బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Jan 27, 2020 , 00:08:48

నేడు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

నేడు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
  • చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక

మంచిర్యాలటౌన్‌, నమస్తే తెలంగాణ: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం, అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నికలకు సంబంధించి స్పెషలాఫీసర్‌గా మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస్‌ను జిల్లా కలెక్టర్‌ నియమించారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల అనంతరం ఆయన సంబంధిత కౌన్సిలర్ల ఎలక్షన్‌ ఏజెంట్ల ద్వారా సోమవారం జరిగే ప్రత్యేక సమావేశానికి సంబంధించిన సమాచారం అందించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికైన కౌన్సిలర్‌ అభ్యర్థులచేత ప్రమాణస్వీకారాన్ని చేయిస్తారు. అనంతరం 12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నికలను  నిర్వహిస్తారు. మంచిర్యాల మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా ఇందులో 21 స్థానాలను టీఆర్‌ఎస్‌, 14 స్థానాలను కాంగ్రేస్‌, ఒక్క స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులను చేపట్టేందుకు టీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన అభ్యర్థులనే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లుగా ఎన్నుకుంటారు. 

నస్పూర్‌లో ఏర్పాట్లు పూర్తి 


సీసీసీ నస్పూర్‌, శ్రీరాంపూర్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో విజేతలెవరో తేలిపోయింది. ఇక కౌన్సిలర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ప్రమాణ స్వీకారం మిగిలింది. ఈనెల 27న ప్రమాణ స్వీకారంకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నస్పూర్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌-10, కాంగ్రెస్‌-6, బీజేపీ-3, సీపీఐ-2, ఇండిపెండెంట్లు-3, ఒకరు ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి గెలుపొందారు. టీఆర్‌ఎస్‌కు ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడంతో ఈ మున్సిపాలిటీ గులాబీ పార్టీకే చైర్మన్‌ పదవీ దక్కింది. ఇండిపెండెంట్లు, ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థితో టీఆర్‌ఎస్‌ బలం 14కు చేరుకురింది.  

చైర్మన్‌గా ఈసంపల్లి ప్రభాకర్‌.!నస్పూర్‌ మున్సిపాలిటీలో చైర్మన్‌ అభ్యర్థులైన డికొండ అన్నయ్య, ఆయన తర్వాతి స్థానంలో ఉన్న వేల్పుల రాజేశ్‌ ఓటమి చెందారు. దీంతో 9వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందిన ఈసంపల్లి ప్రభాకర్‌ను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలిపింది. 

వైస్‌ చైర్మన్‌కు గట్టి పోటీ..వైస్‌ చైర్మన్‌ పీటానికి ముందుగా ఎమ్మెల్యే దివాకర్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి పేరును ఖరారు చేశారు. ఇండిపెండెంట్‌ తోట శ్రీనివాస్‌ పోటీ పడ్డారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేలు అందరితో చర్చలు జరిపారు. చివరికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలుపొందిన(టీఆర్‌ఎస్‌ రెబల్‌) తోట శ్రీనివాస్‌కు మొదటి రెండున్నర ఏళ్లు, తర్వాత రెండున్నరేళ్లు ముందుగా ప్రకటించిన వంగ తిరుపతికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

లక్షెట్టిపేట మున్సిపాలిటీలో..

లక్షెట్టిపేట : నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో సోమవారం పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రాజలింగు ఆదివారం తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నుంచి 9 మంది, కాంగ్రెస్‌ నుంచి 5గురు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒకరు మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మెజార్టీ పరంగా టీఆర్‌ఎస్‌ పార్టీ  అభ్యర్ధులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను చేపట్టడం ఖాయంగా మారనున్నది.logo