సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Feb 24, 2020 , 01:53:29

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ : పట్టణాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమనీ, పల్లెలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ‘ప్రగతి’ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. పట్టణ ప్రగతిపై ఆదివారం బెల్లంపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో పాలకమండలి సభ్యులు, అధికారుల కోసం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కంకణబద్దులై పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణాన్ని క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చేయడం కోసం పల్లె ప్రగతి చేపట్టారని వివరించారు. ఇప్పటికే పల్లెప్రగతి విజయవంతంగా పూర్తికావడంతో అదే స్ఫూతో సీఎం కేసీఆర్‌ ఈ నెల 24 నుంచి పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారని తెలిపారు.


రూ.48.67లక్షలు మంజూరు

పట్టణ ప్రగతి కోసం బెల్లంపల్లి మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ.48 లక్షల 67 వేలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈమేరకు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు అవసరమైన అవసరాలను గుర్తించాలన్నారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతిని అధికారులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేయాలని కోరారు. పట్టణాన్ని అభివృద్ధి చేసుకొనేందుకు ఇదే మంచి అవకాశమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేశ్‌, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌ పాల్గొన్నారు.


logo