మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Feb 18, 2020 , 00:01:09

పది పరీక్షలు సజావుగా నిర్వహించాలి

పది పరీక్షలు సజావుగా నిర్వహించాలి

మంచిర్యాల రూరల్‌ : అన్నిశాఖల సమన్వయంతో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో తన చాంబర్‌లో ట్రెయినీ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, డీఈఓ వెంకటేశ్వర్లుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 6 వరకు నిర్వహించనున్న పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన 58 పరీక్ష  కేంద్రాల్లో 11 472 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. వారికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ నుంచి నాలుగు దశలుగా పరీక్ష పత్రాలు జిల్లాకు అందుతాయన్నారు. చెన్నూర్‌, జన్నారం, బెల్లంపల్లి, కాసిపేట, మంచిర్యాల ఐదు రూట్లలో పరీక్ష పత్రాలు ఆయా పరిధిలోని  పోలీస్‌స్టేషన్‌ నుంచి పరీక్షా కేంద్రాలు భద్రతా చర్యల మధ్య పంపించాలన్నారు. పరీక్షా పత్రాలు 20 కేంద్రాల్లో ఉంచనున్నట్లు తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే దాకా రక్ష ణ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. 


మార్చి 3నుంచి 8 వరకు మొదటి విడత, 13 నుంచి 18 వరకు రెండో విడుతగా వచ్చే ప్రశ్నాపత్రాల పంపి ణీ కోసం ఏర్పాటు చేసే ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందం లో ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు ఇతర సిబ్బందిని నియమించాలన్నారు. పరీక్షల ప్రారంభం నుం చి ముగిసే వరకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందో బస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ కొనసాగించడంతో పాటు కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవల కోసం నర్సును నియమించడంతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం పరీక్ష సమయానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ శాఖ అధికారి రాజేశ్వర్‌, డీఎం అండ్‌ హెచ్‌ఓ భీష్మ, జైపూర్‌ ఏసీపీ నాగేందర్‌,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo