మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Feb 06, 2020 , 00:22:12

తల్లి దీవించు

తల్లి  దీవించు
  • ఆరంభమైన వనదేవతల జాతర
  • సీసీ కెమెరాలతో పోలీసుల పర్యవేక్షణ
  • బెల్లంతో మొక్కులు సమర్పణ
  • భారీగా తరలివస్తున్న భక్తులు
  • మూడు రోజులు వనమెల్లా జనం

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు ఆయా  జాతర ప్రదేశాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాల మధ్య సాయంత్రం జాతర ప్రాంగణాల్లోకి పగిడిద్దరాజు, గోవిందరాజులకు నమస్కరించి సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చారు. సారలమ్మ కొలువుదీరడంతో మొక్కులు చెల్లించడానికి భక్తులు ఉదయం నుంచి బారులుదీరారు. గద్దెల వద్ద నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరం, నస్పూర్‌లోని సీతారాంపల్లిలో భక్తులు గోదావరి స్నానాలు ఆచరించారు. జిల్లాలో జాతరలు జరుగుతున్న మిగతా ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి సారలమ్మను గద్దెపై ప్రతిష్టించారు. బుధవారం భక్తులు జాతరకు అధిక సంఖ్యలో హాజరై బంగారం(బెల్లం)తో అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. పారిశుధ్యసమస్య తలెత్తడంతో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు శానిటేషన్‌ సిబ్బందిని హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. 


తరలివస్తున్న భక్తులు

తొలిరోజు బుధవారం మంచిర్యాల గోదావరి సమీపంలోని జాతర ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి చేరుకొన్న భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆ తర్వాత అమ్మవారికి నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఇక్కడికి సుమారు 70 వేల మంది తరలిరాగా.. నస్పూర్‌, ఇటిక్యాల, బెల్లంపల్లిలోని బుగ్గ, కోటపల్లి, రామకృష్ణాపూర్‌కు సుమారు 8 వేల మంది వచ్చినట్లు తెలిపారు. జాతర ప్రదేశాల్లో భక్తుల కోసం అధికారులు, జాతర కమిటీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయగా ముఖ్యంగా సింగరేణి ఏరియాల్లో మరిన్ని సౌకర్యాలు సమకూర్చింది. 


నేడు గద్దెకు చేరుకోనున్న సమ్మక్క

గురువారం సమ్మక్క గద్దెకు చేరుకోనుంది. ఉదయం వన దేవతలు, సాయంత్రం తల్లి సమ్మక్క గద్దెకు రానుండటంతో భక్తుల రద్దీ పెరగనుంది. పోలీసు ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని, ఇబ్బందులను పరిశీలిస్తున్నారు. ఇబ్బందులు లేకుండా భక్తులు తమ మొక్కలు చెల్లించుకుంటున్నారు.


logo