత్‌ ఉత్పత్తి కోసం జైపూర్‌లో సిం గరేణి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌(ఎస్‌టీపీపీ) ఏర్పాటు చేశారు. ఇక్కడే ఖాళీగా ఉన్న స్థలాలను ఎంపిక చేసుకుని సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేస్తున్నారు. 10 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్నది. ఇంకా సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఖాళీ స్థలాల్లో మొదటి విడతగా 129 మెగావాట్ల ప్లాం ట్లు, రామగుండం సెంటినరీకాలనీలో 50, ఇల్లందులో 39, మణుగూరులో 30 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా సాగాయి. ఎస్టీపీపీ ఆవరణలోని క్వార్టర్లకు సమీపంలో ఈ సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. నాలుగు బ్లాక్‌లుగా పనులు చేశారు. దీనిని ప్రధాన నియంత్రణ కేంద్రానికి కలిపారు.

రెండు విడుతల్లో విద్యుత్‌ ఉత్పత్తి

ఈ ప్లాంట్ల ద్వారా రెండు విడతలుగా విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 10వ తేదీన ఐదు మెగావాట్ల సోలార్‌ ప్లాంటు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించగా, మిగిలిన 5 మెగావాట్ల ప్లాంటు పనులు కేవలం ఒక్క నెలరోజుల్లోనే పూర్తి చేసిన అధికారులు విద్యుత్‌ ఉత్పాదన ప్రారంభించడం గమనార్హం. సింగరేణి సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ వీటిపై ప్రత్యేక దృష్టి సారించడంతో చాలా వేగంగా పనులు పూర్తి కావడమే కాకుండా, అంతే వేగంగా విద్యుత్‌ ఉత్పత్తి కూడా ప్రారంభించారు. మొదటి విడతలో ప్రారంభమైన ఐదు మెగావాట్ల ప్లాంట్‌ నుంచి కేవలం నెల రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 10 వరకే 5 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయడం గమనార్హం. ఈ రెండు ప్లాంట్లు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను సింగరేణి సొంత అవసరాలకే వాడుకుంటోంది. శ్రీరాంపూర్‌లో ఉన్న 33 కేవీ లైన్‌ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న గనులకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మణుగూరు, ఇల్లందు, రామగుండం ప్లాంట్లు నిర్మాణాలు కూడా వేగవంతం చేశారు. ఆగస్టు నాటికి 220 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదనకు పూర్తి స్థాయిలో కృషి చేయాలని సీఎండీ శ్రీధర్‌ ఆదేశాల మేరకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి 

రెండు యూనిట్లలో కలిపి ఇప్పటివరకు పెద్ద ఎత్తున ఉత్పత్తి సాగుతున్న నేపథ్యంలో అధికారులు లక్ష్యాన్ని చేరుకునేందు కు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నా రు. ఏటా 17.5 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఈ 10 మెగావాట్ల సోలార్‌ పవర్‌ప్లాంటు నెలకొల్పారు. అయితే జనవరి 10న మొదటి 5 మెగావాట్ల యూనిట్‌, ఫిబ్రవరి 10న మరో 5 మెగావాట్ల యూనిట్‌ ప్రారంభించారు. ఈ రెండింటిలో ఇప్పటివరకు ఒక మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. అనుకున్న లక్ష్యం కంటే అధికంగానే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను 33 కేవీ విద్యుత్‌ లైన్‌ ద్వారా రైల్వే ట్రాక్‌ను అనుసరిస్తూ 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంపూర్‌ సబ్‌స్టేషన్‌కు అనుసంధానించారు. దీని ద్వారా ఇక్కడ ఉన్న అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లకు విద్యుత్‌ ను వినియోగిస్తున్నారు. దీంతో సింగరేణి విద్యుత్‌ కోసం వెచ్చిస్తున్న కోట్ల రూపాయలు ఆదా కానున్నాయి.


logo