శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Jan 10, 2020 , 12:01:59

అంతు తేల్చేవరకు వదిలిపెట్టరు

అంతు తేల్చేవరకు వదిలిపెట్టరు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అక్రమ నిర్మాణాలకు ఉచ్చు బిగించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. తప్పించుకునే అవకాశం లేకుండా ఆన్‌లైన్ ద్వారా నోటీసులు జారీ చేసే కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసి క్షేత్రస్థాయి అధికారులందరికీ తగిన ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల జీహెచ్‌ఎంసీకి అందిన ఫిర్యాదులపై అధికారులదే జవాబుదారీ. అంతేకాదు, ఫిర్యాదుదారు మొబైల్ ఫోన్‌కు ఎప్పటికప్పుడు దాని పురోగతి వివరాలు మెసేజ్ రూపంలో పంపిస్తారు.

అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇంతకాలం మ్యాన్యువల్ పద్ధతిలోనే నోటీసుల ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై ఎటువంటి పురోగతి ఉంటుందో ఎవరికీ తెలిసే పరిస్థితి లేదు. చాలా సందర్భాల్లో క్షేత్రస్థాయి అధికారులు మాముళ్లు దండుకొని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. ఫిర్యాదుదారులు ఎంతకాలం ఆఫీసు చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదు. న్యాయస్థానం నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకొని కొందరు, ఎటువంటి ఆర్డర్లు లేకుండానే మరికొందరు అక్రమ నిర్మాణాలను యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఫిర్యాదులు, వాటిపై చేపట్టే చర్యలు అన్నీ మ్యాన్యువల్ పద్ధతిలోనే ఉండడంతో ఎవరికీ జవాబుదారీ ఉండడం లేదు. ఫలితంగా జీహెచ్‌ఎంసీకి అక్రమ నిర్మాణాల ఫిర్యాదులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. బల్దియాకు సంబంధించి న్యాయస్థానంలో దాఖలవుతున్న కేసుల్లో సింహభాగం ఇవే ఉంటున్నాయి. చాలా సందర్భాల్లో కమిషనర్‌కు సైతం కంటెమ్ట్ నోటీసులు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరిగిన వ్యవహారంపై ఎటువంటి అవగాహన లేకపోయినా కోర్టు ముందు కమిషనర్ దోషిగా నిలువాల్సిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ తాజాగా అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ఆన్‌లైన్ ద్వారానే నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు.

ఫిర్యాదు వచ్చిన దగ్గర్నుంచి దాని పరిష్కారం వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగే విధంగా పకడ్బందీ విధానాన్ని చేపట్టారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు ఈ-ఆఫీసు ద్వారా సంబంధిత సహాయ నగర ప్రణాళికాధికారికి వెళ్తుంది. నిర్ణీత గడువులోగా అతను తనిఖీ నిర్వహించి వాటి ఫొటోలు తీసుకొని నిర్మాణదారులకు ఆన్‌లైన్ ద్వారానే నోటీసులు జారీ చేస్తారు. దానిపై నిర్మాణదారు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకుంటే రెండో నోటీసు జారీ చేస్తారు. అనంతరం కూల్చివేతలు చేపడుతారు. ఈలోగా అతను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, వచ్చిన ఫిర్యాదు, దానిపై తాము జారీ చేసిన నోటీసుల వివరాలను న్యాయస్థానానికి సమర్పిస్తారు. దీనివల్ల అక్రమ నిర్మాణదారులు అంత తేలిగ్గా స్టే ఆర్డర్ పొందే అవకాశం ఉండదు. అంతేకాదు, ఫిర్యాదుదారు మొబైల్‌కు ఎప్పటికప్పుడు దాని పురోగతి వివరాలు పంపిస్తారు. ఫిర్యాదుదారు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. నోటీసుల ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో నమోదవుతుంది కాబట్టి సంబంధిత అధికారి జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉంటుంది.

తాజావార్తలు