బుధవారం 03 జూన్ 2020
Mancherial - Jan 18, 2020 , 03:27:21

రికార్డు స్థాయిలో కొనుగోళ్లు

 రికార్డు స్థాయిలో కొనుగోళ్లు
  • - ఇప్పటికే లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాక
మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఈ ఏడాది ఖరీఫ్‌లో ఇప్పటికే లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం సివిల్‌ సప్లయ్‌ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు జరిగింది. గత ఖరీఫ్‌లో 67వేల 44మెట్రిక్‌ టన్నుల ధాన్యం వివిధ ఏజెన్సీల రాగా ఈ ఏడాది ఇప్పటికే లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు రైతులను ప్రోత్సహించడమే కాకుండా రైతులు పంట సాగు చేసుకునేందుకు ఏమాత్రం ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో 24 గంటల విద్యుత్‌ అందిస్తుండటంతో ఈ ఏడాది పూర్తి స్థాయిలో వ్యవసాయ రూపురేఖలు మారిపోయాయి.

ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తోపాటు గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందజేయడం ఒకటైతే మరోవైపు అన్నారం, సుందిల్ల బ్యారేజ్‌ల బ్యాక్‌ వాటర్‌తో పాటు చెరువుల్లో పూడికతీత వలన పంటల సాగుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పండాయి. దీనితో రైతన్న కళ్లలో ఆనందం విరిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరి ధాన్యం వరదలా వచ్చి చేరుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో మొదట వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డా ఆగస్టు నెల నుంచి మూడు నెలల పాటు ఏకదాటిగా వర్షాలు కురియడంతో రైతన్న ఆనందంగా సాగు చేశారు. నవంబర్‌ మొదటి వారం నుంచి వర్షాలు ఆగిపోవడంతో మొదలైన కొనుగోల్లు రెండు నెలలుగా జోరుగా సాగాయి. మరో వారం, పది రోజుల్లోపు పూర్తయ్యే అవకాశాలున్నాయి.

రెండింతలు పెరిగిన ధాన్యం..

ఏటేటా వరి సాగు పెరుగుతోంది. గతేడాది ఖరీఫ్‌ సీజన్‌తో పోల్చితే ఈ ఏడాది ధాన్యం రెండింతలయ్యే అవకాశం కనిపిస్తుంది. గత ఏడాది ఈ నెల 17వ తేదీ నాటికి 60,945.000 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా అదే ఈ ఏడాది ఇప్పటివరకు 1,02,487.560 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గత ఖరీఫ్‌లో మొత్తంగా 67,044.320 మెట్రిక్‌ టన్నులు రాగా ఈ ఏడాది లక్షా మెట్రిక్‌ టన్నులు దాటింది. 2016-17 ఖరీఫ్‌లో 6082 మంది రైతుల వద్ద 24 వేల 529.120 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, 2017-18లో 7802 మంది రైతుల వద్ద 32 వేల 254.600 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు ద్వారా కొనుగోలు చేశారు. 2018-19 ఖరీఫ్‌లో ఎవరూ ఊహించని విధంగా ఒక్క సారిగా అది కాస్త రెట్టింపు అయ్యింది. ప్రభుత్వం ఏకంగా 13,677 మంది రైతుల నుంచి 67 వేల 044.120 మెట్రిక్‌ టన్నుల ధాన్యం జిల్లాలోని నాలుగు ఏజెన్సీల ద్వారా సేకరించారు. గత ఏడాది ప్రభుత్వం మద్దతు ధర రూపేణా రైతులకు 117,70,36,924 రూపాయలు అందజేసింది. కాగా ఈ ఏడాది ఖరీఫ్‌లో లక్షా 20 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంఛనా వేయగా అంచనాల మేరకు ఇప్పటి వరకు లక్ష మెట్రిక్‌ టన్నులు దాటింది.

ఆకస్మిక తనిఖీలు, అనుక్షణం పర్యవేక్షణ..

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వై.సురేందర్‌రావు ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల అధికారి వీ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ గెడం గోపాల్‌, జిల్లా సహకార అధికారి బీ సంజీవ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శేషాద్రి, డీసీఎంఎస్‌ జిల్లా మేనేజర్‌ భోజన్న ప్రతిరోజు జిల్లాలోని 17 మండలాల్లోని 125 కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. రైతుల వివరాలు, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, గోనె సంచుల వివరాలు పరిశీలించడం, పీపీసీల ఇన్‌ఛార్జీలు ఎలాంటి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా! లేదా! పరిశీలిస్తూ వారికి పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. లారీల కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని మిల్లులన్ని ధాన్యంతో నిండుకోగా రాష్ట్రంలో ఎక్కడి మిల్లులో ధాన్యం రాలేదో పరిశీలించి ఉన్నతాధికారుల పర్మీషన్‌తో పక్క జిల్లాలైనా కొమురం భీం ఆసిఫాబాద్‌, మేడ్చల్‌, కరీంనగర్‌ జిల్లాలోని పలు మిల్లులకు ధాన్యం పంపిస్తున్నారు. అంతే కాకుండా అక్కడి మిల్లులకు వెళ్లి అన్‌లోడింగ్‌ పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు.

ప్రతి రైతు ధాన్యం కొంటాం

జిల్లాలోని ప్రతి రైతు వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేస్తాం. ఈ ఏడాది ఖరీఫ్‌లో అధిక మొత్తంలో ధాన్యం వస్తుందని వ్యవసాయాధికారులు అంఛనా వేయగా జేసీ సురేందర్‌ రావు సలహాల మేరకు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేశాం. గత ఏడాది ఖరీఫ్‌లో 67 వేల 44.240 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాగా అది ఈ ఏడాది రెట్టింపుగా వస్తుంది. ఏది ఏమైనా రైతులు పండించిన పంట ఆఖరు గింజ వరకు కొనుగోలు చేస్తాం. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డబ్బులు సైతం ప్రభుత్వం అదే స్థాయిలో రైతుల అకౌంట్లలో జమ చేస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవు. అనుక్షణం పర్యవేక్షిస్తున్నాం. సమస్యలు లేకుండా చూస్తున్నాం.
- వీ.వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారి, మంచిర్యాలlogo