గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jan 28, 2020 , 02:20:02

‘గులాబీ’కే పట్టం కట్టారు..

‘గులాబీ’కే పట్టం కట్టారు..
  • ఏకపక్షంగా ఓట్లు వేసి గెలిపించిన సింగరేణి కార్మికులు
  • సీఎం కేసీఆర్‌ వెంటే ఉన్నామని నిరూపించిన నల్లసూర్యులు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణకు సింగరేణి గుండెకాయ వంటిది. సీమాంధ్ర పాలనలో వివక్షకు గురైంది. ఉద్యోగాలు కూడా ఆంధ్రా ప్రాంతం వారికే అప్పగించేవారు. బొగ్గును కూడా తమ ప్రాంతానికి తరలించుకుపోయారు. కార్మికులు అనేక అవస్థలు పడి ఉద్యోగాలు బంద్‌ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో గోల్డెన్‌ హ్యాండ్‌ షేక్‌ పేరిట ఉద్యోగాలు ఊడగొట్టి కార్మికులను ఇంటికి సాగనంపారు. తెలంగాణ సర్కారు ఏర్పడి.. సీఎం కేసీఆర్‌ అయిన తర్వాత సింగరేణిలో సమూల మార్పులు వచ్చాయి. కారుణ్య నియామకాలతో కార్మికుల్లో సంతోషం వెల్లివిరిసింది. లాభాల్లో బోనస్‌ భారీగా పెంచడం, వేలాది మందికి ఉద్యోగాల కల్పన, మ్యాచింగ్‌ గ్రాంట్‌ పెంపు, సొంతింటి రుణం కోసం రూ.10 లక్షలు రుణం ఇస్తున్నారు. ఫలితంగా కేసీఆర్‌ అంటే కార్మికులకు  ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి.

ఏకపక్షంగా ఓట్లేసిన కార్మికులు

సింగరేణి ప్రాంతంలో ఓట్ల సరళిని పరిశీలిస్తే కార్మికులు ఏకపక్షంగా ఓటేశారని స్పష్టం అవుతున్నది. బెల్లంపల్లి, నస్పూరు, క్యాతన్‌పల్లిలో పూర్తిస్థాయిలో చెన్నూరు, మంచిర్యాలలో పాక్షికంగా సింగరేణి కార్మికుల ప్రభావం ఉంది. ఏడాది కాలంగా జరుగుతున్న ఎన్నికల్లో వీరు నివసిస్తున్న ప్రాంతాల్లో ఇతర పార్టీలకు కనీసం సీట్లు కూడా రాని పరిస్థితి నెలకొని ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితిని మాత్రం ఆదరిస్తున్నారు. జనవరి 22న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కార్మికలు ఏకపక్షంగా ఓట్లు వేశారని ఓటింగ్‌ విధానం ద్వారా తెలుస్తున్నది. కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ కేవలం సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం ఇందుకు నిదర్శనం. అభ్యర్థులకు మద్దతుగా టీబీజీకేఎస్‌ నేతల ప్రచారం కూడా కలిసొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా సింగరేణి సంస్థకు చేసిన మేలును వివరిస్తూ అభ్యర్థులు కార్మికులను ఓట్లు అభ్యర్థించారు. అందుకే ఆ స్థాయిలో ఏకపక్ష ఓటింగ్‌ సాగిందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. 

కారుణ్యం కొనసాగాలనే.. 

సింగరేణి భవిష్యత్‌ కోసమే తాము టీఆర్‌ఎస్‌కు ఓట్లేసినట్లు కార్మికులు చెబుతున్నారు. ముఖ్యంగా సింగరేణి సంస్థ విస్తరణతోపాటు కార్మికులకు ముఖ్యమంత్రి ఎంతో పాటు పడ్డాడని చెబుతున్నారు. అంతేకాకుండా, ఉద్యోగాల కల్పన పెద్ద ఎత్తున చేశారని, తెలంగాణలో ఉద్యోగాలు ఇచ్చి సంస్థగా సింగరేణి రికార్డు సాధించడానికి కారణం ముఖ్యమంత్రేనని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. ఇక తమకు రావాల్సిన అన్ని రకాలైన సౌకర్యాలు వచ్చేలా చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని అందుకే తాము కారుకు ఓటేశామని ఘంటాపథంగా తెలుపుతున్నారు. ఇక సింగరేణిలో ముఖ్యమైన హక్కు అయిన కారుణ్య నియామకాలకు సంబంధించి కేసీఆర్‌ ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ తమ కోసం శ్రమించారని కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారని ఇక ముందు ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌ వెంటే ఉంటామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.logo