బుధవారం 03 జూన్ 2020
Mancherial - Jan 14, 2020 , 01:05:21

భోగ భాగ్యాల భోగి

భోగ భాగ్యాల భోగి
  • - నేటి నుంచి ఊరూరా సంక్రాంతి సంబురాలు
  • - పిల్లాపాపలతో సందడిగా ఇళ్లు
  • - రంగవల్లులతో పూదోటలా లోగిళ్లు
  • - ఇంటింటా సకినాలు, గారెల కరకరలు


మంచిర్యాల రూరల్‌ : భూమిపుత్రుల పండుగ సంక్రాంతి రానే  వచ్చింది. నేడు భోగి, రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి‘కనుము’ను క న్నుల పండువగా జరుపుకు నేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది.

మూడు రోజుల పండుగ..

సంక్రాంతి మూడు రోజుల వేడుక. మొదటి రోజు భోగి. రెండో రోజు సంక్రాంతి. మూడోరో జు కనుము. సూర్యుడి గమనానికి అనుగుణంగా జరుపుకునే పండుగే సంక్రాంతి. హిందువుల ప్రతి పండుగలోనూ, చేసే పూజలోనూ ఏదో ఒక ఆంతర్యం దాగి ఉంటుంది. దక్షిణాయణం చివరి రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. దీంతో సూర్యరశ్మి సరిగ్గా ఉండక, క్రి మి కీటకాలు ప్రబలుతాయి. ఈ క్రమంలోనే గ్రా మీణ ప్రాంత మహిళలు పెండతో ఇళ్లను అలికి, సున్నపు పిండితో ముగ్గులు వేస్తారు. వీటి ప్రభావంతో వ్యాధికారక క్రిమికీటకాలు నశిస్తాయి. ముగ్గుల మీద పెండ ముద్దలుంచి, వాటికి పసుపు కుంకుమలు పెట్టి వివిధ పూలతో అలంకరిస్తారు. ఇవే గొబ్బెమ్మలు. హరిదాసుల హరినామస్మరణ, గంగిరెద్దుల విన్యాసాలు, వైష్ణవాలయాల్లో విష్ణు సహస్ర నామ పారాయణాలు వినిపిస్తాయి. భోగి రోజు గోదాదేవి కల్యాణాన్ని కమనీయంగా జరుపుకుంటారు. మకర సంక్రాంతి పిండివంటలు చేసి, కడుపునిండా భుజిస్తారు. కనుమ రోజు మి నుములతో గారెలు వండి, పెద్దలకు నైవేద్యం పెట్టడంతోపాటు పశువులను పూజిస్తారు.

భోగభాగ్యాల భోగి ..

దక్షిణాయణం దేవతలు నిద్రించే కాలంగా చె ప్పుకుంటారు. దీంతో సంక్రాంతికి ఒక రోజు ముందు పీడ నివారణ కోసం వీధుల్లో భోగిమంటలు వేసి, ఇంట్లోని పాత వస్తువులను ఆ హుతి చేస్తారు. మరుసటి రోజు నుంచి కొత్త వ స్తువులు ఉపయోగించడం ఆనవాయితీ. భోగి రోజున తెల్లవారుజామున పిల్లలకు తలస్నానం చేయించి రేగుపండ్లు, చెరుకు ముక్కలు, అక్షింతలు కలిపి వారి తలలపై పోయడం ద్వారా దృష్టి దోషం తొలగిపోతుందని పెద్దలు నమ్ముతారు. పెద్దల చేత భోగిపండ్లను పోయించడం వల్ల చిన్నారుల ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి. భోగి రోజే గోదాదేవి రంగనాథస్వామిని వివాహమాడిందని చెబుతారు. అప్పటి నుంచే ఆమె భోగ భాగ్యాలు పొందిందని ప్రతీతి. భోగి రోజున మ హిళలు వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నిం పి, వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడుతారు. వాటిపై గరక పోసలు ఉంచి, చు ట్టూ నవధాన్యాలు, పళ్లు పోస్తారు. ఇలా చేయడం తో లక్ష్మీదేవి ఇళ్లలోకి వస్తుందని నమ్ముతారు.

మకర సంక్రాంతి..

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు. ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు తిరుగుతాడు. దీనినే ఉత్తరాయణంగా చెబుతారు. ఇది మహా పుణ్యకాలం. ఏ శుభకార్యానికైనా మంచిదని హిందువులు న మ్ముతారు. అందుకే సంక్రాంతి మహ త్తరమైన పండుగ అని పురాణాలు ప్రవచిస్తున్నాయి. సం క్రాంతిన పితృదేవతలకు తర్పణం విడుస్తారు. బ్రాహ్మణులకు బియ్యం, బెల్లం గుమ్మడికాయ దానం చేస్తారు. కొత్త బియ్యం, బెల్లంతో పాయ సం చేసి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యంగా పెడుతారు. మహిళలు ముగ్గులు వేయడం, పిండి వంటలు చే యడంలో నిమగ్నులవుతే, చిన్నారులు పతంగు లు ఎగురవేస్తారు.

రైతుల పండుగ కనుము..

భోగి, సంక్రాంతి తర్వాత రోజు జరుపుకునే పం డుగ కనుము. ‘కనుము’ అంటే పశువు అని అ ర్థం. కనుము పండుగను రైతులు ఘనంగా జరుపుకుంటారు. పశువులను అలంకరించి గో ప్ర దక్షిణం చేస్తారు. ఆ రకంగా వాటి రుణం తీర్చుకున్నట్లు భావిస్తారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడుతారు. ఎడ్లబండ్లతో ఆలయాల చుట్టూ ప్రద క్షిణలు చేయిస్తారు.

మార్కెట్లో సందడి..

ఈ మూడు రోజుల పాటు ప్రతి ఇంటి లోగిలీ ము త్యాల ముగ్గులతో కళకళలాడనుండగా, మార్కెట్లో రంగుల విక్రయాలు ఊపందుకున్నాయి. గొబ్బెమ్మల తయారీకి వాడే ఆవుపేడ, రేగు పండ్లు, బంతి పూలు, గరక పోచలు, మామిడి ఆకులను గ్రామీణులు తెచ్చి, అమ్ముతున్నారు. దీంతో  జి ల్లాకేంద్రం సహా అన్ని మండల కేంద్రాల్లో మార్కె ట్లు వినియోగదారులతో కిటకిటలాడాయి.

ముత్యాల ముగ్గులు..

మహిళలు, యువతులు పొద్దున్నే లేచి అలుకు జ ల్లి, రంగురంగుల ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మ లు పెట్టి, పూలు, పండ్లు, నవధాన్యాలతో పూజిస్తారు. గొబ్బెమ్మలో వాడే గరిక, తెల్లపిండి, ఆవు పేడ వల్ల ఒక రసాయనిక ప్రక్రియ జరిగి ఆరోగ్యానికి మేలు చేసే ఒకరకమైన వాయువు వెలువడుతుందని శా స్ర్తాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ సమయంలో అలంకరణ ఉన్న ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని హిందువులు న మ్ముతారు. శివుడి నంది స్వరూపాలుగా భావించే గంగిరెద్దులు ఇంటి ఆవరణలో ప్రవేశించడం శుభ సూచకంగా భావిస్తా రు. హరిదాసును విష్ణుస్వరూపంగా భావించి ధా న్యాన్ని దానంగా సమర్పిస్తా రు. హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసా లు చిన్నా పెద్దలను ఆకట్టుకుంటాయి.

ఆలయాలు కిటకిట..

సంక్రాంతి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలను సందర్శించి, పూజలు చేస్తారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. కొన్ని ప్రాంతా ల్లో జాతరలు కూడా జరుపుకుంటారు. రైతులు పశువులను శుభ్రంగా కడిగి, ఎద్దుల బండ్లను అలంకరించి, ఇంటిల్లిపాదితో కలిసి జాతరకు, ఆలయాలకు వెళ్తారు.

పతంగుల పోటీలు..

సంక్రాంతికి పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తున్నది. పిల్లలకు పాఠశాలలకు సెలవులు కావడంతో పండుగకు రెండు రోజుల ముం దు నుంచే గాలిపటాలు ఎగురవేస్తూ సరదా తీర్చుకుంటారు. వీరి అభిరుచికి అనుగుణంగా విక్రయదారులు కాన్పూర్‌, న్యూఢిల్లీ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి విభిన్నరితీలో ఉన్న పతంగులను దిగుమతి చేసి విక్రయిస్తున్నారు. పలుచో ట్ల పతంగుల పోటీలు కూడా నిర్వహిస్తారు.

కరకరలాడే సకినాలు..

జిల్లావాసులు ఈ నెల మొదటి వారం నుంచే సకినాల తయారీలో నిమగ్నమయ్యారు. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఇవంటే ఎంతో ఇష్టపడుతారు. వీటికి తోడు సంక్రాంతి పండుగకు గారెలు, అరిసెలు, మురుకులు, కారప్పూస కూ డా చేసుకుంటారు. వీటిని తమ బంధువులకు, మిత్రులకు పంపించి ఆత్మీయతను చాటుతారు.logo