శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Feb 18, 2020 , 00:02:48

డీసీసీబీ, డీసీఎంఎస్‌ పీఠాలపై ‘గులాబీ’ గురి

డీసీసీబీ, డీసీఎంఎస్‌ పీఠాలపై ‘గులాబీ’ గురి

నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మ డి ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి తాజాగా జరిగిన సహకార ఎన్నికల వరకు గులాబీ పార్టీ విజయదుందుభి మోగిస్తున్నది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ పూర్తిగా డీలా పడింది. ఒక రకంగా చెప్పాలం టే ఆ పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొ చ్చు. పార్టీరహితంగా జరిగిన ఎన్నికలైనప్పటికీ.. సహకార ఎన్నికల్లో గులాబీ పార్టీ తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌) 77 ఉండగా.. 71 టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. నిర్మల్‌ జిల్లాలో 17 సంఘాలకు 15, ఆదిలాబాద్‌ జిల్లాలో 28 సంఘాలకు 25, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 12 సంఘాలకు 12, మంచిర్యాల జిల్లాలో 20 సంఘాలకు 19 చొప్పున సంఘాలను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకున్నారు.


అందరి చూపు డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవుల వైపే.. 

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 12 పీఏసీఎస్‌లను గెలుచుకుని.. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌ చేశారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చెరో మూడు పీఏసీఎస్‌లు మాత్రమే దక్కించుకున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండ లం చంద్రవెల్లి, నిర్మల్‌ జిల్లా కుంటాల, సారంగాపూర్‌ మండలం కౌట్ల(బి) పీఏసీఎస్‌లను కాంగ్రెస్‌, ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం జామిడి-బి, నర్సాపూర్‌, గుడిహత్నూర్‌ పీఏసీఎస్‌లను బీజేపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌, నిర్మల్‌, మంచిర్యా ల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అసలు బోణీ కూడా చేయలేదు. ఈ రెండు జాతీయ పార్టీలు దొందూదొందే అన్నట్లుగా మారిపోయాయి. పీఏసీఎస్‌లను దక్కించుకునేందుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ పరిషత్‌ ఛైర్మన్లు ప్రత్యేక దృష్టి పెట్టారు. 95 శాతానికిపైగా పీఏసీఎస్‌లు దక్కించుకుని.. తమ సత్తా ఏం టో చూపించారు. టీసీల డైరెక్టర్లతోపాటు పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తవటంతో.. ఇక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(డీసీఎంఎస్‌) పదవులపై అందరి దృష్టి పడింది. 


మొదలైన ప్రయత్నాలు..

ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 2013 సంవత్సరంలో పీఏసీఎస్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలకు ఎన్నికలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లో 21 మంది డీసీసీబీ డైరెక్టర్లుండగా.. వీటిలో 16 మంది పీఏసీఎస్‌ల నుంచి, ఐదుగురు మంది వివిధ రకాల సొసైటీల నుంచి వస్తారు. త్వరలోనే డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వా త.. స్వరాష్ట్రం రావడం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వివిధ పార్టీల మద్దతుదారులైన వారంతా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తాజాగా టీఆర్‌ఎస్‌ పార్టీ 71 పీఏసీఎస్‌లను దక్కించుకోవటంతో.. డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులను కూడా తన ఖాతాలో వేసుకోనుంది. పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. డీసీసీబీ డైరెక్టర్ల కోసం మంత్రి అల్లోలతోపాటు స్థానిక ఎమ్మెల్యేల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొద లు పెట్టారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మ న్‌ పదవుల కోసం ప్రయత్నాలు మొదలవగా.. నాలుగు జిల్లాలకు నాలుగు పదవులు సమానంగా ఇచ్చే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉండటంతో.. డైరెక్టర్లతోపాటు చైర్మన్‌, వైస్‌ చైర్మ న్‌ పదవులు టీఆర్‌ఎస్‌కే దక్కనున్నాయి.