గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jan 31, 2020 , 03:44:29

సహకార ‘సమరం’

సహకార ‘సమరం’

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్‌) ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసి.. మూడో వారంలో ఎన్నికలు నిర్వహించి, ఫలి తాలు వెల్లడించనున్నారు. వెంటనే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉండనుంది. ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిన నిర్వహించ నున్నారు. జిల్లావ్యాప్తంగా 20 పీఏసీఎస్‌లు ఉండగా.. 23,056 మంది సభ్యులు ఉన్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకోను న్నారు. కాగా.. షెడ్యూల్‌ వెలువడడంతో పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటివరకు పలు దఫాలుగా ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రైతులందరూ టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారు. గ్రామాల్లో తమకు పదవులు లభిస్తాయని నాయకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ దూసుకుపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. - మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ

  • ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల
  • పల్లెల్లో మళ్లీ ఎన్నికల కోలా‘హలం’
  • పదవులపై ఆశలు పెట్టుకుంటున్న నేతలు
  • 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
  • 15వ తేదీన ఎన్నికలు, ఫలితాలు విడుదల
  • 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక
  • బ్యాలెట్‌ పద్ధతిన ఎన్నికల నిర్వహణ
  • అవి కూడా టీఆర్‌ఎస్‌వేనని స్పష్టం చేస్తున్న నాయకులు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)లకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 9వ తేదీన పరిశీలన, 10వ తేదీన ఉపసంహరణ ఉండనుంది. ఇదే రోజు బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌.. అనంతరం కౌంటింగ్‌ ఉండనుంది. 16వ తేదీన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉంటుంది. కాగా.. చివరగా సహకార ఎన్నికలు ఫిబ్రవరి 2, 2013న నిర్వహించారు. 4వ తేదీన పాలకవర్గాలు కొలువుదీరాయి. ఫిబ్రవరి 4, 2018న పదవీకాలం ముగిసింది. ఆరు నెలల చొప్పున నాలుగు సార్లు సర్కారు పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఈ పదవీ కాలం కూడా ఫిబ్రవరి 4తో ముగియనుంది. రైతులకు విభిన్న సేవలు అందిస్తున్న ఈ సంఘాల పాలక మండళ్ల ఎన్నికల నిర్వహణ తెరపైకి రావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.


బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు

బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం సిబ్బందిని ఏర్పాటు చేశారు. గతేడాదే పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నుంచి ఇవ్వనున్నారు. గతంలో ఎన్నికల అధికారి ప్రతిపాదనలు సమర్పించి సొసైటీ నుంచే ఖర్చు చేసే విధానం ఉండేది. అయితే అందులో లోటుపాట్లు, అవినీతి చోటు చేసుకుంటున్నందున ఇటీవల ఎన్నికల నిబంధనల్లో భాగంగా సవరణలు తీసుకొచ్చారు. సహకార సంఘంలో ఏడాది, అంతకంటే ఎక్కువ కాలం సభ్యులుగా కొనసాగిన వారినే ఓటరుగా గుర్తించనున్నారు.


పాత 20 పీఏసీఎస్‌లకే ఎన్నికలు

జిల్లాలోని 18 మండలాల్లో 20 సంఘాలు ఉన్నాయి. ఇవీ మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోని దండేపల్లి మండలంలో నెల్కివెంకటాపూర్‌, గూడెం, లక్షెట్టిపేట మండలంలో జెండా వెంకటాపూర్‌, ఇటిక్యాల, గుల్లకోట, హాజీపూర్‌ మండలంలో కర్ణమామిడి, పడ్తనపల్లి, మంచిర్యాల మండల కేంద్రంలో మంచిర్యాల పీఏసీఎస్‌లకు, ఖానాపూర్‌ నియోజక వర్గం పరిధిలోని జన్నారం మండలంలో పొన్కల్‌, చింతగూడ పీఏసీఎస్‌లకు, బెల్లంపల్లి నియోజక వర్గం పరిధిలోని కాసిపేట మండలంలో ఉన్న ధర్మరావుపేట పీఏసీఎస్‌కు, బెల్లంపల్లి మండలంలో చంద్రవెల్లి, తాండూరులోని తాండూరు, భీమినిలోని భీమిని, నెన్నెలలోని నెన్నెల, వేమనపల్లిలోని వేమనపల్లి పీఏసీఎస్‌లకు, చెన్నూర్‌ నియోజకవర్గం పరిధిలోని కోటపల్లి మండలంలోని కోటపల్లి పీఏసీఎస్‌, చెన్నూర్‌లోని చెన్నూర్‌, జైపూర్‌లోని జైపూర్‌, మందమర్రిలోని మందమర్రి పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తగా మండలానికి రెండు చొప్పున సంఘాలు ఏర్పాటు చేస్తుండగానే  పాత వాటికే ఎన్నికలు జరుపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


పదవుల కోలాహలం

సహకార సంఘాల్లో గెలిస్తే రైతులతో నేరుగా సంబంధాలు ఉంటాయి. పదవులు అలంకరించేందుకు సోపానంగా ఉపయోగపడతాయి. అందుకే చాలా మంది నేతలు గ్రామాల్లో సహకార సంఘాల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతారు. ఒక్కో సహకార సంఘం పరిధిలో 13 మంది డైరెక్టర్లు ఉంటారు. 13 మంది డైరెక్టర్లను బ్యాలెట్‌ పద్ధతిలో సంఘం పరిధిలోని ఓటర్లు ఎన్నుకుంటారు. డైరెక్టర్ల ఎన్నిక ముగిసిన అనంతరం అందులోనే ఒకరిని సంఘం చైర్మన్‌గా, మరొకరిని వైస్‌చైర్మన్‌గా ఎన్నుకుంటారు. వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు అంతా కలిసి జిల్లా సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. 


సంఘాల చైర్మన్లు డీసీసీబీలో సభ్యులుగా, అధ్యక్షునిగా, డీసీఎంఎస్‌ సభ్యులుగా, అధ్యక్షునిగా ఎన్నిక అవుతారు. తర్వాత మార్క్‌ఫెడ్‌ తదితర రాష్ట్ర స్థాయి పదవులను వీరి నుంచే భర్తీ చేస్తారు. దీంతో పీఏసీఎస్‌ డైరెక్టర్లుగా, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకోవడంపై ఆశావహులు అప్పుడే దృష్టి సారించారు. సహకారం సంఘంలోని ఓటరు జాబితా ఆధారంగా ఓటర్లను కలిసి ఇప్పటి నుంచే వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు కూడా సహకార సంఘ ఎన్నికలపై దృష్టి సారించాయి. పీఏసీఎస్‌ చైర్మన్‌తోపాటు జిల్లా సహకార సంఘం చైర్మన్‌ పదవి తమ పార్టీకి చెందిన వారికి దక్కేలా పావులు కదుపుతున్నాయి. 


టీఆర్‌ఎస్‌దే దూకుడు

ఈ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది. గతంలో ఎన్నికలు నిర్వహించాలని భావించినా వరుస ఎన్నికల నేపథ్యంలో సహకార సంఘాల పదవీ కాలం పొడిగిస్తూ వచ్చారు. అయితే, అన్ని ఎన్నికల్లో జయకేతనం ఎగురవేస్తున్నట్లే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని పలువురు నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలు రైతులకు సంబంధించినవి కావడటంతో కచ్చితంగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులే జయకేతనం ఎగురవేస్తారని స్పష్టం చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే. గతంలో ఎకరానికి రూ.4వేలు ఇచ్చిన ప్రభుత్వం గత ఖరీఫ్‌ నుంచి రూ.5వేలకు పెంచింది. 


మరోవైపు రైతు బీమా కింద చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 24 గంటల విద్యుత్‌తో రైతులకు చీకుచింతా లేకుండా పోయింది. గత ప్రభుత్వాల హయాంలో చేతికి వచ్చి ముద్ద కూడా కరెంటు లేక నేలపాలైన సందర్భాలు ఎన్నో.. కానీ.. ఇప్పు డు ఆ పరిస్థితి లేదు. రైతునే రాజును చేయాలనే ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. దీంతో గ్రామాల్లో ప్రజలు ముఖ్యంగా రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే ఉన్నారు. వారంతా అన్ని ఎన్నికల్లో ఏకపక్షంగా ఓట్లేశారు. సహకార సంఘం ఎన్నికల్లో కూడా విజయం కచ్చితంగా టీఆర్‌ఎస్‌ బలపరిచే అభ్యర్థులదేనని రాజకీయ పరిశీలకులు ఘంటాపథంగా చెబుతున్నారు.


logo