మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Feb 03, 2020 , 04:01:14

రైతు‘బంధువు’

రైతు‘బంధువు’

రబీ సీజన్‌కు సంబంధించి రైతుబంధు నగదును తెలంగాణ సర్కారు విడుదల చేసింది. ఎకరం, రెండెకరాలు.. ఇలా ఒక్కో రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. రైతులు పెట్టుబడికి చితికిపోకూడదనే ఉద్దేశంతో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విధితమే. తెలంగాణ సర్కారు రైతుకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నది. కాగా.. జిల్లాలో అర్హులైన రైతులను గుర్తించి వారి అకౌంట్లను అధికారులు ట్రెజరీకి పంపారు. వారికి డబ్బులు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 405 గ్రామాల్లో 1,09,932 మంది రైతులు రూ.137.78 కోట్ల సాయం పొందనున్నారు. - మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ

  • పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట
  • రబీ సొమ్ము పంపిణీకీ ప్రభుత్వం ఉత్తర్వులు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రబీ సీజన్‌కు సంబంధించి రైతు బంధు డబ్బులను సర్కారు విడుదల చేసింది. జిల్లా వ్యవసాయాధికారులు ఇప్పటికే రైతులకు సంబంధించిన వివరాలు సేకరించారు. వారికి బ్యాంకు ఖాతా ల్లో డబ్బులు కూడా జమ అవుతున్నాయి. విడతలవారీగా ప్రభుత్వం వారికి సాయం అందించనుంది. సాగు పెట్టుబడికి రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్న నేపథ్యంలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది. దీని ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెట్టుబడి రూపేణా ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిధిలో ఎక్కు వ మంది రైతులు వరితోపాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. గూడెం ఎత్తి పోతల పథకంతోపాటు, ఈసారి భూగర్భ జలాలు పెరగడంతో పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తున్నారు. బోర్లు, చిన్ననీటి వనరుల వద్ద కూడా పంటలు పండిస్తున్నారు.


పరిపాలన అనుమతి

జిల్లాలోని 405 గ్రామాల్లో 1,09,932 మంది రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీరికి సంబంధించి ప్రస్తుత యాసంగిలో రైతుబంధు సాయం కింద రూ.137.78 కోట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. రైతుల నుంచి సేకరించిన బ్యాంకు ఖాతా వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానం చేసి వాటిని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయానికి పంపారు. రైతు బంధు కింద నగదు జమ చేసేందుకు మొత్తం రూ.137.78 కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో తొలి విడత కింద రైతుల వివరాలను ఖజానా కార్యాలయానికి పంపారు. ఈ క్రమంలో ఇటీవల నిధులు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ పరిపాలన అనుమతులు ఇచ్చింది. మొదట ఎకరం, తరువాత రెండు ఎకరాలు, ఇలా త క్కువ భూమి నుంచి ఎక్కువ ఉన్న వారి ఖా తాలో నగదు జమ చేయాలని వ్యవసాయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.


రబీలో సాగుకు సమాయత్తం

జిల్లాలో రబీలో 55 వేల హెక్టార్లలో పంట లు సాగు అవుతాయని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. జిల్లాలో గూడెం ఎత్తిపోతల పథకం కింద వరి, ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురియడంతో భూగర్భ జలాలపై రైతులు ఆశలు పెట్టుకుని సాగుకు సమాయత్తం అవుతున్నారు. జిల్లావ్యాప్తంగా పంట సాగు కోసం సమాయత్తం అవుతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వ కూడా వీరికి రైతుబంధు పథకం కింద డబ్బులు అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలో మండలాలవారీగా అర్హులైన రైతులను గుర్తించి వారికి సంబంధించిన ఖాతాను అధికారులు ట్రెజరీకి పంపారు.  దీంతో ఈ డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. logo