గురువారం 04 జూన్ 2020
Mancherial - Feb 04, 2020 , 01:06:56

‘సహకారం’పై గురి

‘సహకారం’పై గురి

నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ మరో ఎన్నికల సమరానికి సిద్ధమైంది. గతేడాది కాలంగా వరుస ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తున్న గులాబీ పార్టీ తాజాగా సహకార ఎన్నికల్లోనూ అదే ఒరవడిని కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తు న్న కారు.. తాజాగా సహకార ఎన్నికల్లోనూ తన జోరును కొనసాగించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించింది. సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులను బరిలోకి దింపుతోంది. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలైనప్పటికీ.. తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం జిల్లా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయగా.. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పీఏసీఎస్‌ల వారీగా దృష్టి పెట్టా రు. ముందుగా నియోజకవర్గంలోని మండలాలవారీగా ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇప్పటికే ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. మిగతా చోట్ల కూడా ఎమ్మెల్యేలు తమ పార్టీ ముఖ్య నాయకులతో సహకార సంఘాల ఎన్నికలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మండలానికి 13 పదవులు

ఆదిలాబాద్‌ జిల్లా సహకార బ్యాంకు పరిధిలోని నాలుగు జిల్లాలో 77 పీఏసీఎస్‌లు ఉన్నా యి. నిర్మల్‌ జిల్లాలో 17, ఆదిలాబాద్‌ జిల్లాలో 28, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 12, మంచిర్యాల జిల్లాలో 20 చొప్పున ఉన్నాయి. వీటికి ఈనెల 15న పోలింగ్‌ నిర్వహించేందుకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈనెల 6 నుంచి నామినేషన్లు ప్రారంభమవుతుండగా.. మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరిస్తారు. దీంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల వారీగా డైరెక్టర్లు, పీఏసీఎస్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల కోసం అభ్యర్థులను ఎంపిక చేయడంపై స్థానిక ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. ఒక్కో పీఏసీఎస్‌లో 13 మంది డైరెక్టర్లు ఉండగా.. వీరిలో నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 77 పీఏసీఎస్‌లో 1,001 మంది డైరెక్టర్లు ఉంటారు. వీరి ఎంపికపై స్థానిక ఎమ్మెల్యే లు దృష్టి పెట్టారు. మండలాలవారీగా ముఖ్య నా యకులతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. మండలానికి ఒక ప్రాథమిక వ్య వసాయ సహకార పరపతి సంఘం ఉంది.  మం డలంలో 13 వరకు పదవులు రానున్నాయి.

టీఆర్‌ఎస్‌ మద్దతు కోసం తహతహ

ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా.. 2013 ఫిబ్రవరి 2న బాధ్యతలు పీఏసీఎస్‌ ఎన్నికలు జరిగాయి. 2013 ఫిబ్రవరి 4న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 21 మంది డీసీసీబీ డైరెక్టర్లుండగా.. వీటిలో 16 మం ది పీఏసీఎస్‌ నుంచి వస్తుండగా.. ఐదుగురు మం ది వివిధ రకాల సొసైటీల నుంచి రానున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత.. స్వ రాష్ట్రం రావడం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వివిధ పార్టీల మద్దతుదారులైన వారంతా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పీఏసీఎస్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలు టీఆర్‌ఎస్‌లో చేరాయి. తాజాగా టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో బరి లో దిగేందుకు పెద్ద ఎత్తున వరుస కట్టారు. వరుస ఎన్నికలతో విజయాలతో మంచి జోరు మీదున్న టీఆర్‌ఎస్‌.. సహకార ఎన్నికల్లోనూ ఆ పార్టీ మద్దతుతో విజయం సులభంగా దక్కుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పీఏసీఎస్‌ డైరెక్టర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల కోసం పోటీ తీవ్రంగా నెలకొంది. స్థానిక ఎమ్మెల్యేల మద్దతు కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 


logo