శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Jan 25, 2020 , 03:27:21

‘పుర’ ఫలితాలు నేడే

‘పుర’ ఫలితాలు నేడే
  • - ఉదయం 8గంటల నుంచి ప్రారంభం
  • - వార్డుకు ఒకటి చొప్పున టేబుళ్ల ఏర్పాట్లు
  • -ఆరు మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తి
  • - సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్‌
  • - పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసిన పోలీసులు
  • -చెన్నూర్‌, నస్పూర్‌లో పరిశీలించిన డీసీపీఉదయ్‌కుమార్‌రెడ్డి
  • -కేంద్రాల వద్ద 144 సెక్షన్‌
  • - పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్‌ భారతి హోళికేరిమంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల ఓట్లు నేడు లెక్కించనున్నారు. ఈమేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారం భం కానుంది. ముందుగా పోస్టల్‌ ఓట్లు లెక్కించి 8.30కి బ్యాలె ట్‌ బాక్సుల్లోని ఓట్ల లెక్కిస్తారు. మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాములో, నస్పూర్‌కు సంబంధిచి స్థానిక సేవా భవన్‌లో, బెల్లంపల్లివి తాసిల్దార్‌ కార్యాలయంలో, చెన్నూరు మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో, లక్షెట్టిపేటలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో, క్యాతన్‌పల్లికి సంబంధించి రామకృష్ణాపూర్‌ సింగరేణి క్లబ్‌లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేశారు.

ఇప్పటికే స్ట్రాంగ్‌రూంల్లో బ్యాలెట్‌ బాక్సులు భద్రం..

ఎన్నికలు ఈ నెల 22న ముగిసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ మున్సిపాలిటీల్లో బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచారు. ఇవి మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్ష ణ ఉండగా, లెక్కింపు కేంద్రాల్లో టేబుల్‌, సీటింగ్‌ ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. దీనికి సంబంధించి రిటర్నింగ్‌ అధికారులు దృష్టి పెట్టారు. పారదర్శకంగా లెక్కింపు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళికేరీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల లెక్కంపు ప్రక్రియ ఆలస్యమైనా ఎక్కడ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా జరగడానికి రిటర్నింగ్‌ అధికారులు, ప్రత్యేక అధికారులు, నోడల్‌ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక చికిత్స, విద్యుత్‌, తాగునీరు పంపిణీకి ఏర్పా ట్లు చేశారు.

రెండు దశల్లో లెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటిది ప్రాథమిక దశగా, రెండోది ఫలితం నిర్దేశించే దశ(గుర్తులవారీగా ఓట్ల లెక్కింపు)గా నిర్దేశించారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు ఉదయం ఆరు గంటలకే లెక్కింపు కేంద్రాలకు చేరుకుంటారు. అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్‌ రూం తెరుస్తారు. పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన బ్యాలెట్‌ పెట్టెను సంబంధిత టేబుల్‌ వద్దకు తీసుకువస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి టేబుల్‌ వద్ద ఒక ఇన్‌చార్జి, ఇద్దరు సహాయకులు ఉంటారు.

ఆ ఓట్లపై ఆఖర్లో నిర్ణయం..

ప్రతి టేబుల్‌పై ఆయా డివిజన్‌, వార్డులో పోటీచేసిన అభ్యర్థులకు ఒక్కో ట్రే ఉంచుతారు. నోటా కు ఒకటి, అనుమానం గా ఉన్న వాటికోసం మరొకటి పెడతారు. ఓట్ల కట్టలు విప్పి అభ్యర్థులకు వచ్చిన ఓట్ల ను ఆయా అభ్యర్థికి సం బంధించిన ట్రేలో వేస్తారు. నోటాకు వచ్చి న ఓట్లను నోటా ట్రే లో, సిరా సరిగ్గా అంటని, రెండు వైపు లా అం టి, అనుమానంగా కనిపించే ఓట్లను మరో ట్రేలో వేస్తారు. అనుమానాస్పదంగా ఉన్న ఓట్లపై ఆఖర్లో రిటర్నింగ్‌ అధికారి నిర్ణయిస్తారు. అభ్యర్థులను లేదా ఏజెంట్లను పిలిచి వారి సమక్షంలో రిటర్నిం గ్‌ అధికారి వాటిని తేలుస్తారు. తర్వాతే అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను ప్రకటిస్తారు.

మధ్యలో ఉంటే స్కేలుతో కొలిచి నిర్ణయం

బ్యాలెట్‌ పత్రంపై ఓటర్లు వేసిన స్వస్తిక్‌ ముద్ర ఇద్దరు అభ్యర్థుల పేర్ల మధ్యలో ఉంటే అధికారులు స్కేలుతో కొలిచి నిర్ణయం తీసుకుంటారు. ఇద్దరు అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి పేరకు సమీపంలో స్వస్తిక్‌ ముద్ర ఉందో చూసి ఓటును ఆ అభ్యర్థి ఖాతాలో వేస్తారు. అభ్యర్థి పేరుపై స్వస్తిక్‌ ముద్ర వేయకుండా టిక్‌ చేసినా సరరే దాన్ని పరిగణనలోకి తీసుకుంటా రు. ఇద్దరు అభ్యర్థుల పేర్లపై టిక్‌ చేసతే తిరస్కరిస్తా రు. ఒకవేళ ఎవరైనా ఓటర్లు అత్యుత్సాహంతో బ్యాలెట్‌ పత్రంపై ఎక్కడైనా తమ ఓటరు సీరియల్‌ నెంబర్‌ రాసిన పక్షంలో వాటిని తిరిస్కరిస్తారు.

రీ కౌంటింగ్‌ చేయాలంటే..

వార్డు పరిధిలో ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే ఏజెంట్లు సంతకాలు తీసుకున్న తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే రిటర్నింగ్‌ అధికారి ఆయా వార్డుల ఫలితాలు వెల్లడిస్తారు. ఫలితంపై పోటీ చేసిన అభ్యర్థులకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత పదిహేను నిమిషాలలోపు రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేస్తూ రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు సమర్పించాలి. అప్పుడే రీ కౌంటింగ్‌కు అవకాశం ఉంటుంది. రీ కౌంటింగ్‌పై తుది నిర్ణయం మాత్రం రిటర్నింగ్‌ అధికారిదేనని ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో ఏదైనా వార్డులో ఇద్దరు అభ్యర్థులకు సమా న ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో విజేతను ప్రకటించనున్నారు. ఇందుకు రెండు బాక్సుల్లో ఒక్కో అభ్యర్థి పేరిట ఐదు చీటీలు రాసి వేస్తారు. ఇలా పది చీటీలను మరో డబ్బాలో వేసి కలుపుతారు. అందులో లాటరీ తీసి ఫలితం ప్రకటిస్తారు.

                logo