ఆదివారం 23 ఫిబ్రవరి 2020
నేడే సహకార పోరు

నేడే సహకార పోరు

Feb 14, 2020 , 23:52:14
PRINT
నేడే సహకార పోరు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:సహకార సంఘాల ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాగం రంగం సిద్ధం చేసింది. జిల్లాలోని 18 మండలాల్లో మొత్తం 20 సంఘాలు ఉండగా, అందులో 7 సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. 168 నియోజకవర్గాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 89 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 196 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 25,365 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం అధికారులు 13 పోలింగ్‌ స్టేషన్లు, 89 బూత్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 600 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఐదు జోన్లు, ఐదు రూట్లుగా విభజించి, ప్రతి రూట్‌కు ఒక అధికారికి బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన వరుస ఎన్నికలను అధికార యంత్రాంగం పకడ్బందీగా నిర్వహించింది. సహకార సంఘాల ఎన్నికలను సైతం ప్రశాంత వాతావారణంలో విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ భారతీ హోళికేరి, డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. 15న శనివారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఆ వెంటనే ఓట్లను లెక్కించి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు.         


పోలింగ్‌ సామగ్రితోతరలిన సిబ్బంది..

సహకార సంఘాల ఎన్నికల కోసం అధికారులు బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల సామగ్రి  తరలించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌ ఏర్పాటు చేశారు. అధికారులు తమ పోలింగ్‌ సామగ్రితో ప్రత్యేక వాహనాల్లో  బయల్దేరి వెళ్లారు. జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల నుంచి మంచిర్యాలకు వచ్చే వారికి జన్నారం నుంచి ప్రత్యేక వాహనం సమకూ ర్చారు. తాండూరు, బెల్లంపల్లి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాండూరు నుంచి బస్సు ఏర్పాటు చేశారు. జిల్లాలో పొన్కల్‌, నెల్కివెంకటాపూర్‌, కర్ణమామిడి, పడ్తన్‌పల్లి, ధర్మరావుపేట, చెన్నూరు, కోటపల్లి, జెండావెంకటాపూర్‌ ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఎన్నికలు కాగానే లెక్కింపు

మిగతా ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. తక్కువ ఓట్లే ఉండడంతో గంట, రెండు గంటల్లో పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి. ఆదివారం రోజే అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. సంఘాలకు సంబంధించి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు రిజర్వేషన్లు ఉండవు. 13మంది సభ్యుల్లో ఎవరైనా పోటీ చేసేందుకు అర్హులే.


logo