బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Jan 13, 2020 , 02:14:49

ఎన్నిక ఏకపక్షమే..

ఎన్నిక ఏకపక్షమే..


- కారులోనే ప్రయాణించడానికే అందరి మొగ్గు..


మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) ముందు ఏ పార్టీ నిలువలేకపోతున్నది. ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్యే, పంచాయతీ, పరిషత్‌, ఎంపీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌పై ప్రజలు మొగ్గు చూపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా అదే తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌పై ప్రజలకు పెరిగిన నమ్మకం, సీఎం కేసీఆర్‌ వ్యక్తిత్వం, జనాకర్షణ  గులాబీ పార్టీకి పట్టం కట్టడానికి కలిసొచ్చే అంశాలు. టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ వస్తే చాలు వార్డు కౌన్సిలర్‌గా గెలిచినట్లే అని ధీమాతో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీల్లో 150 వార్డుల్లో కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే దాదాపు 500 మంది వరకు నామినేషన్లు వేశారు. తమకు టిక్కెట్‌ వస్తే గెలుస్తామనే ఆశతో వీరంతా టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తక్కువలో తక్కువగా ఒక వార్డు నుంచి ముగ్గురు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. కొన్ని వార్డుల్లో పది మంది వరకు పోటీ పడుతున్నారంటే అతిశయోక్తి కాదు.

ఎమ్మెల్యేల పనితీరుతో.. 

గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగించింది. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్య, చెన్నూరు ఎమ్మెల్యేగా బాల్క సుమన్‌, మంచిర్యాల ఎమ్మెల్యేగా నడిపెల్లి దివాకర్‌రావు విజయం సాధించిన విషయం తెలిసిందే. వారు ఎన్నికల్లో గెలిచింది మొదలు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వారు అక్కడికి వెళ్లి దాని గురించి ఆరా తీసి ప్రజల సమస్యలు దూరం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు దగ్గర చేస్తున్నారు. అవి అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గతంలో ఉన్న అవినీతి స్థానంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు సరైన న్యాయం జరుగుతోంది. దీంతో ప్రజలు గతంలో ఎప్పుడూ లేని విధంగా సంతోషంగా ఉన్నారు. అదే అన్ని ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని చెబుతున్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు పలువురి ఆసక్తి

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు వివిధ పార్టీల నేతలు దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే, ఎన్నికల వేళ పార్టీలోకి వెళ్లి టికెట్‌ వస్తుందో? రాదో? అనే అనుమానంతో కొందరు ఊగిసలాట ధోరణితో ఉన్నారు. టికెట్‌ రాకున్నా తాము టీఆర్‌ఎస్‌ చేరడం ఖామయని ఘంటాపథంగా చెబుతున్నారు. భవిష్యత్‌లో రాజకీయ పదవులు పొందవచ్చనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దాదాపుగా ఖరారు అయ్యారు. నామినేషన్‌ వేసిన అభ్యర్థులు తమ తమ బీ-ఫారాలను ఎన్నికల అధికారులకు ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల్లోగా అందించాలి. అలా అందిస్తేనే ఆ పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల అధికారులు భావించి గుర్తులు కేటాయిస్తారు. అభ్యర్థులకు ఇవ్వాల్సిన బీ-ఫారాలను ఎమ్మెల్యేలు తమ వద్దనే ఉంచుకున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాత్రం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా బీ-ఫారాలు కూడా అందించారు.

పొత్తుల కోసం పాకులాట

టీఆర్‌ఎస్‌ను సొంతంగా ఎదుర్కోలేక విపక్ష పార్టీలు ఏకం కావడానికి చర్చలు జరుపుతున్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్‌, బీజేపీ ఒకే అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు అక్రమ పొత్తుకు తెర లేపారు. అంతిమ విజయం టీఆర్‌ఎస్‌దే అని తెలిసినా విపక్షాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు ఇప్పటికే చీకటి ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ తమ ఉనికి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాము గెలిచేందుకు ఏం చేయడానికైనా సిద్ధమే అన్న చందంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే, ఎన్ని కూటములు, ఎన్ని పార్టీలు కలిసినా ప్రజలు అంతిమంగా కారులోనే ప్రయాణించాలని చూస్తున్నట్లు సమాచారం.


logo