గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jan 24, 2020 , 00:17:16

దివ్యాంగులను ఆదరించడం సామాజిక బాధ్యత

దివ్యాంగులను ఆదరించడం సామాజిక బాధ్యత
  • -కేంద్రంలో అన్ని వసతులు కల్పిస్తాం
  • -కలెక్టర్‌ భారతి హోళికేరి

లక్షెట్టిపేట : దివ్యాంగులను ఆదరించడం అందరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. గురువారం లక్షెట్టిపేటలోని దివ్యాంగుల కేంద్రాన్ని ఆమె సందర్శించారు. దివ్యాంగులు ధీరత్వంతో ముందుకు సాగాలనీ, ప్రతి ఒక్కరిలో ప్రత్యేక ప్రతిభాపాటవాలు దాగి ఉంటాయన్నారు. సమాజంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వం తరపున అన్ని అవకాశాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగులు ఎవరి కంటే తక్కువ కాదని ఆత్మాభిమానంతో ముందుకు సాగాలని సూచించారు. నేటి సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు దివ్యాంగులతో సుమారు రెండు గంటలకు పైగా వారితో మమేకయ్యారు. ఆ తర్వాత దివ్యాంగుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి, తన సొంత ఖర్చుతో వారికి యూనిఫాంలు అందజేశారు. సామర్థ్యాలను పెంపొందించేందుకే ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశామని కలెక్టర్‌ వివరించారు. ఆ తర్వాత దివ్యాంగులకు అందుతున్న సౌకర్యాలపై డీఆర్‌డీవో శేషాద్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది దివ్యాంగులు పాటలు పాడగా, మరికొంత మంది వివిధ ఆటలతో పాటు తమ కుటుంబ పరిస్థితులను సమక్షంలో కలెక్టర్‌కు వివరించారు. దివ్యాంగుల సంరక్షణ కేంద్రంలో టీవీ, ఫిజియోథెరపీ, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం దుర్శెట్టి సరోజిని అనే దివ్యాంగురాలి తల్లి తమ భూమి విషయంలో రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయగా వెంటనే పరిష్కరించాలని తాసిల్దార్‌ పుష్పలతను సమస్యను కలెక్టర్‌ ఆదేశించారు. ఆ తర్వాత ఎంఈవో కార్యాలయాన్ని సందర్శించారు. ఇక్కడ ఎంపీడీవో సత్యనారాయణ, ఐకేపీ ఏపీఎం లక్ష్మి, ఎంఈవో రవీందర్‌, ఆర్‌ఐ సంజీవ్‌, వీఆర్వో విజయ, సీసీ లచ్చన్నతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.logo