శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Feb 08, 2020 , 04:04:22

శాంతిఖని గనికి ఉజ్వల భవిష్యత్‌

శాంతిఖని గనికి ఉజ్వల భవిష్యత్‌

బెల్లంపల్లిటౌన్‌ : మ్యాన్‌ వైండింగ్‌ షాఫ్ట్‌ మందమర్రి ఏరియా చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలిచిపోతుందనీ, దీంతో శాంతిఖని గనికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని సింగరేణి డైరెక్టర్లు భాస్కర్‌రావు(పీపీ), శంకర్‌ (ఈ అండ్‌ ఎం) పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని శాంతిఖని లాంగ్‌వాల్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా మ్యాన్‌ వైండింగ్‌ షాఫ్ట్‌ను వారు ప్రారంభించారు. ఇతర అధికారులతో కలిసి మ్యాన్‌ వైండింగ్‌ షాఫ్ట్‌ ద్వారా పని స్థలాలను పరిశీలించారు. అనంతరం షాఫ్ట్‌ బ్లాక్‌ ఆవరణలో వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సమిష్ఠి కృషితోనే సంస్థకు అవార్డులు వస్తున్నాయన్నారు. రాబోయే 25 ఏండ్ల వరకు నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయవచ్చన్నారు. అడ్రియాల ప్రాజెక్ట్‌ తర్వాత శాంతిఖని గనిలోనే లాంగ్‌వాల్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. శాంతిఖని గనిలో అపారమైన నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయన్నారు. కార్మికులు ఇబ్బందుల దృష్ట్యా రూ. 43కోట్ల అంచనా వ్యయంతో ఇక్కడ మ్యాన్‌ వైం డింగ్‌ షాఫ్ట్‌ ప్రారంభించామన్నారు. మ్యాన్‌వైండింగ్‌తో గంట వ్యవధిలో వెళ్లే పనిస్థలాలకు 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చన్నారు. దూర భారం తగ్గడంతో కార్మికులకు ఒత్తిడి తగ్గి ఉత్పత్తి పెంచడానికి దృష్టికేంద్రీకరిస్తారన్నారు. బొగ్గు నిక్షేపాలను వెలికితీయడానికి పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. మందమర్రి ఏరియా జీఎం రమేశ్‌ రావు మాట్లాడుతూ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించడమే సంస్థ ధ్యేయమన్నారు. ఏరియాలో గత డిసెంబర్‌ నెలలో 100 శాతం ఉత్పత్తి సాధించిన జనవరి నెలలో గణనీయంగా తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో శాంతిఖని గ్రూప్‌ ఆఫ్‌ ఏజెంట్‌ వెంకటేశ్వర్లు, టీబీజీకేఎస్‌ మందమర్రి ఏరియా కార్యదర్శి సంపత్‌, శాంతిఖని గని పిట్‌ కార్యదర్శి దాసరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.