శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Jan 13, 2020 , 02:15:46

‘పల్లె ప్రగతి’తో గ్రామాల వికాసం

‘పల్లె ప్రగతి’తో గ్రామాల వికాసం


మంచిర్యాల రూరల్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాలు వికసిస్తున్నాయని హాజీపూర్‌ మండలంలోని గ్రామాల సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు పేర్కొన్నారు. జనవరి 2వ తేదీ నుంచి చేపట్టిన రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీల్లో సభలను ఏర్పాటు చేసి గ్రామంలో నిర్వహించిన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇంకా గ్రామంలో చేయాల్సిన పనులపై సైతం చర్చించారు. గ్రామాలలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామాలు(శ్మశానవాటిక), డంపింగ్‌ యార్డులు, ఇంకుండు గుంతలు, వర్మి కంపోస్టు షెడ్ల నిర్మాణ పనులను మండల అభివృద్ధి అధికారి అబ్దుల్‌ హై పరిశీలించారు. పల్లె ప్రగతి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలనీ, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామ ప్రత్యేక అధికారులను, కో-ఆప్షన్‌ సభ్యులను, శానిటేషన్‌ వర్కర్లను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కో-ఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గడ్‌పూర్‌లో స్వచ్ఛభారత్‌..
హాజీపూర్‌ మండలం గడ్‌పూర్‌లో తెలంగాణ పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఆదివారం అధికారులు, నాయకులు స్వచ్ఛ భారత్‌ నిర్వహించారు. గ్రామ పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌ రాజ్‌ మహ్మద్‌ ఆధ్వర్యంలో గ్రామ ప్రధాన రోడ్లను ఊడ్చి చెత్తను పారబోశారు. ప్రధాన వీధుల గుండా తిరిగి మురుగు కాలువలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అహ్మద్‌ హై, సర్పంచ్‌ వేదుల లక్ష్మీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌ వాడీ టీచర్‌, ఆశా కార్యకర్త, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
====================================