గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Feb 01, 2020 , 03:23:51

అతివలదే.. ఆధిక్యం

అతివలదే.. ఆధిక్యం
  • ఉమ్మడి జిల్లాలో అధిక మంది కౌన్సిలర్లు వారే..
  • రెండు పురపీఠాలు రిజర్వు.. నాలుగు చోట్ల పదవులు
  • మూడు మున్సిపాలిటీ జనరల్‌ స్థానాల్లోనూ గెలుపు

ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మం చిర్యాల జిల్లా మందమర్రి బల్దియా 1/70 చట్టం అమలులో ఉండటంతో ఎన్నికలు నిర్వహించ లేదు. వివాదం కోర్టుకి చేరటంతో ప్రత్యేకాధికారి పాలనలో నడుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 11 చోట్ల ఈ నెల 22న పోలింగ్‌ నిర్వహించగా.. 25న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు. 11 మున్సిపాలిటీలకు 10 చోట్ల టీఆర్‌ఎస్‌ పురపీఠాలను దక్కించుకోగా.. ఒక్క భైంసాలో మాత్రమే ఎంఐఎం పురపీఠాన్ని కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలోని 11 పురపాలక సంఘా ల్లో మొత్తం 309 వార్డులు ఉండగా.. వీటిలో 50 శాతం మహిళలకు రిజర్వు చేశారు. దీంతో మొత్తం 153 వార్డులను మహిళలకు రిజర్వేషన్‌ చేయగా.. మిగతా 156 వార్డులను జనరల్‌ స్థానాలుగా ఉంచారు. 153 వార్డుల్లో పూర్తిగా మహిళలే పోటీ చేసేందుకు అవకాశం కల్పించగా.. మిగతా జనరల్‌ స్థానాల్లో పురుషులతోపాటు మహిళలు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు.


 

పోలింగ్‌లోనూ వారే ప్రథమం..

ఓటర్లు, పోలింగ్‌లోనూ తామే ముందున్నామని నిరూపించారు. ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళలు 2,059 మంది ఓటింగ్‌లో అధికంగా పాల్గొన్నారు. నిర్మల్‌, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్సెట్టిపేట మున్సిపాలిటీలో పురుషుల కంటే మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాల, నస్పూర్‌, క్యాతన్‌పల్లి, భైంసా మున్సిపాలిటీలో మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా వచ్చిన ఫలితాల్లోనూ వారిదే పైచేయి కొనసాగింది. పురుషుల కంటే మహిళలే ఎక్కువ కౌన్సిలర్లు.. 

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో పురుషుల కంటే మహిళలు అధిక మంది కౌన్సిలర్లుగా గెలుపొందారు. రిజర్వు స్థానాలతోపాటు జనరల్‌ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళలు ఏడుగురు మంది ఎక్కువ కౌన్సిలర్లు గెలిచారు. ఉమ్మడి జిల్లాలో 158 మంది మహిళలు కౌన్సిలర్లుగా గెలువగా.. పురుషులు 151 మంది విజయదుందుభి మోగించారు. వాస్తవానికి మహిళలకు 153 వార్డులను రిజర్వు చేయగా.. ఐదు జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేసి విజయం సాధించడం విశేషం. రిజర్వు స్థానాలకంటే ఐదు స్థానాలు ఎక్కువగా గెలిచారు. జనరల్‌ స్థానాలు 156 ఉండగా.. 151మంది పురుషులు కౌన్సిలర్లుగా గెలిచారు. కాగజ్‌నగర్‌లో రెండు వార్డులు, మంచిర్యాలలో ఒకవార్డు, బెల్లంపల్లిలో రెండు వార్డుల్లో జనరల్‌ స్థానాల్లో మహిళలు పోటీ చేసి విజయం సాధించారు.


రెండు రిజర్వు.. నాలుగు చోట్ల ఛైర్‌ పర్సన్లు..

మరోవైపు జిల్లాలో రెండు చోట్ల మున్సిపల్‌ చైర్మన్‌ పదవులు మహిళలకు రిజర్వు చేయగా.. నాలుగు చోట్ల మహిళలు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పీఠాలను దక్కించుకున్నారు. జనరల్‌ స్థానాల్లోనూ మహిళలకు అవకాశం కల్పించారు. క్యాతన్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌ రిజర్వు చేయగా.. టీఆర్‌ఎస్‌ నుంచి జంగంకళ(ఎస్సీ మహిళ)ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ పదవి జనరల్‌ కాగా.. టీఆర్‌ఎస్‌ నుంచి జక్కుల శ్వేత(ఎస్సీ మహిళ)ను మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. ఇక చెన్నూర్‌ మున్సిపాలిటీ జనరల్‌ మహిళకు కేటాయించగా.. ఇక్కడ అర్చన గిల్డా (టీఆర్‌ఎస్‌), భైంసా మున్సిపాలిటీకి బీసీ మహిళకు కేటాయించగా.. సబియాబేగం (ఎంఐఎం) చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.


జనరల్‌ స్థానాల్లో గెలిచింది వీరే.. 

కాగజ్‌నగర్‌లో 27వ వార్డు ఎస్సీ జనరల్‌ కాగా.. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి పంబాల సుజాత(ఎస్సీ), 12వ వార్డు ఎస్టీ జనరల్‌ కాగా.. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి శశికళ(ఎస్టీ) గెలిచారు. మంచిర్యాలలో 33వ వార్డు ఆన్‌ రిజర్వుడ్‌(జనరల్‌) స్థానం కాగా.. టీఆర్‌ఎస్‌ నుంచి జగ్గరి సుమతి విజయం సాధించారు. బెల్లంపల్లిలో 21వ వార్డు ఎస్సీ జనరల్‌ కాగా.. టీఆర్‌ఎస్‌ నుంచి రాజనాల కమల(ఎస్సీ), 28వ వార్డు బీసీ జనరల్‌ కాగా.. టీఆర్‌ఎస్‌ నుంచి సరిత(బీసీ) గెలుపొందారు.


logo