గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Jan 19, 2020 , 00:47:24

గడప గడపకూ.. గులాబీ సైన్యం

గడప గడపకూ.. గులాబీ సైన్యం

 

ప్రచార పర్వంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్న కారు
 
- అభ్యర్థులతో కలిసి విప్‌, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్యాంపెయిన్‌ 
- టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అడుగడుగునా బ్రహ్మరథం
- అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ఇంటింటి ప్రచారం 
- కనిపించని ప్రతిపక్షాల అభ్యర్థులు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఒక దఫా ప్రచారం పూర్తి చేసిన టీఆర్‌ఎస్‌.. నాలుగు రోజులుగా రెండో దఫా ప్రచారంలో నేతలు, ద్వితీయశ్రేణి నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. రాజకీయ పార్టీ గుర్తులతో పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పార్టీల నేతలు కూడా తమ వారి గెలుపు కోసం గడప గడపకూ తిరుగుతూ తమ పార్టీ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. బీజేపీ  నుంచి కొన్ని చోట్ల దాఖలుకాలేదు. స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉంది. ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాల్క సుమన్‌, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేతకాని, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తనయుడు విజిత్‌రావు ప్రచారంలో మునిగి తేలుతున్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బ్రహ్మరథం

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ నాయకులకు ఘనస్వాగతం లభిస్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నిత్యం ప్రజలతో ఉంటూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించిన తీరును వివరిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలుపుతున్నారు. ఇవే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు పునాదులు కానున్నాయి. ఆసరా, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగుల ఉపాధి కల్పన కోసం పెద్ద ఎత్తున రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లల చదువుల కోసం నూతన గురుకులాల ఏర్పాటుతోపాటు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందిస్తున్నారు. ఇక మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదోడి గడపకు నేరుగా చేరుతున్నాయి. అందుకే తమకు అంత ఆదరణ లభిస్తోందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అందరి ఆదరణ లభిస్తుండటంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు సునాయం కానుంది.

ఎవరికి వారే యమునా తీరే..

ప్రతిపక్షాల విషయానికి వస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి దిక్కూ, మొక్కూ లేకుండా పోయింది. వరుసగా జరిగిన  ఎన్నిక ల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి అందరూ బయటికి వెళ్లిపోయారు. కనీసం ఒక్క ద్వితీయ శ్రేణి నాయకుడు కూడా ఆ పార్టీలో లేకుండా ఉన్న పరిస్థితి. ఇక ఉన్న ఒక్కరు ఇద్దరు నేతలకు కూడా పార్టీలో ఎలా సమన్వ యం చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలు, అధికారులను శాసించి చక్రం తిప్పిన నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌ రావు పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. ఆయనతో పాటు ఉన్న అనుచరవర్గం మొత్తం ఆయనను కాదని టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. దీంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఆయన భార్య, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సురేఖ మినహా వేరే ఎవరూ కనిపించడం లేదు. పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకుని చతికిల పడ్డ ఆయన ఇక ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లో కనీసం ప్రచారం కోసం బయటకు కూడా రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకో వచ్చు. అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థు లది మరో దారిగా తయారయ్యింది. ఏ ఎన్నికలు వచ్చినా జోరుగా దూసుకుపోయే కారును ఎవరూ అడ్డుకోలేరని పలువురు స్పష్టం చేస్తున్నారు.

జాబితా దగ్గర పెట్టుకుని..

మున్సిపాలిటీల్లో అధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో పార్టీల నేతలు కదులుతున్నారు. ఓటర్ల జాబితా దగ్గర పెట్టుకుని అందులో ఏ సామాజిక వర్గానికి ఎంత మంది ఉన్నారో లెక్కలు వేసుకుంటున్నారు. వర్గాలవారీగా ఓట్లు రాబట్టుకునేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. వారిని ఆకర్షించడానికి ఆ వర్గంలోని పెద్ద మనిషికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇటీవల వరుసగా జరిగిన ఎన్నికల సమయంలో ఏ పార్టీ మద్దతుదారులకు అధికంగా ఓట్లు వచ్చాయని ఆరా తీస్తున్నారు. అసంతృప్తి, అసమ్మతివాదులను పిలిచి బుజ్జగిస్తున్నారు. అధిక సీట్లు గెలిచిపించుకోవాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. ప్రలోభాల పర్వానికి తెర లేపుతున్నాయి. ఆయా వార్డుల్లో 40 నుంచి 60 శాతం వరకు ఓట్లు రాబట్టు కునేందుకు భారీగా తాయిలాలను సమర్పించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఎలాంటివి ఇస్తే ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతున్నారనే కోణంలో కసరత్తు చేస్తున్నాయి. మద్యాన్ని ఏరుల్లా పారిస్తున్నారు. ఉదయం ప్రచారం చేయడం.. రాత్రి పూట విందులు, వస్తువులు, నగదు వంటివి పంపిణీ చేస్తున్నారనే ప్రచారం ఉంది.