e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు యోగా చేద్దాం.. కరోనాను జయిద్దాం

యోగా చేద్దాం.. కరోనాను జయిద్దాం

యోగా చేద్దాం.. కరోనాను జయిద్దాం

కరోనా వైరస్‌ నుంచి విముక్తి
శారీరక, మానసిక సమస్యలూ దూరం
ఆసనాలు, ప్రాణాయామం చేయాలంటున్న నిపుణులు
క్రమశిక్షణతో కూడిన జీవనవిధానమూ ముఖ్యమే

మహబూబ్‌నగర్‌ డెస్క్‌, మే 9 : ఇప్పుడున్నది కరోనా కాలం.. ముప్పేట వైరస్‌ దాడి. అంతుచిక్కని శత్రువు ఎటు నుంచి ఎలా వ్యాప్తి చెందుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో డాక్టర్లు, మందుల మీద ఆధారపడడం కంటే మన రక్షణ కోసం మనం ఏం చేస్తున్నామనే ఆలోచన రావాలి. దీనిని అధిగమించాలంటే ముందు నుంచే యోగా సాధనను అలవాటు చేసుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక్కటే మార్గమని పెద్దలు, పూర్వీకులు చెబుతున్నారు. కరోనా వంటి ప్రాణాంతకమైన మహమ్మారి ముప్పు నుంచి సురక్షితంగా ఉండాలంటే మన శరీరం బలంగా తయారవ్వాలి. శారీరకంగా, మానసికంగా సంసిద్ధమై ఉండాలి. కాగా, కరోనా ముఖ్యంగా మనిషి ఊపిరితిత్తులపై దాడి చేస్తున్నది. శరీరానికి ప్రాణవాయువు అందకుండా పోతున్నది. దీంతో గుండె, మెదడు, కిడ్నీలు, జీర్ణాశయం పని చేయకుండా పోతున్నాయి. ప్రాణవాయువు సరఫరా కాకపోవడంతో రక్తం కదలికలకు ఆటంకం కలుగుతున్నది. దీంతో మనిషి కొద్ది రోజుల్లోనే మరణిస్తున్నాడు. మనిషి శరీరంలో కరోనా వికృత చేష్టలకు అడ్డుకట్ట వేయాలంటే యోగా ఒక్కటే చక్కటి మార్గం. ఇందుకు కొన్ని బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు నిత్యం చేస్తే సరిపోతుంది. భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ, శీతలి, బ్రామరీ, సూర్యభేదిలు ఉపయోగపడుతాయి. వాటిని ఇప్పుడు చూద్దాం..సేతు బంధాసనం..
వెల్లకిలా పడుకొని కాళ్లను మోకాలి వరకు ముడవాలి. ఆ తర్వాత నడుమును వీలైనంత పైకి ఎత్తి ఉంచాలి. అప్పుడు భుజాలు, మెడ తల వెనుక భాగం నేలకు తగిలే విధంగా ఉంచుకోవాలి. ఇలా ఉండగలిగేంత సేపు ఉంచి తిరిగి యథా స్థితికి రావాలి. ఆసనంలో ఉన్నప్పుడు ఐదు నుంచి ఆరు సార్లు నిండుగా గాలిని పీల్చి వదలాలి. ఇలా చేయడం ద్వారా ఊపిరితిత్తులు ఆసనం వేసినప్పుడు ప్రభావితం అయ్యేలా ప్రతి కండరంపై ఒత్తిడి పడి శరీరం ఉత్తేజంగా మారుతుంది.
వక్రాసనం..
ముందుగా రెండు కాళ్లు చాపి దండాసనంలో కూర్చోవాలి. కుడి కాలు మోకాలు వద్ద వంచి పాదాన్ని చాచి ఉన్న ఎడమ కాలి మోకాలు పక్కన పెట్టాలి. వెన్నెముకను నిటారుగా పెట్టి నడుమును కుడి వైపునకు తిప్పి గాలి వదులుతూ ఎడమ చేతిని కుడి కాలు మీదుగా తీసుకొని కుడి కాలు బొటన వేలును పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇలా మెల్లగా ప్రాక్టీస్‌ చేయాలి. ఐదు నుంచి ఆరుసార్లు దీర్ఘ శ్వాస తీయడం మరువకూడదు. ఈ ఆసనం షుగర్‌ వ్యాధి బాధితులకు చాలా మేలు చేస్తుంది. ఊపిరితిత్తులు సమర్థవంతంగా పని చేస్తాయి. ఇక నడుము, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తొలగే అవకాశం ఉంటుంది.
మత్స్యాసనం..
నేలపై యోగా మ్యాట్‌ వేసుకొని వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత నడుము నుంచి ఛాతి భాగం వరకు పైకి ఎత్తి ఉంచాలి. ఆ తర్వాత మెడ భాగాన్ని బాగా వెనక్కి వచ్చి తలలోని మాడ భాగాన్ని నేలకు ఆనే విధంగా అమర్చుకోవాలి. శ్వాస యథావిధిగా తీసుకుంటూ ఉండాలి. ఊపిరితిత్తులు విశాలం కావడం వల్ల ఆల్వియోలు చక్కగా పని చేస్తాయి. దీంతో ఆక్సిజన్‌ సరఫరా సమృద్ధిగా జరుగుతుంది. శ్వాస కోశ సంబంధ వ్యాధులు తొలగిపోతాయి..
భుజంగాసనం..
మ్యాట్‌పై బోర్లా పడుకొని అరచేతులు చాతికి ఇరుపక్కలా పెట్టుకొని ఊపిరి పీల్చుతూ తల, ఛాతి, నాభి వరకు లేపి వెన్నెముక సాధ్యమైనంత వెనుకకు వంచాలి. మెడను బాగా సాగదీయాలి. ఐదు నుంచి ఆరు సార్లు శ్వాసను పీల్చాలి. 60 సెకండ్లు ఆసనంలో ఉండేలా ప్రయత్నించాలి. తిరిగి యథాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. రోగ నిరోధకశక్తి పెరిగి బయట నుంచి వచ్చే వైరస్‌ల నుంచి కాపాడుతుంది.
అర్థ చక్రాసనం..
నిటారుగా నిలబడాలి. నడుము వద్ద అరచేతులు పెట్టుకొని ఊపిరి పీల్చుతూ నడుము నుంచి తల భాగాన్ని వెనుకకు వంచాలి. మీరు ఉండగలిగినంత సేపు ఉండాలి. తర్వాత యథాస్థితికి రావాలి. ఇది ఊపిరితిత్తులకు బలాన్ని ఇవ్వడంతోపాటు చెడు సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. గొంతులోని అసమానతలు తొలిగిపోవడంతోపాటు శ్వాసనాళాలు శుభ్రపడుతాయి.
పర్వతాసనం..
మొదటగా బోర్లా పడుకోవాలి. చేతులు చాతి పక్కన పెట్టుకోవాలి. రెండు కాళ్లను జత చేసుకోవాలి. నడుము పైకి ఎత్తుతూ పర్వతంలా ఉండాలి. దీంతో ఊపిరితిత్తులు క్లీన్‌ అవడంతోపాటు కఫం తొలగిపోతుంది. మెదడుకు రక్తప్రసరణ జరిగి విశ్రాంతి కలుగుతుంది.
పశ్చిమోత్తాసనం..
పశ్చిమోత్వాసనాన్ని ఉగ్రాసనం అని కూడా అంటారు. దీనిని మ్యాట్‌పై కూర్చొని కాళ్లు చాచాలి. మెల్లిగా నడుము వంచుతూ చేతులు కాళ్లకు తాకించాలి. దీనిద్వారా మెదడుకు రక్తప్రసరణ జరుగుతుంది. ఊపిరితిత్తులు, గుండె పనితీరు మెరుగవుతుంది. ఇది రోజు చేస్తే కరోనా వంటి వైరస్‌ను సులభంగా తట్టుకోగలం.
ఉష్ణాసనం..
మోకాళ్లపై నిల్చొని నడుము దగ్గర నుంచి తలభాగం వరకు వెనుకకు వంచి పాదాలను చేతులతో అందుకోవాలి. ఇలా చేయలేని వారు చేతులను నడుముపై ఉంచి వెనుకకు సాధ్యమైనంత వరకు వంగాలి. ఊపిరితిత్తులు విశాలమవుతాయి. ఉష్ణం పుట్టి ఊపిరితిత్తులోని అసమానతలు తొలిగిపోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ర్యాబిట్‌ బ్రీతింగ్‌..
వజ్రాసనంలో కూర్చోని మోకాళ్ల పక్కన మోచేతులను ఉంచే విధంగా చూసుకోవాలి. ఆ తర్వాత నాలుకను కింది పెదవి పంటి మధ్యగా భాగంలో అమర్చుకోవాలి. నోటిని తెరిచి గాలిని లోపలికి పీల్చాలి. తిరిగి వదలాలి. ఇలా చేయడం వల్ల గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది, ఈ క్రియ వల్ల కండరాలు సంకోచ, వ్యాకోచాలు జరుగుతాయి. ఇలా 20 నుంచి 30 సార్లు చేయాలి.
భ్రమరీ ప్రాణాయామం..
ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. వెన్నెముక, తల నిటారుగా పెట్టి రెండు కళ్లు, నోరు, చేవులను చేతి వేళ్లతో బంధించాలి. ఓంకారాన్ని ఉచ్ఛరించాలి. భ్రమరీ చేయడం వల్ల మనలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ (ఎన్‌వో) ఉత్పత్తి జరుగుతుంది. ఇది లాన్స్‌కు వెంటిలేషన్‌ను అందిస్తుంది. మనలోని రక్త కణాలు, న్యూరోనల్‌ టిష్యూ, ఇమ్యూనిటీ సిస్టం నుంచి నైట్రిక్‌ ఆక్సైడ్‌ల ఉత్పత్తి జరుగుతుంది. శ్వాస తీసుకునే ఇబ్బందులు తొలగి స్వాంతన చేకూరుతుంది. కృత్రిమ శ్వాస (ఆక్సిజన్‌) వంటి అవసరం ఉండదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యోగా చేద్దాం.. కరోనాను జయిద్దాం

ట్రెండింగ్‌

Advertisement