అచ్చంపేట, జూలై 10 : మహిళలు మగవారితో స మానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బల్మూర్ మండలం రాంనగర్ గ్రామానికి చెం దిన మహిళ వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్నది. భర్త సహకారం తీసుకోకుండానే విత్తనాలు వేయడం మొదలు పంటను ఇంటికి చేర్చే వరకు అంతటా తానై కష్టపడుతున్నది. పొలం దున్ని, మందు పిచికారీ చేసి, గుంటక దున్ని వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల పనులు స్వయంగా చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నది. మగవారికి దీటుగా వ్యవసాయం చేస్తూ అందరి తో శభాష్ అనిపించుకుంటున్నది. బోడ నిర్మల తన కున్న ఎనిమిది ఎకరాల పొలంలో వానకాలం, యా సంగిలో రెండు పంటలు పండిస్తున్నది. భర్త అంజ య్య సొంత ట్రాక్టర్‌తో పనులకు వెళ్తుంటాడు. వ్యవసాయాన్ని మొత్తం నిర్మల చూసుకుంటున్నది.
భర్త కేవలం ట్రాక్టర్‌తో పొలం చదును చేసి కావల్సిన విత్తనాలు అందించడం వరకే. విత్తనాలు వేయడం నుంచి పంట ఇంటికి చేర్చే వరకు నిర్మలనే చూసుకుంటున్నది. కూలీలతో పనులు చేయించడం, దున్నడం, మందులు చల్లడం, పంటకు పైపులు మార్చడం, బోరు మోటరు వేసి పంటలు సాగు చేయడం ఇలా అన్ని పనులు స్వయంగా చేసుకుంటున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలోనే ఉంటున్నది. రైతుబంధు ప్రవేశపెట్టక ముందు విత్తనాలు, మందుల కోసం అప్పు చేసేవారమని, ప్రస్తుతం అందుతున్న పెట్టుబడి సాయం డబ్బులతో విత్తనాలు కొనుగోలు చేస్తున్నామని నిర్మల చెప్పారు. రైతుబంధు డబ్బుతో 30 ప్యాకెట్లు పత్తి విత్తనాలు కొనుగోలు చేశానన్నారు. తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటే భర్త ఒక్కరే పనిచేస్తే సరిపోదని.. తాను కూడా కష్టపడాలనే ఉద్దేశంతో ఐదేండ్లుగా సాగు చేస్తున్నానని పేర్కొన్నారు. పిల్లలు, కుటుంబం కోసం ఎలాంటి అక్షరజ్ఞానం లేని బోడ నిర్మల పడుతున్న శ్రమ, పట్టుదల, కృషిని అభినందించాల్సిందేనని గ్రామస్తులు చెబుతున్నారు.
రూ.3 లక్షల పంట పండించిన..
ఐదేండ్లుగా పొలం పనులు మొత్తం నేనే చూసుకుంటున్న. ఎనిమిది ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటిన. పోయిన సారి పత్తి పండిస్తే రూ.3 లక్షలు వచ్చింది. పిల్లలను బాగా చదివించాలంటే డబ్బులు కావాలి. ఇంట్లో ఒక్కరే కష్టపడితే సరిపోదు. భర్త ట్రాక్టర్ నడుపుతాడు. నేను వ్యవసాయం చూసుకుంటాను. విత్తనాలు వేసే దగ్గర నుంచి పంట ఇంటికి తెచ్చే వరకు మొత్తం పనులు నేనే చేసుకుంటా. జీతగాళ్లను పెట్టుకుంటే ఏడాదికి రూ.లక్ష ఇవ్వాలి. కూలి మనిషిని పెట్టుకుంటే
రోజుకు రూ.600 ఇవ్వాలి. వాళ్లకెందుకు పైసలు ఇవ్వాలని నేనే పనులు చేస్తున్నాను. మన పని
మనం చేసుకుంటే తప్పేముంది. వ్యవసాయం చేయడమంటే నాకు ఇష్టం.నాకు అన్ని పనులు వస్తాయి.