శుక్రవారం 05 జూన్ 2020
Mancherial - Jan 24, 2020 , 00:17:16

పెద్దపులులకు అనువుగా కవ్వాల్‌

పెద్దపులులకు అనువుగా కవ్వాల్‌
  • -ఆవాసానికి అన్ని ఏర్పాట్లు చేశాం
  • -ఎఫ్‌డీపీటీ వినోద్‌కుమార్‌
  • -జన్నారంలో టింబర్‌ డిపో కార్యాలయం ప్రారంభం

జన్నారం : అతి త్వరలో కవ్వాల్‌ అడవుల్లో పెద్దపులి ఆవాసం ఏర్పాటుచేసుకుంటుందని ఎఫ్‌డీపీటీ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం జన్నారంలోని ప్రభుత్వ టింబర్‌ డిపో ఆవరణలో కొత్తగా నిర్మించిన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇక్కడ ఎఫ్‌డీపీటీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తడోబా, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, తిప్పేశ్వర్‌ నుంచి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోకి పెద్దపులులు వచ్చి ఆవాసం ఏర్పాటుచేసుకుకొనేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఇక్కడి గిరిజన గ్రామాలను తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాయని తెలిపారు. ఈ మేరకు జన్నారం డివిజన్‌లో 320 హెక్టార్లలో గడ్డి క్షేత్రాలను విరివిగా పెంచామనీ, మొత్తం 830 హెక్టార్లలో గడ్డి క్షేత్రాలు ఏర్పాటుచేసి ఢిల్లీ అధికారుల ప్రశంసలు పొందినట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉన్న అన్ని టైగర్‌ రిజర్వుడు ప్రాంతాల కన్నా కవ్వాల్‌ ఫారెస్ట్‌లో చాలా అభివృద్ధి జరిగిందని తెలిపారు. అడవుల్లో సహజంగా లభించే తొమ్మిది రకాల గడ్డి విత్తనాలను 2 మెట్రిక్‌టన్నులు సేకరించి నిలువచేశామన్న ఆయన పులి ఉండేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇక్కడ డీఎఫ్‌వో శివాని డోగ్రే, ఎఫ్‌డీవో మాధవరావు, రేంజ్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రావు ఉన్నారు.


logo