శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Feb 05, 2020 , 02:33:30

తల్లులొచ్చే వేళాయె..

తల్లులొచ్చే వేళాయె..
  • నాలుగు రోజుల పాటు వనదేవతల వేడుక
  • మేడారం జాతరకు భారీ సంఖ్యలో తరలుతున్న భక్తులు
  • స్థానికంగా కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు
  • సింగరేణిలో తగ్గిన హాజరు శాతం
  • నేడు గద్దెకు సారలమ్మ రాక

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తల్లులొచ్చే సమయం ఆసన్నమైంది.. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క, శుక్రవారం మొక్కుల చెల్లింపు, శనివారం వనప్రవేశం ఉండనుంది. ఈ క్రమంలో వనదేవతల దర్శనానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పయనం అవుతున్నారు. దారులన్నీ భక్తులతో నిండిన బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు దర్శనమిస్తున్నాయి. జిల్లా నుంచి దాదాపు 40 శాతం జనం మేడారం బాట పట్టారు. బస్టాండ్‌లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇసుకేస్తే రాలనంత జనం ఉంటున్నారు. సింగరేణిలో కార్మికుల హాజరు శాతం చాలా తగ్గుముఖం పట్టింది. జిల్లావ్యాప్తంగా కూడా జనం స్థానికంగా అమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. స్థానిక జాతరల వద్ద గద్దెలను ముస్తాబు చేశారు. అన్ని మౌలిక వసతులు కల్పించారు.


ఉత్తరప్రదేశ్‌లో జరిగే కుంభమేళా తర్వాత దేశంలోనే భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకునే మేడారం జాతర తెలంగాణ కుంభమేళగా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి గాంచింది. మేడా రం జాతరకు జిల్లా నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు జిల్లా నుంచి 40 శాతం మంది తరలివెళ్తారంటే అతిశయోక్తి కాదు. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్కలు రానుండటం, శుక్రవారం మొక్కులు చెల్లించేందుకు భక్తులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.  జిల్లా నుంచి ఆర్టీ సీ బస్సులను అధిక సంఖ్యలో నడిపిస్తున్నది. ఎక్కడికక్కడ బస్సులు ఏర్పాటు చేయడంతోపాటు అవి నేరుగా గద్దెల వద్దకు వెళ్తుండడంతో చాలా మంది భక్తులు ఆర్టీసీనే ఆశ్రయిస్తున్నారు. మరికొందరు ప్రైవేట్‌ వాహనాల ద్వారా మేడారం జాతరకు బయల్దేరి వెళ్తున్నారు. అదే సమయంలో నేటి నుంచి ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేయడంతో భక్తులు వాటిని వినియోగించుకుని అమ్మ ల దర్శన భాగ్యం పొందనున్నారు. ఏ రోడ్డు చూసి నా మేడారం వైపే అన్నట్లుగా ఉంది పరిస్థితి.


ఆర్టీసీ బస్సులు, రైలు పయనం..

ఆర్టీసీ మేడారం జాతర కోసం భారీ సంఖ్యలో బస్సులు సిద్ధం చేసింది. చెన్నూరు నుంచి ఆదిలాబాద్‌ డిపో బస్సులు 55, ఆసిఫాబాద్‌ డిపో బస్సు లు ఆసిఫాబాద్‌ నుంచి 10, బెల్లంపల్లి నుంచి 55, శ్రీరాంపూర్‌ నుంచి భైంసా డిపో బస్సులు 35, మందమర్రి నుంచి నిర్మల్‌ డిపోకు చెందిన 52 బస్సులు మొత్తం 304 బస్సులు నడిపిస్తున్నా రు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సు పాయింట్‌వారీగా క్యాంప్‌ ఇన్‌చార్జీలను నియమించారు. ఎక్కడికక్కడ భక్తులను బస్సుల్లో ఎక్కించి పంపిస్తున్నారు. అదేవిధంగా 12 బోగీలతో కూడిన ప్రత్యేక రైలు బుధవారం నుంచి నడిపిస్తున్నారు. ఇది 8వ తేదీ వరకు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో చాలా మంది భక్తులు ఈ రైలు సౌకర్యం కూడా ఉపయోగించుకోనున్నారు.  


ప్రైవేటు వాహనాలకూ భలే గిరాకీ.. 

ప్రైవేట్‌ వాహనాలకు పెద్ద ఎత్తున గిరాకీ ఉం టోంది. ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లలేని భక్తులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. టాటా ఎస్‌లు, బొలేరో, ఇన్నోవా, ప్రైవేట్‌ ట్రావెట్స్‌కు చెందిన బస్సులు, చిన్న చిన్న ఆటోలలో వెళ్తున్నారు. అక్కడ మూడు రోజులు ఉండేలా ప్రణాళికలు రూ పొందించుకుని పయనం అవుతున్నారు. చెన్నూ రు ప్రాంతం నుంచి మహాముత్తారం మీదుగా మేడా రం బయల్దేరి వెళ్తున్నారు. ఇక సొంత వాహనాలు ఉన్న వారు కూడా మేడారం జాతరకు బయల్దేరి వెళ్తున్నారు. ఒక్కసారిగా ప్రైవేట్‌ వాహనాల యజమానులు పెద్ద ఎత్తున కిరాయిలు పెంచేశారు. అయినప్పటికీ కూడా భక్తులు వాటిని ఆశ్రయిస్తున్నారు. 


స్థానిక జాతర కోసం గద్దెలు ముస్తాబు

జిల్లాలో స్థానికంగా కూడా సమ్మక్క-సారల మ్మ జాతర కోసం పలు చోట్ల ఏర్పాట్లు పూర్తి చేశారు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరం, నస్పూరు సీతారంపల్లి, రామకృష్ణాపూర్‌ ఆర్‌కే 1ఏ, బెల్లంపల్లి ఏరియాలోని పెద్దబుగ్గ, చిన్న బుగ్గ ప్రాంతం, నెన్నెల మండలంలోని గంగారం గ్రామం, కన్నెపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామం, చెన్నూరు మండ లం సుబ్బరాంపల్లి, కోటపల్లి మండలం రాపన్‌పల్లి ప్రాంతాల్లో అధికారులు, కమిటీ నిర్వాహకులు అమ్మల జాత ర కోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశా రు. ఇటు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. గోదావరి తీరం ఉన్న జాతర ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. దీంతో బుధవా రం నుంచే అమ్మవారి జాతర కోసం ఆయా ప్రాంతాల్లో బస చేస్తున్నారు. 


సింగరేణిలో తగ్గిన హాజరు శాతం

మేడారం జాతర నేపథ్యంలో సింగరేణి హాజ రు శాతం తగ్గింది. సింగరేణిలో 40శాతం హాజరు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఈ జాతర కు కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి తదితర కోల్‌బెల్ట్‌ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో జనం జాతరకు తరలివెళ్తారు. నాలుగు రోజులపాటు ఇదే ఒరవడి కొనసాగుతుంది. దీం తో కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. ఏ ఇంటికి చూసినా తాళాలే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో పెద్ద ఎత్తున హాజరు శాతం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజులు ఇదే పరిస్థితి అని వారు స్పష్టం చేస్తున్నారు. హాజరు శాతం తగ్గకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ సమ్మక్క-సారలమ్మ గద్దెలు ఏర్పాటు చేసినప్పటికీ భక్తులు అక్కడికి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు.


logo