సోమవారం 26 అక్టోబర్ 2020
Mancherial - Jan 13, 2020 , 02:17:08

అభ్యర్థులూ.. జరపైలం! నిఘానేత్రాలుంటాయ్‌ జాగ్రత్త..

అభ్యర్థులూ.. జరపైలం! నిఘానేత్రాలుంటాయ్‌ జాగ్రత్త..


మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అభ్యర్థులు పాటించాల్సినవి పోటీలో ఉన్న అభ్యర్థులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం, దూషించడం చేయవద్దు. అభ్యర్థులు తాము ముద్రించే కరపత్రాలు, గోడ పత్రాలు, బ్యానర్లపై ప్రచురణ కర్తపేరు, చిరునామా తప్పనిసరిగా ఉంచాలి.జాతి, కులం, మతం పేరుతో ఓట్లను అభ్యర్థించడం నేరం. ప్రార్థనా మందిరాలను వేదికగా చేసుకొని ప్రచారం చేయవద్దు. ఉదయం ఆరు నుంచి రాత్రి 10 గంటల లోపే లౌడ్‌ స్పీకర్‌ వినియోగించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ప్రచారం చేయాలి. ప్రలోభాల రవాణాకు ‘చెక్‌పోస్ట్‌' ఎన్నికల వేళల్లో ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లకు పంచేం దుకు తీసుకొచ్చే  కానుకలు, మద్యం, డబ్బులను సరిహద్దు లోనే తనిఖీచేసే విధంగా సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నది.

నిఘా.. నిఘా..

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లును ప్రలోభాలకు గురిచేయకుండా ధన ప్రవాహం ఉపయోగించి విజయం సాధించే విధంగా నాయకులు కుటిల యత్నాలు చేస్తే వారిపై ఫిర్యాదు చేయవచ్చు. ఓటర్లకు కానుకలు, మద్యం, డబ్బుల పంపిణీని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసిన బృందాలు నిరంతరం పనిచేస్తాయి. ఎలక్షన్లను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పెంచి, పోటీ చేసే అభ్యర్థుల కదలికలను, అభ్యర్థులు చేసే ఖర్చు, ప్రచార సరళి, తదితర అంశాలను పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్‌ పలు రకాల బృందాలతో నిరంతరం నిఘా పెట్టింది.

వీడియో చిత్రీకరణ

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సమయంలో అభ్యర్థులు మద్యం, డబ్బులు, కానుకలు పంపిణీ చేయడం, అక్రమాలకు పాల్పడడం లాంటి చర్యలను ఎన్నికల అధికారులు ఎప్పటికప్పడు వీడియో చిత్రీకరణ చేస్తారు. పోలింగ్‌ రోజున శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన, పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన ప్రాంతాల్లో వీడియో రికార్డింగ్‌ చేయనున్నారు. వాటిని విశ్లేషించిన ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటారు.

ఫ్లయింగ్‌ స్కాడ్‌

ఈ బృందం ఎన్నికల అధికారులు సంచార తనఖీలు నిర్వహిస్తారు. వార్డు పరిధిలో సభలు, సమావేశాలు, ర్యాలీలలో నిబంధనలను అతిక్రమించినప్పుడు ఫిర్యాదు చేస్తే బృందం సభ్యులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారు. అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంపిణీ, మద్యం అందిస్తున్నట్లు పక్కా సమాచారం ఉంటే వీరికి ఫోన్‌ చేస్తే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటారు. ప్రచారంలో ఓటర్లపై దౌర్జన్యానికి పాల్పడితే వెంటనే వీరికి సమాచారం అందిస్తే అప్రమత్తమై ఫిర్యాదుదారు ప్రదేశానికి చేరుకుంటారు. వీటిపై తగు చర్యలు తీసుకుంటారు.

ఖర్చులపై పరిశీలన

 అభ్యర్థులు చేసే ఖర్చు వివరాలు లెక్కించడం, వివరాలు నమోదు చేసుకొనేందుకు వ్యయ పరిశీలన బృందం పనిచేస్తుంది. పరిమితికి మించి ఖర్చు చేసిన అభ్యర్థి పూర్తివివరాలపై నిఘా పెడుతుంది. వివిధ పత్రికల్లో, ప్రైవేటు ఛానళ్లపై వచ్చిన అభ్యర్థుల ప్రచారం, ప్రకటనల ఖర్చులపై ఆరా తీస్తుంది.

ఆధారాల పరిశీలన బృందం

ఎన్నికల ప్రచారంలో చిత్రీకరించిన వీడియోల ఆధారాలను పరిశీలించి (వీడియో సర్వేలింగ్‌) సంఘటనకు సంబంధించిన వివరాలను అంచనా వేస్తారు. ఎన్నికల సంఘం పరిమితులు, పరిధులు దాటినట్లు తేలితే ఉన్నతాధికారులకు నివేదిస్తారు.

అధికారులు ఆన్‌ డ్యూటీ..

మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులను  ఎన్నికల కమిషన్‌ నియమించింది.

జిల్లా ఎన్నికల అధికారి

జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలలో ఎన్నికలు సజావుగా జరిగేలా పర్యవేక్షిస్తారు. ఎన్నికలను నిర్వహించడంతో కలెక్టర్‌ పాత్ర క్రియాశీలకం. సాధారణ ఎన్నికల మాదిరిగానే పురపాలక ఎన్నికలను చేపడుతారు. నోడల్‌ అధికారులు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు కమిటీల నియామకం కలెక్టర్‌ పర్యవేక్షణలో జరుగుతాయి.

జిల్లా అదనపు ఎన్నికల అధికారి
జిల్లా సంయుక్త కలెక్టర్‌ జిల్లా అదనపు ఎన్నిక ల అధికారిగా వ్య వహరిస్తారు. ఎన్నికల సంఘం అదేశాల మేరకు జిల్లా ఎన్ని కల అధికారి అప్ప గించిన బాధ్యతలను నిర్వర్తిస్తారు.

ఉప ఎన్నికల అధికారి

జిల్లా ఉప ఎన్నికల అధికారులుగా ఆర్డీవోలు పర్యవేక్షిస్తారు. ఆర్డీవోలు లేని మున్సిపాలిటీల్లో జడ్పీ కార్యనిర్వహక అధికారి (సీఈవో)ను నియమించడానికి వీలుంది. ఎన్నికల్లో తిరస్కరించిన నామినేషన్లపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఉప ఎన్నికల అధికారికి అప్పీల్‌ చేసుకుంటే విచారణ జరిపించి పరిష్కరిస్తారు.

సహాయ ఎన్నికల అధికారులు

ఎన్నికలు జరిగే చోట పురపాలక కమిషనర్లు సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు. ఎన్నికల నిర్వహణలో వీరి పాత్ర కీలకం. తమ పరిధిలోని ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్ల బాధ్యత వీరిపై ఉంటుంది. ఓటర్ల జాబితా, వార్డులు విభజన, కులాల వారీ గా ఓటర్ల జాబితా తయారీతో పాటు ముసాయిదా తుది జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరిస్తారు. పోలింగ్‌ కేంద్రాల  ఎంపిక, సౌకర్యాల కల్పనను పర్యవేక్షిస్తారు. సిబ్బందికి శి క్షణ, సామగ్రి పంపిణీ రిసెప్షన్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూంల ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

నోడల్‌ అధికారులు

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు విభాగాల వా రీగా జిల్లాస్థాయి అధికారులను నోడల్‌ అధికారులుగా జిల్లా ఎన్నికల అధికారి నియమిస్తారు. వీరు సిబ్బంది శిక్షణ, సౌకర్యాల కల్పన, మానవ వనరుల సమీకరణ, ఎన్నికల నిర్వహణకు  కావాల్సిన ఏర్పాట్లకు విభాగాల వారిగా అధికారులను నియమిస్తారు. లోటు పాట్లు జరుగకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది.


logo