ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jan 21, 2020 , 01:10:47

మున్సిపల్‌ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

మున్సిపల్‌ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి


చెన్నూర్‌, నమస్తే తెలంగాణ : ఎలాంటి లోటుపాట్లు లేకుండా మున్సిపాలిటీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. సోమవారం చెన్నూర్‌లోని ఎన్నికలను ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, బ్యాలెట్‌ బాక్సులను భద్రపర్చేందుకు ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. చెక్‌ లిస్ట్‌ ప్రకారం సామగ్రిని ముందుగానే పోలింగ్‌ కేంద్రాల వారీగా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్‌ సిబ్బంది వచ్చిన తర్వాత వారికి అప్పజెప్పేలా సామగ్రిని సిద్ధం చేయాలని తెలిపారు. పోలింగ్‌ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను ముందస్తుగా చేసుకోవాలని తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జాడి రాజేశ్వర్‌, జిల్లా సహాయ ఎన్నికల అధికారి బాపు, ప్రత్యేకాధికారి సంజీవరెడ్డి, ఎంపీడీఓ వేముల మల్లేశం పాల్గొన్నారు.

ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు..

మంచిర్యాల రూరల్‌ : ఎన్నికల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును 100శాతం వినియోగించుకొని ప్రశ్నించే హక్కును పొందాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని పురపాలక ఎన్నికలకు సంబంధించిన పోస్టర్లను అసిస్టెంట్‌ ట్రెయినీ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హత ఉండి ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కును కోల్పోతారని, ఓటుతో సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. పట్టణ ప్రగతికి మహిళల ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. డబ్బు, మద్యం, బహుమతులు, ఇతరత్రా ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీతో, పారదర్శకంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఏ కులానికో, మతానికో, వర్గానికో, ప్రాంతాని కో కాకుండా సమాజ హితానికి ఓటు వేయాలని కోరారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో 100 శాతం పోలింగ్‌ జరిగేలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ నరేందర్‌, డీపీఓ వీరబుచ్చయ్య, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శ్యామలాదేవితో పాటు సంబంధిత శాఖ ల అధికారులు పాల్గొన్నారు.

logo