శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Jan 24, 2020 , 00:55:40

క్యాంపునకు పోదాం.. చలో.. చలో..

క్యాంపునకు పోదాం.. చలో.. చలో..మున్సిపల్‌ ఎన్నికలు ముగియడంతో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. తమ పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు లోనుకాకుండా ఉండేందుకు జాగ్రత్తలు     తీసుకుంటున్నారు. తమ అభ్యర్థి, మరో పార్టీ అభ్యర్థి, ఇతర పార్టీల నేతలను కలవకుండా చూస్తున్నారు. లక్షెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్‌ బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు గురువారమే తరలివెళ్లారు. చెన్నూరు, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లికి చెందిన కౌన్సిలర్‌ అభ్యర్థులు     శుక్రవారం బయల్దేరి వెళ్లనున్నారు. ఈనెల 27వ తేదీన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉండటంతో కౌన్సిలర్‌గా గెలిచిన అభ్యర్థులను నేరుగా ఎన్నికల     కేంద్రానికే తీసుకొచ్చేలా చూస్తున్నారు.          - మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా లో బల్దియా ఎన్నికలు ముగియడంతో.. క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలు ఉండగా, మూడింటిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు క్యాంపునకు వెళ్లారు. మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట, మంచిర్యా ల, సీసీసీ నస్పూరు బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌ కౌ న్సిలర్‌ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు తరలివెళ్లారు. చెన్నూర్‌, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లికి చెం దిన కౌన్సిలర్‌ అభ్యర్థులు శుక్రవారం బయల్దేరి వెళ్లనున్నారు. ఈ మేరకు అభ్యర్థులతో మంతనా లు జరిపిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు వారిని సాయంత్రం క్యాంపునకు తరలించారు. మున్సిపాలిటీల వారీగా అభ్యర్థులను ఆయా రిసార్ట్‌లలో ఉంచుతారు. 27న చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ సమయానికి ఎన్నిక ప్రాంతానికి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అభ్యర్థులు చేజారకుం డా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

కౌంటింగ్‌ కేంద్రాలు రెడీ

ఈ నెల 25వ తేదీన ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు మొదలయ్యాయి. మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో, నస్పూరు మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాన్ని సీసీసీలోని సింగరేణి భవన్‌ హాల్‌లో, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి రామకృష్ణాపూర్‌ సింగరేణి క్లబ్‌లో, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి సంబంధించి లక్షెట్టిపేట పాత ఎంపీడీవో కార్యాలయంలో, బెల్లంపల్లి మున్సిపాలిటీకి సం బంధించి తాసిల్దార్‌ కార్యాలయంలో, చెన్నూర్‌ మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్‌ కేంద్రాన్ని చెన్నూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. శనివారం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో వాస్తవానికి అభ్యర్థులు ఉండాలి. కానీ, అభ్యర్థులు ఉండే పరిస్థితి కనిపించడం లే దు. కేవలం అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు మాత్రమే ఉండనున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఓడిన వారు క్యాంపుల నుంచి వైదొలగనుండగా.. గెలిచిన వారు 27 మధ్యాహ్నం ఎన్నిక జరిగే సమయానికి రానున్నారు.

ఆర్థికంగా భారం కాదు

మున్సిపల్‌ ఎన్నికల పోరు హోరాహోరీగా సా గింది. చాలా చోట్ల కారు వేగంతో దూసుకుపోయి నా అభ్యర్థులు, స్థానిక సమీకరణాల నేపథ్యంలో ద్విముఖ, త్రిముఖ పోరు కూడా కొనసాగింది. దీంతో ఏ ఒక్క అభ్యర్థి కూడా చేజారకుండా జా గ్రత్త పడుతున్నారు. ఒక్కరూ కూడా వేరే పార్టీల వైపు మొగ్గు చూపకుండా, వారితో కనీసం మంతనాలు కూడా చేయకుండా వారిని క్యాంపునకు తరలిస్తున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకే వారికి తీసుకువెళ్లేందు కు రంగం సిద్ధం చేశారు. సభ్యులు అందుబాటు లో ఉండేలా, ఎన్నిక సమయానికి అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరానికి సమీపంలో ఉన్న రిసార్టులు, హోటళ్లలో క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు నాలుగు రోజులే గడువు ఉండడంతో ఆర్థికంగా పెద్దగా భారం ఉం డదని భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెర లేపాయి.

కాంగ్రెస్‌ పార్టీ సైతం

ప్రస్తుత ఎన్నికల్లో తమకు మెజారిటీ వస్తుందని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ క్యాంపు రాజకీయాలకు సిద్ధం అవుతోంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కనీసం తమకు రెండు మున్సిపాలిటీలు వస్తాయని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో వారు కూడా క్యాంపులకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నా రు. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌ రావు దీనికి సం బంధించి పర్యవేక్షిస్తున్నారు. తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు వారు కూడా శుక్రవారం క్యాంపులకు బయల్దేరి వెళ్లనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ వారిని చేజారనీయకుండా ఉండేందు కు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఈ రోజు (శుక్రవారం) తరలించనున్నారు. వారిని మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్‌కు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రేంసాగర్‌రావుకు ఇక్కడ వారితో పరిచయాలు ఉన్న నేపథ్యంలో అటు వైపు తీసుకువెళ్లేందుకు సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించి కొందరు అనుచరులకు క్యాంపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. వారు కూడా 27న నేరు గా కౌంటింగ్‌ కేంద్రాలకు రానున్నారు.logo