ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Feb 13, 2020 , 01:41:45

సహకారానికి ప్రచారం

సహకారానికి ప్రచారం

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్‌) ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బరిలో నిలిచిన రైతు సంఘాల నాయకులు ఓటు ఉన్న రైతులను కలుస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. వరుస ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ సొసైటీలను అధిక శాతం తమ ఖాతాలో వేసుకునేందుకు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి అత్యధిక డైరెక్టర్‌ స్థానాలను, సొసైటీలను గులాబీ సొంతం చేసుకుని గుత్తాధిపత్యం చాటుతున్నది. మిగతా స్థానాలు, సొసైటీలను కూడా తమ మద్దతు దారులు గెలుపొందేం దుకు వ్యూహాలు రూపొందిస్తున్నది. శనివారం ఎన్నికలు ఉండటంతో అభ్యర్థులు గ్రామాల్లోని ఓటర్ల ఇంటింటికీ వెళ్లి తమ గుర్తు ఓటర్లకు చూపుతూ ప్రచారం చేస్తున్నారు.

లబ్ధిదారులపై ప్రత్యేక దృష్టి

అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలవడంతోపాటు పో లింగ్‌ బూత్‌కు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉండేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహం రూపొందించారు. ముఖ్యం గా ఓటర్లలో రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ పరికరాల సబ్సిడీ, ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌, ఇ తర సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించి వారి ఓటు వేయించుకునేలా చూస్తున్నారు. అన్ని ఎన్నికల్లో వెనుకపడ్డ కాంగ్రెస్‌ ఇతర పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో కూడా చేతులు ఎత్తేశాయి. తాము రైతులకు ఏం చేశాం? ఏం చేస్తాం? అనేది చెప్పలేకపోతున్నారు. సహజంగానే ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

గెలుపే లక్ష్యం

ఎన్నికలకు రెండు రోజుల సమయం ఉండటతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లకు విందులు ఏర్పాటు చేస్తూ గెలుపొందేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఓటుకు పెద్ద మొత్తంలో పంపిణీ చేసి గెలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చైర్మన్‌గా గెలవాలనుకునే అభ్యర్థులు అధికంగా ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో తమకు ఎన్ని ఓట్లు పడతాయనే సమాలోచనలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం రాని వారు, ఓడిపోయిన వారు ఎక్కువగా ఈ సహకార పోరులో బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా గెలుపొంది ప్రతిష్ట నిలుపుకోవాలని ఆరాట పడుతున్నారు.

బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం

ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతుండగా, అధికారులు ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 20 సహకార సంఘాలు ఉన్నాయి. 258 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఇందులో ఏడు సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. 258 వార్డుల్లో 168 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 13 సంఘాలు, 89 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులకు శిక్షణ కార్యక్రమం కూడా పూర్తి చేశారు. ఇక ఎన్నికల్లో కీలకమైన బ్యాలెట్‌ పత్రాల ముద్రణ కూడా పూర్తయినట్లు సహకార శాఖ అధికారులు వెల్లడించారు. బ్యాలెట్‌ పత్రాల్లో వరుసగా బీరువా, బ్యాట్‌, బ్యాటరీ టార్చ్‌, బ్రష్‌ గుర్తులను కేటాయించారు. 15వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభిస్తారు. వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను నిర్వహిస్తారు. ఒకే నామినేషన్‌ వస్తే.. వాటిని ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. మిగిలిన వాటిల్లో బ్యాలెట్‌ ద్వారా ఎన్నిక నిర్వహించనున్నారు.


logo