e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home ఆదిలాబాద్ ఆయిల్‌ పామ్‌కు సబ్సిడి సాయం

ఆయిల్‌ పామ్‌కు సబ్సిడి సాయం

ఆయిల్‌ పామ్‌కు సబ్సిడి సాయం

మూడేండ్ల పాటు పెట్టుబడి ప్రోత్సాహకం
ఎకరాకు రూ.36 వేల చొప్పున అందజేత
పలు శాఖలకు నర్సరీల పెంపు బాధ్యత
అంతర పంటలతో అదనపు ఆదాయం
15 మండలాల్లో అనువైన వాతావరణం
మంచిర్యాల జిల్లాలో పెరుగనున్న తోటల పెంపకం

మంచిర్యాల, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్నది. పంట నాలుగేండ్లలో చేతికి రానున్న నేపథ్యంలో రైతులకు పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీ అందజేయాలని నిశ్చయించింది. ఎకరాకు మొదటి సంవత్సరం రూ.26 వేలు, ఆ తర్వాత రెండు, మూడు సంవత్సరాల్లో రూ.5 వేల చొప్పున సబ్సిడీ ఇవ్వాలని తీర్మానించింది. దీంతో మున్ముందు మంచిర్యాల జిల్లాలో సాగు భారీగా పెరగనుండగా, ఆ పంట వేసే రైతన్నలకు మంచి లాభాలు వచ్చే అవకాశమున్నది.

ఆయిల్‌ పామ్‌ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. సాగులో పలు ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. పంట సాగు విధానం గురించి తెలుసుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కోస్టారికా, మలేషియా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియాలో పర్యటించాలని ఆదేశించింది. దీంతో జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు భారీగా పెరిగే అవకాశం ఉంది. సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని, మూడేండ్లలో రూ.36 వేల ప్రోత్సాహకాన్ని అందించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ పంట ఒకసారి పెట్టుబడితో 30 ఏండ్ల పాటు ఆదాయం రానుండడంతో అన్నదాతలు ప్రస్తుతం ఆయిల్‌ పామ్‌ సాగువైపు ఆకర్షితులవుతున్నారు. ఆయిల్‌ పామ్‌ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. దీనికి అనుబంధంగా ఆయా జిల్లాల్లో కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. మొక్కల పెంపకానికి అటవీశాఖ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయంతో ఆయిల్‌ పామ్‌ మొక్కల నర్సరీని పెంచాలని తెలిపింది. మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా ప్రభుత్వ ప్రోత్సాహం, విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ సతీశ్‌ కుమార్‌ ప్రోద్బలంతో పలువురు రైతులు ఆయిల్‌ పామ్‌ సాగుబాట పట్టారు. అంతరపంటగా కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.

- Advertisement -

15 మండలాల్లో అనువైన వాతావరణం..
జిల్లాలో ఆయిల్‌ పామ్‌ తోటలకు 15 మండలాల్లో అనువైన వాతావరణం ఉందని కేంద్ర సంస్థల సర్వే అధికారులు స్పష్టంచేశారు. 2020-21 సంవత్సరానికి గాను పైలెట్‌ ప్రాజెక్టు కింద చెన్నూర్‌ నియోజకవర్గం క్షేత్రానికి 400 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు గాను 407.32 ఎకరాలకు 152 మంది ఆయిల్‌ పామ్‌ రైతులను గుర్తించి కలెక్టర్‌తో పరిపాలన అనుమతి తీసుకున్నారు. భీమారం మండలంలోని అంకూసాపూర్‌, కొత్తపల్లి, మద్దికల్‌, చెన్నూర్‌ మండలకేంద్రంతో పాటు మండలంలోని అక్కెపల్లి, బీరవెల్లి, చాకెపల్లి, ఎల్లక్కపేట, కత్తెరశాల, కొమ్మెర, కోనంపేట, పొక్కూర్‌, సుందరశాలలో ఆయిల్‌ పామ్‌ తోటలను పెంచుతున్నారు. వీటితో పాటు జైపూర్‌ మండలంలోని ఎల్కంటి, ఇందారం, కిష్టాపూర్‌, కుందారం, పౌనూర్‌, రామారావుపేట, రొమ్మిపూర్‌, టేకుమట్ల, కోటపల్లి మండలకేంద్రంతోపాటు మండలంలోని అర్జునగుట్ట, కొండంపేట, లింగంపేట్‌, రాంపూర్‌, సర్వాయిపేట్‌, శంకరాపూర్‌, సిర్సా, మందమర్రి మండలంలోని అందుగుల పేట, చిర్రకుంట, లేమూర్‌, పొన్నారం, సారంగపల్లి, తిమ్మాపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల్లో రైతులు తోటలను పెంచుతున్నారు. దిగుమతులను తగ్గించేందుకు, దేశంలోనే పంటను అధికంగా సాగుచేసేందుకు ఆయిల్‌ పామ్‌ను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుకు ఎకరంలో సాగుకు రూ.62,340 ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వమే రూ.30 వేలు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించడంతో రైతు కేవలం రూ.32,340 ఖర్చు చేస్తే సరిపోతుంది. ఈ మొత్తాన్ని కూడా బ్యాంకుల ద్వారా రుణాలు అందించనుంది. ఈ రుణాలను కూడా ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా నాలుగేండ్ల పాటు మారిటోరియం విధించేలా బ్యాంకులను ఒప్పించింది. ఈ పంట ఒకసారి వేస్తే 30 ఏండ్లు ఆదాయం వస్తుంది. నాలుగేండ్లలోనూ అంతరపంటలు వేసుకోవడంతో లాభం చేకూరుతుంది. డ్రిప్‌ సిస్టంతో నీరు ఆదా అవుతుంది. పెట్టుబడి, ఇతర ఖర్చులు పోనూ రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది.

మ్యాట్రిక్స్‌.. మానిటరింగ్‌..
ఆయిల్‌ పామ్‌ తోటలను జిల్లాలో మ్యాట్రిక్స్‌ కంపెనీ పర్యవేక్షిస్తున్నది. ప్రభుత్వ సబ్సిడీ, ప్రోత్సాహకాలు, ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనలు యథావిధిగా అందుతున్నాయి. మ్యాట్రిక్స్‌ కంపెనీ ద్వారా రైతులకు ఆయిల్‌ పామ్‌ మొక్కలు సరఫరా చేసేందుకు భీమారం మండలంలో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు, సదరు నర్సరీలో పెంచుతున్నట్లు ఆ సంస్థ జిల్లా ప్రతినిధి ఉదయ్‌కుమార్‌ తెలిపారు. కోస్టారికాతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఆయిల్‌ పామ్‌ మొలకలు తెప్పించి, త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. రైతులకు మేలు చేకూర్చేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, వారికి లాభం చేకూర్చేందుకే వివిధ దేశాల నుంచి మొలకలు దిగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు. మొక్కలు పెరిగి పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎక్కడికీ తీసుకెళ్లాల్సిన అవసరంలేకుండా, త్వరలోనే చెన్నూర్‌ నియోజకవర్గంలో కంపెనీ ఏర్పాటు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఆయిల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

డిమాండ్‌ ఉన్న పంట వేసి లాభాలు పొందాలి..
రైతులు కూడా మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటవేసి లాభాలు పొందాలి. వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్‌ సాగు చేయడంతో రైతుకు అధికంగా లాభం చేకూరుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఆయిల్‌ పామ్‌ సాగుతో అన్ని ఖర్చులూ పోను ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం మిగులుతుంది. మొక్కల మధ్య అంతరపంటలు కూడా సాగు చేసుకోవడం వల్ల మరింత లాభం వస్తుంది. పామాయిల్‌ దిగుబడి కంటే ముందే అంతరపంటలతో పెట్టుబడి వెళ్లిపోతుంది. ఒకసారి పెట్టుబడి పెడితే 30 ఏండ్ల పాటు రాబడి వస్తుంది. భారీగా ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తున్నది. సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలి.
-బాల్క సుమన్‌, ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆయిల్‌ పామ్‌కు సబ్సిడి సాయం
ఆయిల్‌ పామ్‌కు సబ్సిడి సాయం
ఆయిల్‌ పామ్‌కు సబ్సిడి సాయం

ట్రెండింగ్‌

Advertisement